వేసవి వచ్చినా ముంబైకర్లు బేఫికర్‌గా ఉంటారు. మండుటెండలు దంచేస్తున్నా పూణెవాసులు పుర్సత్గా కనిపిస్తారు. ఎందుకంటే.. సూర్యతాపాన్ని భరించలేం అనుకున్న మరుక్షణం.. చలో మాథెరాన్ అనేస్తారు. పడమటి కనుమల్లో ఉన్న మాథెరాన్ పచ్చదనంతో కనువిందు చేస్తుంది. సముద్రమట్టానికి 2650 అడుగుల ఎత్తులో ఉండటంతో భానుడి భగభగలు ఇక్కడ పనిచేయవు. స్వచ్ఛమైన గాలి, చల్లనైన రాత్రి.. అందుకే ఖండాలా, లోనావాలా తర్వాత వేసవి విడిదిగా మాథెరాన్ ప్రాచుర్యం పొందింది.
రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్‌కు దేశవిదేశాల నుంచి పర్యాటకులు విచ్చేస్తారు. ఎవరు వచ్చినా.. మాథెరాన్ కొండల పాదాల చెంత వాహనాలు ఆపాల్సిందే. పర్యావరణ పరిరక్షణ కోసం మాథెరాన్ కొండలపై వాహనాలను నిషేధించారు. గుర్రంపై స్వారీ చేస్తూ విహరించవచ్చు. మాథెరాన్‌లో 38 అధికారిక వ్యూపాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న ప్రాంతాలు చూసేయొచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు వ్యూ పాయింట్ల దగ్గర పర్యాటకులు క్యూ కడతారు. మాథెరాన్‌లో రిసార్టులు, హోటళ్లు ఉన్నాయి. ప్రబల్ గఢ్ కోట, అంబర్నాథ్ ఆలయం, చార్లెట్ సరస్సు, శివాజీ నిచ్చెన ఇవన్నీ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. వన్హిల్ పాయింట్, హనీమూన్ హిల్, అలెగ్జాండర్ పాయింట్ ఇలా రకరకాల వ్యూపాయింట్లు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తాయి.
చేరుకునేదిలా..
ముంబై నుంచి 90 కి.మీ., పూణె నుంచి 120 కి.మీ. దూరంలో మాథెరాన్ ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో మాథెరాన్ పర్వత పాదాల చెంతనుండే నెరాల్కు చేరుకోవచ్చు. పూణె, ముంబై నుంచి నెరాల్ జంక్షన్‌కు రైళ్లు కూడా ఉన్నాయి. నెరాల్ జంక్షన్ నుంచి మాథెరాన్ కొండపైకి రైలుమార్గం అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి 21 కిలోమీటర్లు ప్రయాణిస్తే మాథెరాన్ చేరుకోవచ్చు. కొండలు, గుట్టల నడుమ రెండుగంటలపాటు సాగే టాయ్ ట్రైన్ ప్రయాణం అత్యద్భుతంగా సాగిపోతుంది.