సినారె నిత్యచైతన్యశీలి అయిన కవి. అంతకుమించిన మానవతామూర్తి. మూలాలను మరువని దీప్తి. ఆయనను దగ్గరగా చూసినవాళ్లకు ఆ విషయం బాగా తెలుసు. తన చివరి శ్వాస వరకు తన స్నేహితులు, పరిచయస్తులను ఆయన మరిచిపోలేదు. ఏటా జనవరి పదో తేదీన హనుమాజీపేటకు వెళ్లగానే తన చిన్ననాటి మిత్రులందరినీ కలిసి, వారితో సంతోషంగా గడిపేవారు. పేరుపేరునా వాళ్లను పలకరించి తన చిన్ననాటి ముచ్చట్లను జ్ఞాపకం చేస్తుండేవారు. పలు సినిమాల్లో సినారె స్నేహాన్ని గురించి, స్నేహితుల గురించి చక్కని గీతాలు రాశారు.
1968లో ‘మంచి మిత్రులు’ సినిమా కోసం ఆయన రాసిన గీతం స్నేహగీతాల్లో చక్కనిది. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం/ ఈనాడే ఎదురౌతుంటే/ ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే/ ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి’ అంటూ చాలాకాలం తర్వాత కలుసుకోబోతున్న స్నేహితుల అంతరంగాన్ని ఆవిష్కరించారు కవి. అటువంటి గీతమే ‘నిప్పులాంటి మనిషి’ సినిమా కోసం ఆయన రాసిన ఈ పాట. ఈ గీతం గురించి, అందులోని విశేషాల గురించి మనం చెప్పుకొనే ముందు ఈ సినిమా నేపథ్యం గురించి, గీత రచనకు దోహదమైన అంశాల గురించి మాట్లాడుకోవాలి.
ఒక భాషలో విజయవంతం అయిన సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయడం, రీమేక్ చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా, ప్రాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ప్రసిద్ధ హిందీ చిత్రం ‘జంజీర్’. 1975లో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’గా వై.వి.రావు పునర్నిర్మించారు. తెలుగులో కథానాయకుడిగా ఎన్.టి.రామారావు, ఖాన్దాదాగా కైకాల సత్యనారాయణ నటించారు. ‘జంజీర్’ లోని ‘యారి హై ఇమ్మాన్ మేరా, యార్ మేరీ జిందగీ’ అనే గీతాన్ని స్వీకరిస్తూ అలాగే రాయాల్సిందిగా కోరారు నిర్మాతలు. హిందీ పాట బాణీ, భావాలకు తెలుగు నుడికారాన్ని, శబ్దరమణీయతను జోడిస్తూ ‘స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అంటూ స్నేహితులకు ప్రార్థనా గీతం అందించారు సినారె.
సాఖీ : అల్లాయే దిగివచ్చి.. ఆయ్ మియా ఏమి కావాలంటే..
మిద్దెలొదూ..్ద మేడలొద్దూ పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడూ లేనినాడూ ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను.. ఒక్క నేస్తం కావాలంటాను
గీతం : స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం ॥2॥
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
గుండెనే పలికించితే..
కోటి పాటలు పలుకుతాయి
మమతనే పండించితే..
మణుల పంటలు దొరుకుతాయి
బాధలను ప్రేమించుభాయీ.. ॥2॥
లేదు.. అంతకు మించి హాయి ॥స్నేహ॥
కథా నేపథ్యంలో తన స్నేహితుడు, నిజాయతీకి నిలువుటద్దమైన పోలీసు అధికారి (ఎన్టీయార్) ఎంతో ముభావంగా ఉండటం చూసిన మిత్రుడు ఖాన్దాదా (సత్యనారాయణ) అతనిని కవ్విస్తూ పాడేపాట ఇది. నారాయణరెడ్డి ఉర్దూ చదువుకున్న విద్యార్థి. గజల్ ముషాయిరా, ఖవ్వాలీల్లో పాల్గొనేవారు కూడా! ఆ ప్రభావంతోనే ఈ గీతాన్ని ఖవ్వాలి శైలిలో కూర్చారు. గీత ఎత్తుగడ సాఖీతో ఉంటుంది. వారి స్నేహాన్ని, అనుబంధాన్ని గురించి తరువాత గీతంలో వివరించారు. హిందీలో ‘యారి’ అన్న పదానికి ప్రతిగా సినారె తెలుగు గీతంలో ‘స్నేహమేరా’ అని ప్రయోగించడం మనం చూడవచ్చు.
సింధుబైరవి రాగంలో కంపోజ్ చేసిన ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. హిందీ మూల గీతాన్ని మన్నాడే పాడారు. ఇందులో పల్లవులు, చరణం వంటివి లేకుండా గీతమంతా ఓ కథనంలా సాగుతుంది. కవి స్నేహాన్ని గురించి ఎంత బాగా చెబుతాడో చూద్దాం. మనసువిప్పి మాట్లాడుకుంటే అన్నీ సమసిపోతాయని, గుండెను తట్టి పలికించితే కోటి పాటలు పలుకుతాయని చెబుతారు. బాధపడుతున్న తన మిత్రున్ని చూసి ‘బాధలను ప్రేమించు భాయీ / లేదు అంతకు మించి హాయి’ అంటూ ఆత్మీయ ఉపదేశం కూడా ఇందులో కనిపిస్తుంది. తరువాత వాక్యాల్లో… స్నేహబంధం గురించి కవి సినారె మరింత విలక్షణంగా చెబుతూ..

కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటో నీ బాధ.. నాకైనా చెప్పుభాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి..
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కలను కోసుకొని తెమ్మంటావా!
దిక్కులను కలిపేయమంటావా!
దింపమంటావా.. ఆ చంద్రుణ్ని!
తుంచమంటావా.. ఆ సూర్యుణ్ని!
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైనా ఇస్తాను
ఇలా ఖాన్దాదాతో పలికిస్తాడు కవి. నిజానికి నిఖార్సయిన స్నేహం చేసే పనులను అన్నీ ఇన్ననీ చెప్పలేం. స్నేహం ముందు సర్వస్వం బలాదూర్ అనిపిస్తుంది. దానినే ఈ గీతంలో చెప్పారు సినారె. ఇంకా ‘దోస్తీకి నజరానా.. చిరునవ్వురా నాన్న’ అనడం స్నేహపు మాధుర్యపు ఘుమఘుమలను తెలుపుతుంది. నిజం కదూ! నిజమైన స్నేహంలో మునిగితేలితేనే అది తెలుస్తుంది. దోస్తీకి నజరానా.. చిరునవ్వురా నాన్నా ఒక్క నవ్వేచాలు వొద్దులే వరహాలు నవ్వేరా… నవ్వెరా మావాడు నవ్వేరా నిండుగా నవ్వేరా నా ముందు రంజాను పండుగ.. ॥స్నేహ..॥ ఇలా ముభావంగా ఉన్న స్నేహితుణ్ని మురిపెంగా నవ్వించడంతో పాట ముగుస్తుంది. ఇది హిందీ గీతానికి అనుసరణ అన్నట్టే కానీ, అచ్చమైన స్నేహానికి, నిక్కమైన చిరునామాలా నిలిచిపోయింది.