‘మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న నటి రిచా జోషి. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో తన ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది ఈ ముంబయి బ్యూటీ. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న రిచా ఇటీవల ‘రామ్‌నగర్ బన్ని’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. నటిగా ఎదగాలంటే శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ రిచా పంచుకున్న కబుర్లు..
నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాను. నా కుటుంబం, స్నేహితులు చాలా ప్రోత్సహించారు. ఒక మంచి నటిగా ఎదగాలంటే సవాలు విసిరే పాత్రలనే ఎంచుకోవాలి. లేడీ ఓరియెంటెడ్ కథలంటే ఇష్టం. అలాంటి సినిమాల్లో ఎమోషన్స్‌కి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు ఆ తరహా సినిమాల్లో నటించాలని ఉంది.
ఓటీటీ వచ్చాక సినిమా చూడటంలో ప్రేక్షకుడి కోణం మారిపోయింది. అందుకు తగ్గట్టే సినిమా నిర్దేశకులు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓటీటీ చక్కని వేదికగా మారింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీనటులకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఓటీటీ చక్కని ప్లాట్‌ఫామ్‌గా మారింది.
సినీ రంగంలో ఒక్కో పరిశ్రమదీ ఒక్కో శైలి. నేను పుట్టి పెరిగింది ముంబయి అయినప్పటికీ బాలీవుడ్ కంటే తమిళ, మలయాళ సినిమాలనే ఎక్కువగా ఆస్వాదిస్తా. దక్షిణాది సినిమాల్లో కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాత్రలు సహజంగా, నిజ జీవితంలోలా ఉంటాయనిపిస్తుంది.
సంగీతం, పెయింటింగ్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో క్లాసికల్, ఇండీ సంగీతం వింటాను. భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పుడు నటిగా నేను ఒక మెట్టు పైకి ఎదిగినట్టు భావిస్తాను.
పీరియాడికల్ డ్రామా, బయోపిక్‌లలో నటించాలని ఉంది. ఒక కాలానికి, సంస్కృతికి చెందిన వ్యక్తిగా కనిపించడం, వారి పాత్రలో నటించడం చాలా కష్టమైన పని. కానీ, అలాంటి పాత్రల్లో తెరపై కనిపించినప్పుడు కలిగే సంతృప్తి.. ఎంతో గొప్పగా ఉంటుంది.
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు ప్రాధాన్యం ఇస్తాను. కొన్నిసార్లు నాకోసం సమయం కేటాయించుకునేందుకు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటాను. నేను మంచి ఫుడీని. ఖాళీగా ఉంటే కొత్త వంటకాలను ట్రై చేస్తుంటా. పుస్తకాలు చదవడం నా హాబీ. ఎక్కువగా హిస్టారికల్ ఫిక్షన్స్ చదువుతాను. స్నేహితులు, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం ఇష్టం. ప్రకృతిని ఆరాధిస్తా.
కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారికి కొన్ని భయాలు ఉంటాయి. కానీ భయాన్ని అధిగమించి సరైన అవకాశం వచ్చేవరకు ఓపికగా ఉండాలి. నటనలో రాణించాలంటే శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా దాని ద్వారా నేర్చుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.