మన రోజువారీ జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక అంతర్భాగంగా మారిపోయింది. సమాచారం కోసం, కాలక్షేపం కోసం, ఇతరులతో కనెక్ట్ అవ్వడం కోసం మనం ఎక్కువగా మొబైల్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే, ఈ డిజిటల్ ప్రపంచంలో సరికొత్తగా, అనారోగ్యకరంగా మారుతున్న అలవాటు ఒకటుంది, అదే డూమ్ స్క్రోలింగ్. ఇది ఓ వ్యసనంగా మారి మానసిక, శారీరక ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తున్నది. అసలు ఈ డూమ్ స్క్రోలింగ్ అంటే ఏంటి?.. దాంతో కలిగే నష్టాలేంటి?.. దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
డూమ్స్క్రోలింగ్ అంటే సోషల్ మీడియాలో, వార్తా వెబ్సైట్లలో, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతికూల, బాధాకరమైన, భయం, ఆందోళన కలిగించే వార్తలను, కంటెంట్‌ను నిరంతరం చూస్తూ గడపడం. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వార్తలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి అలవాటు పడినవాళ్లు అప్రయత్నంగా నెగెటివ్ వార్తలను వెతకడం కొనసాగిస్తారు. ఎందుకంటే, వారి మెదడు ప్రమాదాలను తెలుసుకోవడానికి, వాటికి సిద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఈ నిరంతర స్క్రోలింగ్ వల్ల సమాచారం తెలియడం కంటే, మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఆరోగ్యానికి చేటు..
డూమ్ స్క్రోలింగ్ మన మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ప్రతికూల వార్తలను నిరంతరం చూడటంతో భయం, ఆందోళన స్థాయులు పెరుగుతాయి. ప్రపంచంపై నిస్సహాయత, నిరాశ భావనలు కలుగుతాయి. నిరంతరం నెగెటివ్ కంటెంట్ చూడటం దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీసి చికాకు, అలసట, జ్ఞాపకశక్తి లోపం లాంటి సమస్యలను తెస్తుంది. రాత్రి పడుకునే ముందు స్క్రోలింగ్ చేయడంతో మెదడు చురుకుగా ఉండి, నిద్రకు ఆటంకం కలుగుతుంది. తలనొప్పి, కండరాల తిమ్మిరి, కడుపులో అసౌకర్యం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
మెదడుపై ఇలా..
డూమ్ స్క్రోలింగ్ అనేది కేవలం చెడు అలవాటు మాత్రమే కాదు, మన మెదడుపై లోతైన ప్రభావాన్ని చూపే ఒక న్యూరలాజికల్ ప్రక్రియ. మెదడుపై ఒత్తిడి పెంచి ఆలోచనా సామర్థ్యం దెబ్బతినేలా చేస్తుంది. డూమ్ స్క్రోలింగ్ తో మెదడులో ఈ మార్పులు సంభవిస్తాయి.
ఒత్తిడి హార్మోన్ల విడుదల..
ప్రతికూల వార్తలను చూసినప్పుడు, మెదడు దాన్ని ఒక ప్రమాద సంకేతంగా భావిస్తుంది. ఫలితంగా, మెదడు.. కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరాన్ని ‘పోరాటం లేదా పలాయనం’ అనే అత్యవసర స్థితికి సిద్ధం చేస్తాయి. ఈ హార్మోన్ల నిరంతర విడుదల వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.
అమిగ్డాలా అతి చురుకుదనం..
మెదడులో భావోద్వేగాలను, భయాన్ని నియంత్రించే భాగం అమిగ్డాలా. డూమ్ స్క్రోలింగ్ సమయంలో, బాధాకరమైన కంటెంట్‌ను నిరంతరం చూడటంతో అమిగ్డాలా అతి చురుకుగా మారుతుంది. ఇది దీర్ఘకాలంలో మెదడు వైరింగ్‌ను మార్చి రోజువారీ ఒత్తిడికి కూడా ఎక్కువగా స్పందించే విధంగా చేస్తుంది.
ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలహీనపడటం..
తార్కిక ఆలోచన, నిర్ణయం తీసుకోవడం, ఆత్మ నియంత్రణ లాంటి ఉన్నత స్థాయి పనులకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాధ్యత వహిస్తుంది. డూమ్ స్క్రోలింగ్‌తో కలిగే నిరంతర ఒత్తిడి ఈ భాగాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, భావోద్వేగాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
బయటపడటం ఎలా?
కాలక్షేపంగా మొదలైన డూమ్ స్క్రోలింగ్ రాను రానూ ఓ వ్యసనంలా మారుతుంది. దీనిని నియంత్రించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
డూమ్ స్క్రోలింగ్ అలవాటును వదులుకోలేకపోతున్నా, అది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా తప్పకుండా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. డిజిటల్ యుగంలో సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం, కానీ దానితో మానసిక ప్రశాంతతను కోల్పోవడం మంచిది కాదు. డూమ్ స్క్రోలింగ్‌కు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261