నార్డిక్ ప్రాంతం భూగోళంపై ఐరోపా ఖండం ఉత్తర ప్రాంతంలో, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ చూసినా మంచుతో కప్పేసిన పర్వతాలు, ఆకుపచ్చటి మైదానాలు కనువిందు చేస్తుంటాయి. అంతటి అందమైన ప్రాంతంలో పురుడు పోసుకున్న వ్యాయామ ప్రక్రియ నార్డిక్ వాకింగ్. సాధారణ నడకతో పోలిస్తే ఈ తరహా వాకింగ్ మన శరీరంలో క్యాలరీలను ఎక్కువగా కరిగిస్తుంది. అంతే కాదు రెండు అరచేతులతో కర్రలను కదుపుతూ సాగే నార్డిక్ వాక్ సరదాగా ఉంటుంది.
నార్డిక్ వాకింగ్ 1960లలో అభివృద్ధి చెందింది. ఫిన్లాండ్లో స్కీయింగ్ చేసేవాళ్లకు వేసవి వ్యాయామ శిక్షణ కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన రెండు కర్రల ఊతంగా నడక సాగిస్తారు. ఈ కర్రలను రెండు చేతుల్లో పట్టీలకు బిగించుకుని అరచేతులతో నేలపై కదుపుతూ నడవడం ప్రధానంగా ఉంటుంది. వ్యాయామ విద్యలో భాగంగా దీన్ని 1966లో సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కీళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తూ చేతులు, భుజాలు, ఛాతీ, శరీర మధ్యభాగానికి పనిచెపుతుంది.