శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 00:52:16

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

సింగపూరు నుంచిహాస్యం చదవడం ఎవరికైనా ఆహ్లాదకరమైన అనుభవమే. కానీ రాసేవాళ్లకి అది కత్తి మీద సాము. వాక్యం పేలకపోతే పాఠకుడు నిరుత్సాహపడతాడు, హాస్యం మోతాదుకు మించితే రచయితే నవ్వులపాలవుతాడు. కానీ ఈ పుస్తకంలో ఉన్న కథలు హాస్యపు పాళ్లని సరిగా రంగరించినట్లే కనిపిస్తాయి. పైగా చాలా కథలకు నేపథ్యం సింగపూర్‌ కావడం విశేషం. ఇప్పటివరకు అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలలో స్థిరపడిన తెలుగువారి కథలే వినబడుతూ వచ్చాయి. కానీ ఇది సింగపూరు నుంచి వెలువడిన తొలి కథా సంకలనం. ఇప్పటి పెండ్లిండ్ల తీరు (ప్యాకేజీ పెళ్లి), ఫేస్‌బుక్‌ మోసాలు (సత్తు-జిత్తు), నవ్వించే భయాలు (శార్వరి) లాంటి కథలెన్నో పలకరిస్తాయి. ‘పనిమనిషోపాఖ్యానం’, ‘గమ్మత్తు మరమ్మత్తు’ నవ్విస్తూనే సింగపూర్‌ జీవితాన్ని పరిచయం చేస్తాయి. కేవలం హాస్యకథలే కాదు.... అరుదైన స్నేహాన్ని కథలా మలిచిన ‘స్నేహం విలువ’, భార్యాభర్తల అనుబంధాన్ని ప్రతిబింబించే ‘కలకానిదీ... విలువైనదీ..’ లాంటి కథలూ పలకరిస్తాయి.


అలా సింగపురంలో...రచన: రాధిక మంగిపూడి

పేజీలు: 132, వెల: 100/-

ప్రతులకు: 80963 10140


బతుకు సంతకం

దస్తూరి మనిషిమనిషికీ ప్రత్యేకమైన పరిచయం. ఆ వ్యక్తి మనస్తత్వాన్ని కూడా పట్టించే సాధనం. ఆ లెక్కన ప్రతి ఊరికీ ఓ దస్తూరి ఉండితీరుతుంది. అదే తన వైవిధ్యమైన జీవన విధానం. అలా తెలంగాణ గ్రామీణ సంస్కృతిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు రచయిత. సుదీర్ఘకాలం పాటు శీర్షికలా సాగిన ఆ రచనల సంకలనం ఇది. ఒకప్పుడు గ్రామీణం ఎలా ఉండేది అన్న నోస్టాల్జియాలా సాగుతుంది. మరోవైపు... నాటి పదబంధాలనీ, పనిముట్లనీ గుర్తుచేసి చరిత్రను నమోదు చేస్తుంది. అప్పటి వృత్తి పనులు ఎలా సాగేవి, బతుకమ్మ ఎలా ఆడేది, తీర్థాలను ఏ లక్ష్యంతో నిర్వహించేవారు... లాంటి సవాలక్ష సాంస్కృతిక వివరాలు కనిపిస్తాయి. ఒక్క తరంలోనే అంతరించిపోయిన ఆటలనీ, మాసిపోయిన మానవ సంబంధాలనీ గుర్తుచేసి మనసును మెలిపెడతాయి. ఇది ఓ మనిషి చూసిన బతుకుచిత్రం కాదు. ఓ తరం దాటి వచ్చిన వారధి. తెలంగాణ అస్తిత్వాన్ని మరికాస్త తరచిచూడాలనుకునే వాళ్లకి ఓ అమూల్యమైన కానుక.

ఊరి దస్తూరి

రచన: అన్నవరం దేవేందర్‌

పేజీలు: 352, వెల: 250/-

ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలు


కవిత్వం యథాతథం

సాహిత్యమే వ్యాపకమైన నిన్నటి తరానికి కవిత్వం రాయడం ఓ మజా! ఇంటికో రచయిత ఉన్న రోజులవి. కానీ కాలం గడిచేకొద్దీ, బతుకు బరువేదో అక్షరాలని చిదిమేస్తుంది. పాత కవితలన్నీ రీసైకిల్డ్‌ కాగితాలుగా మారిపోతాయి. అలాంటిది ఓ వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకుని, తన దస్తూరితో రాసుకున్న పుస్తకాన్ని యథాతథంగా ముద్రించాలనుకుంటే... అది సాహసమే! 16 ఏండ్ల వయసులో రాసిన కవితలను 30 ఏండ్ల తర్వాత కూడా అచ్చు వేయాలనుకోవడం... తన రాత మీద ఉన్న నమ్మకమే! అదే ఈ కవితా సంపుటి. ఆ కవితలకు జోడింపుగా అప్పుడు గీసుకున్న చిత్రాలనే వినియోగించడం ప్రత్యేకం. ఆ వయసుకు సహజాతంగానే తోచే ప్రణయం, ఆవేశాలే ఈ కవితల్లో ముఖ్య వస్తువులుగా కనిపిస్తాయి. ‘ఒక మనిషిగా/ సాటి మనిషికి/ నేనేమి చేయగలను?/ చదవడమా.../ ఓదార్చడమా’ అనే వాక్యాలు చాలు, ఇది తీసిపారేయాల్సిన కౌమారపు కవితల పుస్తకం కాదని రూఢిచేయడానికి.


సుషుప్తి నుంచి

రచన: మామిడి హరికృష్ణ

పేజీలు: 87, వెల: 150/-

ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలుఒక సంస్కృతిని నాశనం చేయాలంటే.. పుస్తకాలను తగలబెట్టాల్సిన అవసరం లేదు. పుస్తకాలను చదివే అలవాటును మాన్పిస్తే చాలు.

 -రే బ్రాడ్బరీ


logo