చేప పిల్లల పంపిణీలో మత్స్యశాఖ మాయాజాలానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు ఊతమిస్తున్నాయి. కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న చేప పిల్లలు నాణ్యంగా లేకపోవడం, తక్కువ పరిమాణంలో ఉండడం వంటి అంశాలపై మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే మూడు నెలల ఆలస్యంగా చేప పిల్లలను పంపిణీ ప్రక్రియను చేపట్టడంపై మత్స్యకారులు ఆగ్రహంగా ఉన్నారు.
ఇన్ని రోజులూ ఎదురుచూసిన మత్స్యకారులు రేవంత్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ఇప్పటికే ఆయా చెరువుల్లో సొంతంగానే చేప పిల్లలను వదిలారు. అవి కాస్తా పెరిగి పెద్దవయ్యాయి. అయితే, ఇప్పుడు కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు తక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఇప్పటికే చెరువుల్లో పెరుగుతున్న పెద్ద చేపలకు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న ఈ చిన్నసైజు చేపలు మేతగా మారే ప్రమాదముందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1.76 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కేవలం 11 లక్షల పిల్లల మాత్రమే పంపిణీ చేయడంపై మండిపడుతున్నారు. -అశ్వారావుపేట, నవంబర్ 15
ఉచిత చేపల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేసింది. ఆగస్టు నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. మూడు నెలల ఆలస్యంగా మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని మండిపడుతున్న మత్స్యకారులు.. ఇప్పుడు కాంట్రాక్టర్లు తెచ్చిన చేప పిల్లలను చూసి ఆశ్చర్యపోతున్నారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో మత్స్యశాఖ కూడా అక్రమాలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో లాలూచీ పడిన అధికారులు.. వారు చిన్నసైజు చేప పిల్లలను తెచ్చినా మౌనం వహిస్తుండడం వెనుక కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. సదరు చేప పిల్లలు నాణ్యంగా లేవని, తగిన పరిమాణంలో కూడా లేవని చెబుతున్నారు. ఇటీవల ఇదే విషయాన్ని గమనించిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.. కాంట్రాక్టర్లు తెచ్చిన చేప పిల్లలను తిప్పి పంపిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు.

Khammam1
నిబంధనలు ఇలా..
జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. చెరువుల్లో వదిలే చేప పిల్లలు కనీసం 30 నుంచి 40 మిల్లీమీటర్ల (ఎంఎం) పరిమాణంలో ఉండాలి. ఎంత మొత్తంలో చేపలు వదులుతున్నారో సంబంధిత మత్స్యకార సంఘాలకు ముందుగా తెలియజేయాలి. చేప పిల్లలు పెంచే ప్రాంతాలకు మత్స్య సంఘాల సభ్యులను అధికారులు తీసుకెళ్లి చూపించాలి. నీటిలో చేప పిల్లలు వదిలేముందు మత్స్య సంఘాల సమక్షంలో వాటిని లెక్కించాలి. ఆ తర్వాతే ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత, పరిమాణంతో చేప పిల్లలను మత్స్యకార సంఘాలకు పంపిణీ చేయాలి.
వీటిలో ఏమైనా వ్యత్యాసం ఉంటే వాటిని మత్స్యశాఖ అధికారులు తిరస్కరించవచ్చు. ఇక ప్రాజెక్టుల్లో వదిలే చేప పిల్లలు 80 నుంచి 100 ఎంఎం వరకు ఉండాలి. ఈ చేప పిల్లలను కేజీల లెక్కన తూకం వేస్తారు. ఒక్కో కేజీకి సుమారు 350 చేప పిల్లలు వరకూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వస్తే వాటి సైజుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి అధికారులు తిరస్కరించొచ్చు. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. లాలూచీ కారణంగా కాంట్రాక్టర్లకు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్ష్యం 1.76 కోట్లు.. ఆచరణ 11 లక్షలు..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 3 రిజర్వాయర్లు, 82 పెద్ద చెరువులు, 740 సాధారణ చెరువులు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 1.76 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది పంపిణీ ఆలస్యమైంది. శనివారం నాటికి కేవలం 11 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. మిగతా చేప పిల్లల పంపిణీకి మరో నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉంది. దీంతో మత్స్య సంఘాల సభ్యులు ఇప్పటికే తమ సొంత ఖర్చులతో చెరువుల్లో చేప పిల్లలను పెంచుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం కాంట్రాక్టర్లతో ఇప్పుడు పంపిణీ చేస్తున్న తక్కువ పరిమాణమున్న చేప పిల్లలు.. ఇప్పటికే పెరిగిన తమ సొంత చేపలకు మేత అవుతాయే తప్ప.. వాటి పెరుగుదల సాధ్యం కాదని మత్స్యకారులు వాపోతున్నారు. నిర్ణీత గడువులోగా పంపిణీ చేసి ఉంటేనే ప్రయోజనం చేకూరేదని చెబుతున్నారు.
సొంతంగా చేపి పిల్లలు వేసుకున్నాం..
ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో మా మత్స్య సొసైటీ బాధ్యులమంతా కలిసి మా సొంత ఖర్చులతో చెరువులో చేప పిల్లలను వదిలాం. వాస్తవంగా ఏటా జూన్ నుంచి ఆగస్టు నెలల్లోపు చెరువుల్లో చేప పిల్లలు వదిలాలి. అప్పుడే అవి సక్రమంగా పెరుగుతాయి.
-పద్దం శ్రీను, ఊరచెరువు సొసైటీ అధ్యక్షుడు, అనంతారం
మూడు నెలలుగా ప్రభుత్వ జాప్యం..
చేప పిల్లల పంపిణీలో రేవంత్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. 3 నెలలు జాప్యం చేసింది. దీంతో మేం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో చేప పిల్లలు లేవనే విషయాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇటీవల గుర్తించి వెనక్కి పంపించారు.
-తోడేటి నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు, రొంపేడు
చూపించిన చేపలు వేరు.. పంపిన చేపలు వేరు..
చేప పిల్లలు పంపిణీకి ముందు అధికారులు మమ్ములను ఆంధ్రా, తెలంగాణల్లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడి చేప పిల్లలను చూపించారు. స్కేల్‌పై కొలిచి చేప పిల్లల పరిమాణాన్ని నిర్ధారించారు. వాటినే పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు పంపిణీ చేసే చేప పిల్లలు మాకు ఇంతకుముందు చూపించినవి కాదు.
-జోగ బుచ్చయ్య, జిల్లా మత్య్స శాఖ సంఘాల అధ్యక్షుడు
టెండర్లు రాకపోవడం వల్లే ఆలస్యం..
చేప పిల్లల సరఫరాకు టెండర్ల వేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోవడం వల్ల పంపిణీలో ఆలస్యమైంది. చేప పిల్లల నాణ్యత, పరిమాణం పరిశీలించిన తర్వాతే మత్య్సశాఖ సొసైటీ బాధ్యుల సమక్షంలో చెరువులోకి వదులుతున్నాం. ఇల్లెందులో నిర్ణీత పరిమాణంలో లేకపోవడంతో వాటిని తిరస్కరించాం.
-అహ్మద్ ఖాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి, కొత్తగూడెం