ఒకప్పటి కరువు కాలంల బతుకు కోసం పల్లె పొమ్మంటే పట్నం రమ్మనేది. కాలం మారిపోయింది. ఇప్పుడు పట్నం పొమ్మంటున్నది. కన్నతల్లి లాంటి పల్లె మళ్లీ రమ్మంటున్నది. కానీ, కన్న ఊరు కడుపునింపేట్టు లేదు. పేదరికం, నిరుద్యోగం పీడించే ఆ పల్లెతల్లి బిడ్డలకు ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టి బతుకు తొవ్వ చూపిస్తున్నది స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. పైసా ఫీజు లేదు. మెస్ బిల్లు లేదు. చదువు చెప్పి, కొలువు ఇప్పిచ్చే ఈ బతుకు బడి.. పాతికేండ్లలో వేలమందిని ఆదరించి అన్నం పెట్టింది. బతుకు దారి చూపింది.
– నాగవర్ధన్ రాయల
వందల ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడుతున్నరు. ఈ పోటీ ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకునేటందుకు ఇల్లు వదిలి, ఊరు దాటి, అప్పులు చేసి, పస్తులుండి.. రాత్రీపగలూ పుస్తకాలతో కుస్తీ పట్టేటోళ్లెందరో? వచ్చిన నోటిఫికేషన్ ఎక్కిరిస్తే.. రాని నోటిఫికేషన్ కోసం ఎదురు చూసుకుంట ఉండేటోళ్లల్ల తొంభై శాతం మంది మళ్లీ నష్టపోయేటోళ్లే. పాపం.. కళ్లు తెరిచేలోపే కాలం గడిచిపోతది. పోగొట్టుకున్న జీవితం, పైసలు తిరిగిరావు. కానీ, చేసిన అప్పులు వడ్డీతో కలిసి ఎంబడిపడతయి. సంవత్సరాలపాటు సదువుడే.. కానీ, ఎందులా నైపుణ్యం నేర్పని విద్య యాడికిపోయినా కొరగాదు. చివరికి ఏ చదువూ అక్కర్లేని చిన్న కొలువుల చేరిపోక తప్పేట్టు లేదు. బిడ్డ తన కాళ్ల మీద తాను నిలబడితే చాలనుకునే అమ్మానాన్నల ఆశలు తీర్చలేక… కన్నవాళ్లను చేయిచాపి అడగలేక… చిన్న జీతం కోసం రోజులో సగం కష్టపడే నౌకరీకి సిద్ధపడుతున్నరు చానామంది. మాల్స్, స్కూల్స్, మార్కెట్స్‌లో కనిపించే సేల్స్‌మ్యాన్, ఎగ్జిక్యూటివ్, టీచర్, అకౌంటెంట్.. పేర్లు ఏవైనా అవన్నీ చిరుద్యోగాలే. నిరుద్యోగుల (చిరు) ఆశాదీపాలే! ఒకరి జీవితానికి సరిపోని ఈ సంపాదనను నమ్ముకుని జీవితంలోకి ఇంకో తోడును తెచ్చుకోవడానికీ జంకుతరు ఈ చిరుద్యోగులు. నిరుద్యోగం కన్నా చిరుద్యోగం మేలనుకునే ఈ అల్ప సంతోషుల జీవితాలల్ల ‘ఆకలి రాజ్యం’ సినిమా నేటికీ చూడొచ్చు!

విద్యార్థికి అవగాహన పెంచుడే కాదు, వాళ్ల ఆచరణలో మార్పు తెస్తేనే చదువుకు సార్థకత. మన కాలేజీ చదువులు మార్కుల పట్టాలిస్తున్నయ్. కానీ, బత్కడం నేర్పిస్తలే! అసుంటి నిరుద్యోగే జాడి అజయ్. మంచిర్యాల జిల్లా, రాపనపల్లి తన ఊరు. బతుకుదెరువు కోసం షాపింగ్ మాల్ల చేరిండు. ఏ కస్టమర్తోని ఎట్ల మాట్లాడాలె? కస్టమర్ తీరునుబట్టి ఏమి కొనిపించాలె? అనేటివి మంచిగ నేర్పినరు. వాళ్లు చెప్పినట్టే… నవ్వుతా చిలుకపలుకులు పలికిండు. చెప్పినదానికంటె ఎక్కువే అమ్మిండు. ఎంతమ్మినా జీతం పెరగలే. రోజంతా నిలబడాలె. కూసునే తీరిక ఉండదు. ఉన్నా కుర్చీ ఉండదు. ఇంత బాధ ఏందని ఆ కొలువు మానేసిండు. అప్పుడప్పుడు కూసోవచ్చని ఒక చైనీస్ రెస్టారెంట్ల చేరిండు. పెనం మీంచి పొయ్యిల పడ్డట్టయింది. ఆడ కొలువే కుంపటి మీద కూసున్నట్టుండేది. వేడికి ఆరోగ్యం పాడైంది. అజయ్ బాధని అన్న సూడలేకపోయిండు. తమ్మునికి దారి సూపించమని తన దోస్త్‌ని సాయమడిగిండు. ‘ఇగో తమ్మి.. ఈడ బాగలేదని ఆడికి, ఆడ బాగలేదని ఈడికి మారితే బతుకు మారదు. ఏడనైనా గిట్లనే ఉంటది. మనకు నచ్చిన పని చేస్కోవాలె. రాకుంటే నేర్చుకోవాలె. ఏడ వెయ్యి రూపాయలు ఎక్కువొస్తయాని ఆలోచించుడు బందువెట్టి.. ఎట్ల ఎక్కువ సంపాదించాల్నని ఆలోచన మొదలువెట్టు’ అన్నడు. ‘నీలెక్క ఊళ్లనే ఉండుకుంట పని చేసుకునేట్టు తేలికైంది ఏదైనా ఉంటె చెప్పు’ అని అజయ్ అడిగిండు. ‘వాని కింద, ఈని కింద పని జేసుడు దేనికి? స్వామీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్’ల చేరమని సక్కంగ భూదాన్ పోచంపల్లి దారి సూపిచ్చిండు. ‘నేనూ ఆడనే నేర్చుకున్న. పైసా ఫీజు కట్టేది లేదు. ఫ్రీ హాస్టల్… ఫ్రీ మీల్స్… జాబ్ పక్కా! వద్దనుకుంటే నాలెక్క షాప్ పెట్టుకో’ అన్నడు. ‘అన్నా! మళ్లీ సదువంటే ఎట్లనే’ అని అజయ్ సందేహించినా.. ‘నాలుగు నెలల్లో అయిపోద్ది తమ్మీ’ అని చెప్పిండు. ఆయన్న చెప్పినట్టే యాదాద్రి భువనగిరి జిల్లాల భూదాన్ పోచంపల్లి దగ్గరున్న జలాల్‌పూర్‌కి వచ్చిండు అజయ్. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ల చేరిండు. సెల్‌ఫోన్ రిపేరింగ్తోపాటు కంప్యూటర్ హార్డ్‌వేర్ రిపేరింగ్ నేర్చుకుంటున్నడు. ఇంకొన్ని రోజులల్ల ఈ కోర్స్ అయిపోతది. ‘నాకు జాబ్ పక్కా’ అని అజయ్ అంటున్నడు. ‘ఇదేమీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు! రూరల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్!’ అంటున్నడు ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు. ఇక్కడ నాలుగు నెలల సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కోర్స్ చేసిన వాళ్లందరికీ జాబ్‌లు వస్తున్నయని ఆయన లెక్కలు తీసి చెబుతున్నడు. ‘ఇంతకు ముందు బ్యాచ్లల్ల ట్రైనింగ్ అయినోళ్లని సెల్‌ఫోన్ కంపెనీలు జాబ్‌ల పెట్టుకున్నయి. సెల్‌ఫోన్ అసెంబుల్ చేసే కంపెనీలు, ఫోన్ సర్వీస్ సెంటర్లు, సెల్‌ఫోన్ అమ్మే కంపెనీలల్ల వీళ్లకు కొలువులొస్తున్నయి. కొంతమంది కొలువు కంటే ఎక్కువ సంపాదించాల్నని సొంతంగనే సెల్‌ఫోన్ రిపేర్ షాప్‌లు పెట్టుకుంటున్నరు! ఇట్ల నాలుగు నెలలకు ఒక బ్యాచ్ బయటికి పోతున్నది. ప్రతి బ్యాచ్‌ల.. అందరూ బాగుపడుతున్నరు!’ అంటూ చెప్పుకొస్తున్నడు ప్లేస్మెంట్ ఆఫీసర్.

చిన్నచిన్న పల్లెటూళ్ల నుంచి ఇక్కడికొస్తే తేలిగ్గా సిటీలల్ల జాబ్ సంపాదించుకోవచ్చు. దూరంపోయి జాబ్ చేయలేనోల్లు ఉన్న ఊళ్లనే సొంతంగా బతకొచ్చు. ఊళ్లల్ల ఫోన్లే కాదు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కూడా మస్తుగ వాడుతున్నరు. ఈడ వాటి రిపేరింగ్ కూడా నేర్పిస్తున్నరు. సీసీ కెమెరా ఇన్స్టలేషన్, మెయింటనెన్స్ కూడా నేర్పిస్తున్నరు. అట్లనే ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) నేర్పిస్తున్నరు. ఇప్పుడు పట్టణాలేంది పల్లెటూర్లల్ల సుత ఏసీలు, వాషింగ్ మెషిన్లు వాడుతున్నరు. ఫ్రిజ్‌లు, కూలర్లు, మిక్సీలు ఇంతకుముందే ఉన్నయ్. ఇయి పాడైతే పట్నం పోయి బాగు చేయించుకోవాలె. జనానికి ఈ బాధ లేకుండ ఊళ్లనే రిపేర్ సెంటర్ పెట్టుకుంటే ఉపాధికి ఢోకా లేదని భరోసా ఇస్తున్నరు. ఈ కోర్సులు సదివినోళ్లని వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, ఏసీ కంపెనీలు జాబ్లకు తీస్కపోతున్నయి. డెమో, ఇన్స్టలేషన్, సర్వీస్‌కి వీళ్ల సేవలను వాడుకుంటున్నయి. అట్లనే ఇండ్లళ్ల కరెంట్ వైరింగ్, ఊళ్లల్ల ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లకు డిమాండ్ ఉంది. ఆ ఎలక్ట్రీషియన్ కోర్స్ గూడ ఈడ నేర్పిస్తున్నరు. ఈ కోర్సుల ఐటీఐ, ఇంజినీరింగ్ చదివినోళ్లు గూడ చేరుతున్నరు. ఇంజినీరింగ్ కాలేజీలల్ల థియరీ తప్ప ప్రాక్టికల్స్ సరిగా ఉండవు. ఫీల్డ్ వర్క్ అసలే ఉండదు. ఇక్కడ థియరీ గంట.. రోజంతా ఫీల్డ్‌లో ప్రాక్టికల్స్ ఉంటయి. కాబట్టి ఇంజినీర్‌గా పర్ఫెక్ట్గ పని చేయొచ్చని చేరుతున్నమంటున్నరు బీటెక్ డిగ్రీ హోల్డర్స్! చిన్నచిన్న పట్టణాలు పెరిగిపోతున్నయ్. పల్లెలు పట్టణాల్లో కలుస్తున్నయ్. వ్యవసాయంలో పని లేదు. కానీ, కొత్త పనికి అవకాశం వస్తున్నది. దానిని అందుకోలేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నరు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్లకు మస్త్ డిమాండ్ ఉంది. ఇక్కడ నేర్చుకున్నోళ్లకు సిటీలనే కాదు విదేశాలల్ల సుత పని ఉందని చెబుతున్నరు. ఎలక్ట్రీషియన్ కోర్సులు చేసినోల్లు చాలామంది దుబాయ్‌ల జాబ్‌లు చేస్తున్నరు.

కొలువు దారి
బైక్ లేని ఇల్లు లేదు. కొన్ని ఇండ్లల్ల రెండు, మూడు బండ్లు ఉంటున్నయ్! దేశంల వాహనాలు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు మెకానిక్‌లు పెరుగుతలేరు. మెకానిక్‌లు లేని ఊళ్లు సగానికి పైనే ఉన్నయ్. ఇందుల అవకాశాలు ఎక్కువ. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేటోళ్లల్ల ఎక్కువ మంది ఇష్టపడేది ఆటోమొబైల్ మెకానిజమే. ఈ కోర్సుల ట్రైనింగ్ పూర్తి కాకముందే ఆటోమొబైల్ కంపెనీలు వచ్చి కొలువులకు తీస్కపోతున్నయి. కంపెనీ సర్వీస్ సెంటర్లల్ల కొంతకాలం పనిచేసి సొంతంగ రిపేర్ షెడ్లు పెట్టుకుంటున్నరట. ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసినోళ్ల కోసం కంపెనీలు ఇక్కడికే వచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నయి. తోషిబా, ఎల్జీ, మెఘా వంటి పెద్దపెద్ద కంపెనీలలో తేలికగా ఉద్యోగం తెచ్చుకునేటందుకు ఇదో మంచి అవకాశం. కొంతమంది కంపెనీలల్ల రెండు, మూడు నెలలు పనిచేసి.. తర్వాత జీతం కంటే ఎక్కువ ఆదాయం వస్తదని కాంట్రాక్టర్ల దగ్గర పనికి పోతున్నరు. ట్యాలీ నేర్చుకున్నోళ్లకు సిన్నయ ఫైనాన్స్, జియో, పై ఎలక్ట్రానిక్స్ కంపెనీలు జాబ్ ఇస్తున్నయి. కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లు.. వీళ్లను అసిస్టెంట్లుగా పెట్టుకుంటున్నరు.

ఇంట్ల చిన్నచిన్న అవసరాల కోసం బయట టైలర్ల మీద ఆధారపడకుండ సొంతంగా కుట్టుకోవాల్నని అనుకునేటోళ్లకు.. ఇక్కడ రెండు నెలల బేసిక్ టైలరింగ్ కోర్స్ ఉంది. పిల్లల దుస్తులు, బ్లౌజులు కుట్టే నైపుణ్యం నేర్పుతరు. టైలరింగ్ని ఉపాధిగా మలచుకోవాల్నంటె బేసిక్ టైలరింగ్ తర్వాత ఇంకో మూడు నెలలు నేర్చుకోవాలె. అడ్వాన్స్ టైలరింగ్ల షర్ట్స్, బ్లౌజులు, గాగ్రాలు, గౌన్లు, కుర్తాపైజమాలు ఎట్ల కుట్టాల్నో శిక్షణ ఇస్తరు. డిజైనర్ వేర్ కోసం.. ప్రామాణిక కొలతలు తీసుకునుడు, కొత్త డిజైన్లు క్రియేట్ చేసుడు అన్నీ నేర్చుకొని ఫ్యాషన్ డిజైనర్ అయిపోతున్నరు. ఇక్కడ చేరకముందే టైలరింగ్ వస్తే సీదా అడ్వాన్స్ టైలరింగ్ కోర్స్ల్నే చేర్చుకుంటున్నరు. వీటితోపాటు జర్దోసి, ఎంబ్రాయిడరీ, కటింగ్, మగ్గం వర్క్ ఇంకా చాలా కోర్సులు ఉన్నయి. ఇష్టమున్నన్ని నేర్చుకోవచ్చు.

4
మేకప్ సిటీ ముచ్చటే కాదు. ఇప్పుడది పల్లెటూరి మురిపెం! ఊరి జనానికీ మేకప్ మీద ఆసక్తి పెరిగింది. ఏ చిన్న ఫంక్షన్‌కు పోయినా.. కొత్తగ కనిపించాలని అనుకుంటున్నరు. అందంగా తయారైతున్నరు. ఈ నయా ట్రెండ్‌తో ఊళ్లల్ల బ్యూటీపార్లర్లు పుట్టుకొస్తున్నయ్. బ్యూటీషియన్లకు బ్యూటీఫుల్ కెరీర్ దారిచూపుతున్నది! ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాల్ననే ఆశతో యువతులు బ్యూటీషియన్ కోర్స్ల చేరుతున్నరు. సిటీల ఈ కోర్సు నేర్చుకోవాల్నంటె పైసలు కట్టాలె. లేకుంటె.. పార్లర్ల ఫ్రీగా పని చేసుకుంట నేర్చుకోవాలె. ఇక్కడ ఫీజు లేకుండనే అయిదు నెలల్ల మెహందీ, బ్లీచింగ్, థ్రెడ్డింగ్, పెడిక్యూర్, హెయిర్ కట్, హెయిర్ స్టయిల్స్, శారీ డ్రేపింగ్, వాక్సింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్పిస్తరు.
బతుకు బడిల ఏ కోర్సులో చేరినోళ్లను అందులో పర్ఫెక్ట్ చేస్తరు. అయితే.. ఒక ట్రేడ్ల చేరినోళ్లకు మిగతా ట్రేడ్ల గురించి కొంచెం అవగాహన ఉండాల్నని నాలుగైదు రోజులు ఆటోమొబైల్, మొబైల్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, సోలార్‌ని పరిచయం చేస్తరు. యువతులు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ డేటాఎంట్రీ, డీటీపీ కోర్సులనే చేరుతున్నరు. కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రీషియన్, ఫోన్ రిపేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులు నేర్చుకోనీకి ముందుకు వస్తలేరు. ఈ కోర్సులల్ల చేరి నేర్చుకున్నాంక పని చేయాల్నంటె బయటికి పోవాలె. మోసుకుపోయే పనుంటది. వాటి కంటే ఇంటి దగ్గరే ఉండి పని చేస్కునే కోర్సులే ఎంచుకుంటున్నరు. యువతుల్ని ఎంకరేజ్ చేసి సెల్‌ఫోన్, కంప్యూటర్ హార్డ్వేర్లోకి తీసుకొచ్చినరు. ఇప్పుడు సెల్‌ఫోన్ రిపేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులల్ల అమ్మాయిలూ చేరుతున్నరు. ఫోన్, కంప్యూటర్ రిపేర్ సెంటర్లల్ల పనిచేస్తున్నరు. మొబైల్‌ఫోన్ అసెంబుల్ యూనిట్లల్ల జాబ్‌లు చేస్తున్నరు. ఒకప్పుడు తల్లిదండ్రులు కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ రిపేర్ కోర్సులు వద్దనేది. కానీ, వాళ్లలోనూ ఇప్పుడు మార్పు వచ్చింది. తల్లిదండ్రులే యువతుల్ని ఈ కోర్సులల్ల చేర్పిస్తున్నరు. బతుకుబాట పట్టిస్తున్నరు. ఈ కోర్సు అయిపోయినంక రిపేరే కాదు.. సొంతంగా బిజినెస్ సుత పెట్టుకుంటున్నరు. ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముతున్నరు. మొత్తంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఉపాధికి భరోసానిస్తున్నది. ఎలాంటి కొలువులోనైనా కుదురుకునే నైపుణ్యం అందిస్తున్నది. ఇక్కడ అదనంగా దొరికే క్రమశిక్షణ.. బాధ్యతలను సమర్థంగా నిర్వహించే ఓర్పును, నేర్పును ప్రసాదిస్తున్నది.

యువతీ, యువకులు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ఆంత్రప్రెన్యూర్స్ని తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఇక్కడ కోర్సులన్నీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) నిబంధనల ప్రకారం రూపొందించినవే. శిక్షణలో భాగంగా సాంకేతిక నైపుణ్య శిక్షణతోపాటు సొంత వ్యాపారం ప్రారంభించడం, బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, వ్యాపార విస్తరణ గురించి అవగాహన కల్పించేందుకు ఆంత్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ) నిర్వహిస్తాం. కానీ, ఎక్కువమంది ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడుతున్నారు. ఆంత్రప్రెన్యూర్‌గా మార్చడంలో ఎక్కువ విజయం సాధించలేదు. గ్రామీణ యువత ఆర్థిక పరిస్థితితోపాటు సామాజిక వెనుకబాటుతనం వల్ల ఆంత్రప్రెన్యూర్లు తయారు కావడం లేదు. ఇంటి వాతావరణం, విద్యావిధానంలో మార్పులు వస్తేనే యువతలో మార్పు వస్తుంది.
– పి.ఎస్.ఎస్.ఆర్. లక్ష్మి, డైరెక్టర్ (అకడమిక్స్), ఎస్ఆర్టీఆర్ఐ
ఉపాధికి అధిక అవకాశాలున్న రంగాల్లో, ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇస్తున్నం. ఈ రూరల్ ఇన్స్టిట్యూట్తోపాటే ఏర్పాటైన మిగతా ఏడు సంస్థలు విజయవంతం కాలేదు. ఇదొక్కటే అనుకున్న లక్ష్యం చేరుకున్నది. ఇక్కడ ఒకేసారి అయిదు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉన్నది. ప్రతి విద్యార్థికీ ఉచిత వసతి, భోజనమే కాదు శిక్షణకు కావాల్సిన మెటీరియల్ సైతం ఉచితంగానే ఇస్తున్నం. తెలంగాణ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గ్రామాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతది.
– డాక్టర్ ఎన్. కిశోర్ రెడ్డి, చైర్మన్, ఎస్ఆర్టీఆర్ఐ
పిల్లల్ని అత్తగారికి అప్పగించి, అడ్వాన్స్ టైలరింగ్ నేర్చుకోనీకి వచ్చిన. హైదరాబాద్ సిటీల ఇయన్నీ నేర్చుకోవాలంటే లక్ష రూపాయలు ఫీజు కట్టాలె. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నరు. మా ఊరి నుంచి ఇక్కడికి ఇంతకముందు బస్సులు ఉండె. ఇప్పుడు తీసేసిండ్రు. చుట్టుపక్కల నుంచి ఇక్కడికి బస్సులు నడిపితే ఇంకా చాలామంది ఆడవాళ్లు నేర్చుకోనీకి వస్తరు.
– సాహితీ, బీబీ నగర్
ఆటోమొబైల్ మెకానిక్, సెల్‌ఫోన్ రిపేర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రీషియన్ పని చేయాల్నంటె, సొంతంగా బిజినెస్ చేయాల్నంటె… బ్యాంక్ లావాదేవీలు, అకౌంట్స్ రాసుకోనీకి ఇంగ్లిష్ అర్థం కావాలె. విడిభాగాలు కొనేటప్పుడు మోసపోకూడదు. అందుకని ప్రతి విద్యార్థికి కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ నేర్పిస్తరు. కస్టమర్లతో మాట్లాడటం, ఒక కస్టమర్ ద్వారా ఇంకో కస్టమర్‌ని రాబట్టుకోవడం కోసం సాఫ్ట్‌స్కిల్స్ నేర్పిస్తరు.
నిజాం కాలేజ్‌ల ఎంకామ్ చదివిన. పీజీ చదివేటప్పుడు రెండేండ్లపాటు గ్రూప్స్ కోచింగ్ తీసుకున్న. పీజీ అయిపోయినంక ఇంకో రెండేళ్లు కోచింగ్‌కి పోయిన. అయినా జాబ్ రాలే. ట్యాలీ నేర్చుకోవాల్నని వచ్చిన. నాకు కామర్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ వస్తది. ఇది అయిపోయినంక నేనే ట్యాలీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడత. ఒకరి దగ్గర జాబ్ చేయడం కాదు. నేనే నలుగురికి జాబ్ చూపిస్త.
– గైని రవితేజ, ఎర్రపహాడ్, కామారెడ్డి జిల్లా
మా ఆర్థిక పరిస్థితి బాగ లేకుండె. అమ్మానాన్నతో కలిసి పత్తి తీస్తుంటి. మిర్చి ఏరుతుంటి. వ్యవసాయ కూలీ పనులకు పోతుంటి. కూలి పని చేసుకుంటనే పాల్వంచల డిగ్రీ చదివిన. ‘మేము చదువుకోలే, మాలాగా నువ్వు బతకొద్దు’ అని మా అమ్మానాన్న నన్ను చదువుకోమన్నరు. భద్రాచలంల పీజీ (తెలుగు)ల చేరిన. కూలి చేసుకుంటనే ఫస్ట్ ఇయర్ చదివిన. ఇంట్ల డబ్బుల్లేవ్. హైదరాబాద్ వచ్చి ఓ కాలేజ్‌ల రిసెప్షనిస్ట్గ చేరిన. దాని కంటే మంచి ఉద్యోగం చేయాలనిపించి ఇక్కడికొచ్చిన. ట్యాలీ నేర్చుకున్న. ఇందులనే పనిచేసే అవకాశం వచ్చింది. ఉద్యోగం చేసుకుంట అమ్మానాన్నకు నెలనెలా డబ్బులు పంపిస్తున్న. ఆ డబ్బులతోని భూమి కౌలుకు చేస్తున్నరు.
– పూనెం బేబీ, జూలూరుపాడు
మా నాన్న ఆటో డ్రైవర్. అమ్మ కూలీ. గ్రూప్స్ జాబ్ సాధించాలని పరీక్షలు రాసిన. కోచింగ్‌కి పోలే. జాబ్ రాలే. మళ్లీ రాస్త. అప్పటి దాంక ఏదో ఒక జాబ్ చేయాల్నని కంప్యూటర్ హార్డ్‌వేర్ నేర్చుకోనీకి వచ్చిన.
– రెంటాల మౌనిక, హుజూర్ నగర్
బతుకు బడిల చెప్పే అన్ని కోర్సులకు రిజర్వేషన్ ఉంది. ఆటోమొబైల్‌కి పదో తరగతి చదివి ఉండాలె. ఫెయిల్ అయినా సరే చేరొచ్చు. కంప్యూటర్ కోర్స్‌కి ఇంటర్మీడియెట్, ట్యాలీకి బీకామ్ పాస్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌కి ఇంటర్ (ఫెయిల్ అయినా అవకాశం కల్పిస్తరు), మహిళలైతే ఎనిమిదో తరగతి చదివినా తీసుకుంటరు. ఎలక్ట్రికల్ కోర్సులో ఐటీఐ, బీటెక్ చదివినోళ్లకు ముందుగా అవకాశం ఇస్తరు. ఏ కోర్సులో చేరనీకి అయినా 18 ఏండ్లు నిండి ఉండాలె. వయసు 28 ఏండ్లకు మించకూడదు. ఎక్కువ వయసుంటే వాళ్లకు ఆ ఫీల్డులో ఉన్న అనుభవం, ఆసక్తిని బట్టి అడ్మిషన్ ఇస్తరు. కోర్స్ అయిపోయినాంక పరీక్ష పెడుతరు. పాస్ అయినోళ్లకు సర్టిఫికెట్ ఇస్తరు. ట్యాలీ నేర్చుకున్నోళ్లకు ట్యాలీ కంపెనీ పెట్టే పరీక్ష రాయిస్తరు. ట్యాలీ వాళ్లే సర్టిఫికెట్ ఇస్తరు. ఈ సర్టిఫికెట్ చేతికొచ్చిందంటే జాబ్ సాధించినట్ట్టే!
పల్లెలల్ల యువతకు ఉపాధి కల్పించాలని, ఊళ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోని భారత ప్రభుత్వం ఎనిమిది విద్యాసంస్థల్ని స్థాపించాలనుకున్నది. అందుల ఒక దానిని ఆచార్య వినోబాబావే భూదానోద్యమాన్ని ప్రారంభించిన భూదాన్ పోచంపల్లికి దగ్గర్ల ఉన్న జలాల్పూర్ల స్థాపించాలనుకున్నరు. వంద ఎకరాల భూమిని సేకరించి దీని నిర్మాణం చేపట్టినరు. 1995ల ఈ విద్యాసంస్థ ప్రారంభమైంది. నాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు దీనికి తన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ పేరు పెట్టిండు. అట్ల సాంకేతిక శిక్షణతోని గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ‘స్వామీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్’ ప్రారంభమైంది. దీనితోపాటు మిగతా ఏడు విద్యాసంస్థలను మొదట్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్స్టిట్యూట్స్ నడిపింది. కొన్నేళ్ల తర్వాత దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినరు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ విద్యా సంస్థను నిర్వహిస్తున్నది. పాతిక సంవత్సరాల కిందట ఇక్కడ నిరుద్యోగ యువతకు శిక్షణ ప్రారంభమైంది. ఉచిత శిక్షణతోపాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలతో నిరుపేదలకు బతుకుదారి చూపుతూ.. ‘విద్యాలయాలే ఆధునిక భారత దేశపు దేవాలయాలు’ అన్న నెహ్రూ మాటను నిజం చేసింది. పల్లె బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ఈ విద్యాసంస్థ ఓ విశ్వవిద్యాలయంగా ఎదగాలని తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు కలలు గన్నడు. ఆ స్వప్నం మాత్రం నెరవేరలే.
బీకామ్ చదవాల్నని హైదరాబాద్ వచ్చిన. అయిపోయినాంక ఏదైనా జాబ్ చూసుకోవాల్ననుకున్న. మా అన్న ఈడనే ఆటోమొబైల్ మెకానిక్ ట్రైనింగ్ తీసుకున్నడు. ఇప్పుడు ఒక ఆటోమొబైల్ కంపెనీల మేనేజర్‌గ చేస్తున్నడు. బయట కోచింగ్ సెంటర్లకు పోయి ఉద్యోగం సాధించడం కంటే ఇక్కడ ట్రైనింగ్ పూర్తిచేస్తే నేరుగా ఉద్యోగం వస్తదని తెలిసి వచ్చిన.
– మోనిక, గుల్బర్గా
అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. మాకు చిన్న రేకుల షెడ్డు తప్ప ఇంకేమీ లేదు. బీకామ్ అయిపోయింది. ట్యాలీ నేర్చుకోనీకి ఈడికి వచ్చిన. ఫ్రీగా నేర్పించినరు. కోర్స్ అయిపోంగనే జెన్ టెక్నాలజీస్ కంపెనీకి ఇంటర్వ్యూకి పోయిన. సెలెక్ట్ అయిన. నాకు కూలి పనులకు పోయే బాధ తప్పింది.
– తలారి దేవేందర్, సూరారం, జయశంకర్ భూపాలపల్లి
ఎస్ఆర్టీఆర్ఐ దాదాపు పది ట్రేడ్లకు సంబంధించిన నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. ఈ కోర్సులకు కనీసం 45 రోజుల నుంచి 6 నెలల శిక్షణ ఉంటది. చివర్లో పరీక్ష పెట్టి, సర్టిఫికెట్ ఇస్తరు.
– కేశమౌని మహేష్ కుమార్ గౌడ్