తాగుడు మానవ జాతిని అనాదిగా పీడిస్తున్నది. తొలిదశలో ఓ సంస్కృతిగా మొదలైనా, తర్వాతి కాలంలో ఒక వ్యసనమై చాలామందిని మత్తులో పడదోస్తున్నది. ‘పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అన్న చట్టబద్ద హెచ్చరికలు చట్టుబండలుగానే మిగులుతున్నాయి. ప్రభుత్వ రాబడులకు మద్యపానం ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నది. ఈ వ్యసనంపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం ‘చల్ చల్ గుర్రం’ నాటిక.
నా టకం మొదలయ్యాక.. జోగారావు భార్య పుట్టింటికి వెళ్తుంది. స్నేహితుడు జాకీ వస్తాడు. ఇద్దరూ కలిసి మందు కొట్టాలని అనుకుంటారు. మరి డబ్బెలా? ఎవరికి వారు ఫ్రీగా వస్తే తాగాలని అనుకుంటున్నారు. ఇంతలో.. ఇంటి అద్దెకట్టమని జోగారావు భార్య దాచిన డబ్బు, రాసిన లేఖ పోపుల డబ్బాలో కనిపిస్తాయి. అదే సమయంలో ఇంటి ఓనర్ సన్యాసిరావు వస్తాడు. జోగారావు అద్దె డబ్బు ఓనర్కు ఇచ్చేప్పుడు అందులో ఓ వంద నొక్కేసి మందు బాటిల్ తీసుకువస్తాడు. సన్యాసిరావుకు మనసులో తాగాలని ఉన్నా… పెళ్లామంటే భయం, వంద పోయిందనే బాధ, కాస్త పెద్దరికం అభ్యంతర పెడుతుంటాయి. ఎట్టకేలకు ముగ్గురూ కూర్చొని మందు కొడుతూ ఉంటారు. కథ రంజుగా సాగుతూ ఉంటుంది. అదిగో అప్పుడే అసలు తాగుబోతు ప్రవేశిస్తాడు… ‘ఎక్స్క్యూజిమీ సార్! నా పేరు బెంజిమన్. మే ఐ కమిన్ సార్. నాకో పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పుడు లేదు సార్. నాకో పెళ్లాం ఉండేది. ఇప్పుడు లేదు. నాకు క్యాష్ వద్దు సార్. ఓ పెగ్గు మందుకావాలి సార్’ అంటూ ఆ వ్యక్తి ప్రాధేయపడతాడు. అతనికీ ఓ పెగ్గు పోస్తే.. తాక్కుంటూపోతాడు. ‘డబ్బులడుక్కునే వాళ్లను చూశాం. మందు ముష్టోడ్ని ఇప్పుడే కదా చూడ్డం’ అని ఆ ముగ్గురూ నవ్వుకుంటారు.
ఈసారి జోగారావు భార్య శ్యామల వచ్చి తలుపు కొడుతుంది. ఎక్కడివాళ్లు అక్కడ గప్ చుప్. అందరూ దాక్కుంటారు. జోగారావు అగరవత్తులు వెలిగించి మందు వాసన రాకుండా జాగ్రత్తపడతాడు. శ్యామల లోపలకు వచ్చి జాకీని గమనిస్తుంది. ‘నేనంటే బ్రహ్మచారిని. నీకేమైంది? దేవతలాంటి పెళ్లాన్ని పెట్టుకుని తాగడమెందుకురా? ఆ బాటిల్ ఇవ్వు బయట పారేస్తాను’ అంటూ లాక్కొని పట్టుకుపోతాడు. వంటింట్లో దాక్కున్న ఓనర్ సన్యాసిరావు నిదానంగా బయటకొస్తూ.. ‘నిజమేనయ్యా వంటిల్లు కురుస్తున్నమాట నిజమే. మేస్త్రీని పంపించి బాగు చేయిస్తాను’ అని నసుగుతూ వెళ్లిపోతాడు.
మందుగ్లాసు వాసన చూస్తూ శ్యామల ‘యాక్ ఎలా తాగుతారో?’ అని అసహ్యించుకుంటుంది. ‘నేను తాగను మొర్రో అంటే ఆ జాకీగాడే బలవంతాన తాగించాడు’ అంటూ జోగారావు యాక్షన్ చేస్తాడు. ‘మళ్లీ మొదటికొచ్చారు. ఛీ ఛీ మాట మీద నిలకడలేని మనిషి’ అని శ్యామల నొచ్చుకుంటుంది. జోగారావు మగ అహంకారంతో రెచ్చిపోతాడు. ‘యస్. తాగుతానే… తాగుతాను. ఇంకా తాగుతాను. కట్టుకున్న పెళ్లాం కూడా అసహ్యించుకున్న తర్వాత ఎందుకే ఈ జన్మ’ అంటూ ఓవర్ యాక్షన్తో ఇంకా తాగుతూ అధోలోకంలోకి జారిపోతాడు. కానీ, తాగుడు మానతానని ససేమిరా అనడు.
మళ్లీ కొన్నాళ్లకి జాకీ-జోగారావు కలిసి తప్పతాగి ఇంటికి వస్తే… శ్యామల ఇంట్లో ఉండదు. జోగారావుకు ఇది నచ్చక నానా యాగీ చేస్తాడు. జాకీ వెళ్తాడు. బెంజిమన్ వస్తాడు. ‘ఇద్దరం కలిసి తాగుడికి అడుక్కుందాం. పదా!’ అంటాడు. పతనావస్థకు పరాకాష్ట అది. ‘మీరెలాగూ మారరు. మీతో కాపురం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు. నేనలా బతకలేను’ అని చివరకు శ్యామల వెళ్లిపోతుంది. అది ఓ తాగుబోతు భార్య అంతరంగ ఘోష.
‘నా పేరు బెంజిమన్ సార్. నాకో భార్య ఉండేది. ఇప్పుడు లేదు’ అనే మాటలు ప్రతిధ్వనిస్తుండగా తెరపడుతుంది. ఈ నాటిక రూపొంది ముప్పయ్ ఏళ్లయినా బెంజిమన్ మాటలు చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఇటీవల రవీంద్రభారతి (హైదరాబాద్)లో ప్రదర్శించిన ఈ నాటిక.. మద్యపాన సమస్య తీవ్రతను, దాని నిర్మూలన ఆవశ్యకతను మరోసారి చెప్పింది.
నాటిక పేరు: చల్ చల్ గుర్రం
రచన: తనికెళ్ల భరణి
దర్శకత్వం: సోల్జర్ షఫీ
ప్రదర్శన: ఓరుగల్లు శారదా నాట్యమండలి
పాత్రధధారులు: సురేందర్, షఫీ,
సుధాకర్, శర్మ, లహరి.