అందాలకోసం ఆవరణంలో ఉండే చెట్లను నరికి.. చక్కని ఆర్కిటెక్చర్‌తో నిర్మాణం చేపట్టి .. అద్భుతమైన ఇంటీరియర్‌తో అలంకరించే రోజుల్లో పచ్చదనానికి చోటుందంటారా? అంటే ఎందుకుండదు. కొందరు మహానుభావులు ఉంటారు! నడిచివచ్చిన దారిని మరిచిపోని బాటసారులు ఉంటారు. పల్లెలో పుట్టి పచ్చని చెట్లమధ్యే పెరిగిన ఓ పల్లె ప్రేమికుడు కాంక్రీటు కీకారాణ్యంలో ఓ అరణ్యాన్నే పెంచుతున్నాడు! పల్లెమీద ప్రేమతో టెర్రస్‌పై అడవిలాంటి వనాన్ని, జీవజాతులకు ఆవాసాన్ని కల్పించిన ‘ఒక నగరం – ఒక రైతు ప్రేమకథ’ ఇది!
బీయెస్సీ పూర్తయిన తర్వాత వివిధ వృత్తులు చేస్తూ చివరికి నాగార్జున సిమెంట్‌లో ప్లాంట్ ఇన్చార్జ్ ఉద్యోగంలో చేరాడు వేగేశ్న రామరాజు. కొంతకాలం తర్వాత నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఒక చిన్న ఇంట్లో కుటుంబంతో అద్దెకు దిగారు. సిమెంటు గోడలే పరిసరాలైన ఆ ఇంట్లో ఆయన అడుగుపెట్టిన వెంటనే రకరకాల మొక్కలూ అడుగుపెట్టి, వేళ్లూనుకున్నాయి. పసిపిల్లల్ని కాపాడుకున్నట్టు ప్రేమగా మొక్కలను పెంచారు. ఆయన ప్రేమపంట మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ వంటింటి అవసరాలు తీర్చింది. నీరు పోసిన చేతికి ఫల‘సాయం’ చేయడమే తెలిసిన మొక్కలు కమ్మని కూరలు, తియ్యని ఫలాలు ఇచ్చాయి. చూపులకు ఆహ్లాదం పంచుతూ, కమ్మని రుచులతో ఆనందపరిచే ఆ ఇంటిపంటకు, ఈ పట్నం రైతు కుటుంబానికి అనుబంధం పెరిగింది.
పుట్టింటి నుంచి మెట్టినింటికి!
రామరాజు కొన్నాళ్లకు సొంతిల్లు కట్టుకోవాలనుకున్నాడు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లో తోడల్లుడితో కలిసి స్థలం కొనుక్కున్నాడు. 19 సంవత్సరాల కిందట రెండంతస్తులతో ఇల్లు నిర్మించుకున్నారు. పై అంతస్తులో రామరాజు కుటుంబం, కింది అంతస్తులో తోడల్లుడి కుటుంబం కాపురం పెట్టాయి. ఈ పట్నం రైతు తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన మొక్కల్నీ కొత్తింటికి తీసుకొచ్చాడు. పంపకాల్లో భాగంగా సెల్లార్ తనకు, టెర్రస్ తోడల్లుడికి సొంతమైంది. కాలంతోపాటే వస్తున్న ఆర్థిక మార్పులు వాళ్లనూ మార్చేశాయి. మనిషికో కారు రావడంతో పార్కింగ్‌కు మొక్కలు అడ్డయ్యాయి. ప్రేమతో పెంచుకున్న మొక్కల్ని వీధులపాలు చేయలేక వాటిలో కొన్నిటిని ఇంట్లోకి ఆహ్వానించారు. మరికొన్నిటికి ఆ ఇంటి టెర్రస్‌పై విడిది ఏర్పాటుచేశారు. ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూ, ఆయన, కుటుంబసభ్యులు ఆ మొక్కల బాగోగులు చూసుకున్నారు.
అవిశ్రాంత సేవ!
రామరాజు వయసు పైబడింది. ఇప్పుడాయనకు 71 ఏండ్లు. పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ అంటే విశ్రాంత జీవితం! కాదంటారు రామరాజు. సోమరులు విశ్రాంతినీ పనిగా భావిస్తారు. కానీ రామరాజులాంటి శ్రమజీవులు పనినే విశ్రాంతిగా భావిస్తారు. ఆనందంగా ఉండటానికి ఆయన పూర్తికాలం మొక్కలకే కేటాయించడం మొదలుపెట్టారు. పొద్దంతా తన మేడతోటలోనే కాలం గడుపుతారు. ఆ మొక్కలతో కాసేపు సంభాషిస్తాడు. మాటలురాని పిల్లలు తమకేది కావాలో అడగలేరు. వాళ్లకేది కావాలో పెద్దలే అందించాలి. మొక్కల పెంపకం కూడా అలాంటిదే. పిల్లలకు ఎప్పుడు ఎంత ఆహారం ఇవ్వాలో, ఏ ఆహారం ఇవ్వాలో పెద్దలు చూసుకున్నట్లే మొక్కలకు ఎదుగుదల, కాపు, కాలాన్ని బట్టి ఆహారం అందించాలి. నేలలో సారం తగ్గితే సారవంతమైన మట్టిని, వర్మి కంపోస్ట్, కొబ్బరి పిట్టు వేళ్లనోళ్లకు అందించి వాటి ఆకలి తీర్చాలి. పిల్లలకు కొందరికి తీపి ఇష్టం. ఇంకొందరికి పులుపు ఇష్టం. జిహ్వకో రుచి. అభిరుచికి తగ్గట్లుగా వడ్డిస్తేనే ఆరగిస్తారు చిన్నారులు. మొక్కలు కూడా అంతే. శాఖీయ నిర్మాణాన్ని బట్టి వాటి అవసరాలుంటాయి. ఆ అవసరాల్ని బట్టి రామరాజు నీరు పోస్తారు. వాటికి తెగులు సోకితే సేంద్రియ పద్ధతిలో వేపనూనె, వెల్లుల్లి రసంతో గృహవైద్యం చేస్తాడు.
ప్రపంచ వనం!
రూఫ్ గార్డెల్లా నాటిన ఈ వనంలోకి 19 సంవత్సరాల్లో ఒక్కో మొక్క వచ్చి చేరింది. రూఫ్ ఫారెస్ట్‌లా మారింది. ఇక్కడ ఎడారి మొక్కలు, సముద్రపు నాచు, నీటి మొక్కలు, సతత హరిత అరణ్యాల్లో పెరిగే మొక్కలు, వృక్షాలు, పొదలు, తీగలు, కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, దుంపకూరలు, మంచుకొండలపై పెరిగే రకాలూ చేరాయి. ఇప్పడు మొత్తం 120 రకాల వృక్షాలున్నాయి. ఎర్ర చందనం, శ్రీగంధం, మేడి, వెదురు, గురివింద, జువ్వి, తమలపాకు, అత్తిపత్తి, యుకాగ్రీన్ ఇవన్నీ భిన్నమైన వాతావరణాల్లో, వివిధ రకాల నేలలపై పెరుగుతాయి. కానీ రామరాజు కృషితో అన్ని రకాలూ ఒకే రూఫ్‌పై చేరాయి. ఈ రూఫ్ ఫారెస్ట్‌ను చూశారంటే ఐదు ఖండాలనూ చూసినంత ఆనందం కలుగుతుంది. ఈ గార్డెన్లో శీతల దేశాల్లో పెరిగే మొక్కల కోసం చక్కని పందిళ్లు వేసి ఆకుపచ్చ పరదాలు పరిచారు. మిరపకాయల నుంచి దుంప కూరల వరకు దాదాపు పాతిక రకాల కూరగాయల్ని పండిస్తున్నారు రామరాజు. హిమగిరుల్లో కనిపించే వెల్వెట్ ఆపిల్ ఈ గార్డెన్లో పెరుగుతున్నది. మార్కెట్లో దొరికే పళ్లు మాత్రమే కాదు ఇక్కడికి సరఫరా కాని దేశీయ, విదేశీ ఫలాలు కూడా ఆయన మేడపై పండుతున్నాయి. ఏ కాలంలో కాసే చెట్లు ఆ కాలంలో ఫలాలనిస్తూ ఆయన రుణం తీర్చుకుంటున్నాయి. పండ్ల మొక్కలకు మేమేమీ తీసిపోమన్నట్లుగా ఆకుకూరలు, పాదులు, కూరగాయ మొక్కలు కూడా ఆ ఇంటికి మేలు చేస్తున్నాయి. వంటింట్లో తాలింపులో వేగే కరివేపాకు నుంచి కూరలో ఆఖరుగా వేసే మసాలా దినుసుల వరకు ఇక్కడ పండుతున్నాయి. మార్కెట్లో మండే ధరల్ని ముట్టుకోకుండా ప్రతి ఉదయానా చల్లని పాదులతో కరచాలనం చేసే ఆ ఇల్లాలికి కమ్మని కూరలిస్తున్నదీ పెరడు.
మల్లియలు.. మాలికలు..
మల్లె తీగకు పందిరుంటే చాలు పైకి ఎగబాకి విరబూస్తుంది. పచ్చని మొక్కలకు పండంటి పందిరి వేసిన ఈ పెద్దమనిషి ఇంటిని మల్లియలు, మాలికలు వదులుతాయా? చక్కగా చేరిపోయి గుబాళిస్తున్నాయీ పెరటిలో! అంతేకాదు గన్నేరులోనే అనేక రంగులు, సువర్ణరేఖ, ఆర్కిడ్స్, ఇంఫాల్ లిల్లి వంటి రంగురంగుల పూలు పాలబుగ్గల్లా విరబూసి నవ్వుతూ కనిపిస్తున్నాయి. ఎడారి మొక్కలకు చక్కగా ఎండ ప్రసరించేలా, నీటి మొక్కల కోసం చెలిమెల్లాంటి గాబులు, కుండీలు, ట్రేలలో నీటిని నింపి ఆవాసాలను సృష్టించారు. ఆ ఆవాసాలపై తేలి నీటి మొక్కలు నివసిస్తుంటే ఆ నీటిలో మునిగి చేపలు, నత్తలు, ఆల్చిప్పలు హాయిగా జీవిస్తున్నాయి. సహజమైన చెరువులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్న ఈ ఇంటి చెరువు ఓ అద్భుతం! పచ్చని చెట్లే ప్రగతి మెట్లని నమ్ముతాం కానీ ఆ మెట్లను నిర్మించుకుని ఎక్కిందెప్పుడు? ఎదిగేదెప్పుడు? లోకం మారేదెప్పుడు? అనుకుని యుగాంతం వచ్చినట్లేనని భూతాపాన్ని పెంచుకోకండి. జీవవైవిధ్యాన్ని కాపాడే వైవిధ్యమైన జీవితాన్ని ఆచరించే హీరోలూ మన మధ్యే ఉన్నారు.
నాతో నా స్వర్గం
చెట్లపై ఎందుకింత మమకారం అని రామరాజును అడిగితే… ‘పల్లెలో పుట్టాను. చెట్ల మధ్య పెరిగాను. చేల మధ్య నడిచాను. పల్లె నా బాల్యం, పంటచేలు నా జీవితం. రైతుకు, చేనుకు ఉండే అనుబంధం తల్లీ బిడ్డల పేగు బంధంలాంటిదే. విడదీయలేనిది. వీడిపోలేనిది. పంటచేలతో ఉండే పల్లె భూతల స్వర్గం’ అని చెబుతారు. బతుకుదెరువు కోసం తన స్వర్గానికి దూరంగా జరిగినా ఆ స్వర్గాన్నే దగ్గరికి తీసుకున్న రామరాజు ఆకుపచ్చ ప్రేమ ఎనలేనిది. అయినా సరే ఈ ప్రేమతోనూ పల్లె కృతజ్ఞత తీరదంటున్నారాయన!