గత ఏడాది నుంచి నాకు మూత్రంలో మంట వస్తున్నది. వీర్య స్ఖలనమప్పుడు కూడా మంట భరించలేక పోతున్నా. ఈ మధ్యనే నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. భయంతో వాటిని వాయిదా వేస్తున్నా. డాక్టర్‌కు చూపించుకోవాలంటే భయంగా ఉంది. ఒక్కోసారి చలి జ్వరం కూడా వస్తుంది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.- విజయ్, ఖమ్మం
విజయ్! మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అది ‘ప్రొస్టేట్ గ్రంథి వాపు’ కావచ్చు. ప్రొస్టేట్ వ్యాధికి పూర్తిస్థాయి ఆధునిక చికిత్స ఉంది. ప్రొస్టేట్ గ్రంథి మూత్రాశయానికి కిందిభాగంలో ఉండి, మూత్రనాళం పైభాగాన్ని చుట్టి ఉంటుంది. ఇది కొంత ఆమ్లత్వాన్ని కలిగి కొన్ని స్రావాల్ని స్రవిస్తుంది. ఈ స్రావాలలో సిట్రిక్ యాసిడ్ ప్రొస్టేటిక్ యాసిడ్, ఫాస్పాటేజ్ ప్రొస్టాగ్లాండిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీర్యంలో 14 నుంచి 35 శాతం పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి స్రావాలే. ఇవి వీర్యకణాల కదలికకు ఉపయోగపడుతాయి.
ప్రొస్టెటిసీకి కారణాలు :‘ప్రొస్టెటిస్’ అంటే ప్రొస్టేట్ గ్రంథివాపు. మూత్రమార్గం నుంచి సూక్ష్మక్రిములు ప్రొస్టేట్ గ్రంథిని చేరడం, రక్తం ద్వారా, లింఫ్ గ్రంథులద్వారా ప్రొస్టేట్‌కు సూక్ష్మక్రిములు చేరడం వల్ల ఆ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వస్తుంది.
లక్షణాలు : జ్వరం, చలి, నడుం నొప్పి, తరచూ మూత్ర విసర్జన, ఆ సమయంలో మంట, నొప్పి, వీర్యస్ఖలనంలో మంట, నొప్పి, కండరాల్లో, కీళ్లల్లో నొప్పితోపాటు.. మూత్రం దుర్వాసనతో ఉంటుంది. మూత్రపరీక్షల్లో రక్తం కనిపిస్తుంది. మూత్రం ఆపుకోలేక పోవడం, మూత్రనాళం చుట్టూ ప్రొస్టేట్ వాపు అధికమైతే, ఆ మార్గం కూడా మూసుకుపోయి మూత్రం బయటకు రావడం కష్టమవుతుంది. గట్టి కుర్చీపై కూర్చున్నప్పుడు నొప్పి కలుగుతుంది. ప్రొస్టేట్ గ్రంథివాపు దీర్ఘకాలం ఉంటుంది. కొద్దిగా జ్వరం మాటిమాటికీ రావడం, మూత్రంలో ప్రొస్టేట్ గ్రంథి స్రావాలు జిగురుగా స్రవించడం ఒక లక్షణం.
వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీతో పాటు వివిధ దశల్లోని మూత్రాన్ని పరీక్షిస్తారు. అలాగే, ప్రొస్టేట్ గ్రంథిపైన కొన్ని రకాల మందులు (యాంటీబయాటిక్స్) మాత్రమే పనిచేస్తాయి. కోర్సుని పూర్తి చేయడం చాలా ముఖ్యం. డాక్టరు చెప్పిన కోర్సు పూర్తి చేయకపోతే ఇన్ఫెక్షన్ తిరిగి వస్తుంది. అలాగే, సుఖవ్యాధుల వల్లకూడా ప్రొస్టేట్ వ్యాధి వస్తుంది. కాబట్టి, కచ్చితంగా మంచి చికిత్స తీసుకోవాలి.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com