‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
ఒకప్పుడు రేడియో వీనులకు విందు. నేడు మీడియా ప్రజలకు పసందు! కానీ, సందు దొరికితే కొందరు వెర్రిపోకడలతో మితిమీరి చేస్తారు అతి. గతిలేక చిక్కిన కొందరి మనస్తాపాలు. చివరికి ప్రాణాలనే తీసుకునేలా.. ఆ వృత్తిలో, వాళ్ల ప్రవృత్తిలో చేసే పాపాలకు నిష్కృతి లేదా! సమాజం ఏమని సమాధానం చెపుతుంది? చింతనతో వీటి బారిన పడిన వారికి సాంత్వన ఎలా!!
“ఆవిడ పేరు విమలం. ఎప్పుడూ పని సరిగా చేయదు. దాంతో ఏవో రెండు మాటలు అన్నా.. చివరికి నేను తనచేయి పట్టుకున్నానని.. అయ్యో! ఇలా ఇరికిస్తుందని అనుకోలేదు. నేనా పని చేయలేదు. అమ్మా.. నేనే తప్పూ చేయలేదు! నను నమ్ము!”
“బాబూ.. మోహన్! అన్నిసార్లు చెప్పాలా!? నువ్వేంటో మాకు తెలుసు. మేం నిన్ను నమ్మేదేముంది చెప్పు. నీలో నువ్వు విపరీతంగా మధన పడుతున్నావు. అదే ఆలోచించి ముఖం చూడు.. ఎంత పీక్కుపోయిందో! పడుకో.. ఏమీ కాదు. ఆవిడ చేసిన కర్మ. ఏనాటికైనా అనుభవించక తప్పదులే” భానుమతి చెప్పింది.
“ఎందుకో.. మామూలు మనిషిని కాలేకపోతున్నా.. అమ్మా!”
“జీవితం అన్నాక ఏవో సంఘటనలు జరుగుతుంటాయి. చేయని తప్పులకు! విధి వైపరీత్యమనుకో! కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు ధైర్యం కోల్పోకూడదు. నీ వెనక మేము లేమా!” చెప్పింది భానుమతి తన గదికి వెళుతూ.
“అర్ధరాత్రి దాటిపోయింది. ఏమీ కాదు. మీరింత బేలగా ఉంటే మా పరిస్థితి ఏంటి? మీరు తప్పు చేయరు” చెప్తోన్న నందిని గాఢ పరిష్వంగంలో ముఖం దాచుకుని ఒదిగిపోయాడు మోహన్. కంట కన్నీరు. ఎంతగా అంటే.. ఇరువురి ఎదలు తడిసి పోయినంతగా!
“మోహన్! బాధ పడకు. నువ్వు నాకు కావాలి. అత్తయ్యను, పిల్లలిద్దరినీ తీసుకుని.. మనల్ని కలవరపెట్టే ఈ వాతావరణం నుంచి ఎటైనా దూరంగా వెళ్లిపోదాం. ఇంకెక్కడైనా బతుకుదాం!” “అలాగే! ఈ నింద నుండి బయట పడగలమంటావా నందూ?” “తప్పు లేనప్పుడు భయం దేనికి!?”
గంట గడిచింది. నందినికి కాస్త మగతగా నిద్ర పట్టింది. నందిని నుంచి విడలేక విడివడి లేచాడు. మోహన్ మదినిండా ఆలోచనలు. నిద్ర పట్టడంలేదు. ఆఫీస్‌లో అటు పైనుండీ.. ఇటు కింద నుండీ ఎన్నో ఒత్తిళ్లు. ఎంత నిజాయతీగా పనిచేశాడు. ఇన్నేళ్ల వృత్తిలో ఒక్క మచ్చా లేదు. పరీక్షలు పాసై ఆఫీసర్ స్థాయికి చేరుకున్నాడు. నిన్న పనిలో తలమునకలై ఉన్నప్పుడు వచ్చింది విమలం. సరిగా పని చేయకపోతే ఇదివరలో మెమో ఇచ్చాడు. “సార్! మీరడిగిన ఫైల్ వెతుకుతున్నా. దొరకడం లేదు!”
“అలా అంటే ఎలా? హెడ్ క్వార్టర్స్ నుండి ఫోన్లే ఫోన్లు! ఆ ఫైల్ ఎంత ముఖ్యమో మీకు తెలుసు. వెతకండీ! నాకు మాటవస్తుంది”
“సార్! సాయంత్రంలోపు వెతుకుతా. ఎవరికీ తెలియనివ్వకండి ప్లీజ్!”
“సరే! ఇంకొక రెండు గంటల్లో ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే మీమీద ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తుంది”
నాలుగు గంటలైంది. విమలం గురించి పదేపదే కబురుపెట్టాడు. సీట్లో లేదు. ఎంత బాధ్యతారాహిత్యం. ఆరా తీస్తే.. ఎవరిదో పుట్టినరోజు వేడుకకు వెళ్లిందట!
పై నుండి హెచ్చరికలు.
మరుసటి రోజు ఫైల్ తీసుకుని వచ్చింది. పని ఒత్తిడి. ఛార్జ్‌షీట్ ఇస్తానని చెప్పాడు కోపంతో. అంతే!!
సెక్షన్లోకి ఏడుస్తూ వెళ్లి మోహన్ తన చేయి పట్టుకున్నాడన్న అభాండం వేసింది. పైపెచ్చు ఫైల్ నిన్ననే ఇచ్చేసిందట.. ఎంత గోలగోల. తను తేరుకునేలోపే అంతా జరిగిపోయింది.
ఇరుక్కుపోయాడు. పై స్థాయిలో ఉండి కింద వాళ్లతో పని చేయించాలి. ఆ క్రమంలో కొందరికి తనంటే వ్యతిరేకం రావచ్చు. కావచ్చు. కానీ, అది వ్యక్తిగతం కాదుకదా! ఆఫీస్ పని గురించే కదా! అదను దొరికింది కదా.. అని చండశాసనుడనే ముద్ర అప్పటికప్పుడు వేసేశారు. కింది సిబ్బందిని వేధించేవాడంటూ.. సాక్ష్యాలన్నీ వ్యతిరేకం. ఇంకేం ఉంది. తెలిసిన మీడియాకి చెప్పేసింది. బురద జల్లేశారు. విమలం మొగుడు నలుగురిని వెంటేసుకొచ్చి చెంపమీద కొట్టడం. తనపై అధికారులు ప్లేట్ ఫిరాయించడం. అవమానంతో తలదించుకుని భారంగా వస్తుంటే ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ అండగా లేరు. చకచకా జరిగిన సంఘటనలు నిలవనీయలేదు. మనుషుల్లో ఇంత క్రూరత్వం కోరలు చాస్తుందా?! ఇంటికొస్తుంటే అందరూ వింతగా చూస్తుంటే.. తల కొట్టేసినట్లయింది. టీవీ పెడదామంటే భయం. చిత్రంగా ఒక్కరోజులో బతుకు దుర్భరంగా మారిపోయింది. తలంతా దిమ్ముగా ఉంది.
* * *
పిల్లలు పడుకున్న గదికి వెళ్లాడు. రఘు, రాధి ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. వెళ్లి నుదుటి మీద ముద్దాడాడు. ఫోన్ తీసాడు. మిస్డ్ కాల్స్ బోలెడు ఉన్నాయి. ఓ ఛానల్లో తన గురించే. క్రూరమృగం.. మగాడిద.. మేకవన్నెపులి.. పెళ్లాం లేదా?! పిల్లలు లేరా?! ఇలాంటి వాడ్ని నడి రోడ్డులో ఉరి తీయాలి.
‘అవునండీ! విమలంను ఒంటరిగా రమ్మన్నాడు’ ‘అవునండీ! నామీద ఎన్నాళ్లనుంచో కన్నుంది’.. చెప్తోంది. ఇంకా ఏవేవో.. ఆఫీస్‌లో వాళ్లు చెప్తున్నారు. లాయర్లు. మాజీ పోలీసులు. చర్చలు.. వాదోపవాదాలు. బుర్ర వేడెక్కి పోయింది.
ఏమిటిది? ఇంత మానసిక వ్యధనా! నిజాలు కప్పి ఉండిపోయాయి. అవి అక్కరలేదా?! ఇంత వ్యతిరేకమా తనపైన. ఒక్కసారిగా తన బతుకు, తన కుటుంబం పరువు బజారు కీడ్చేస్తారా?! టైం అయిదు అవుతోంది. కళ్లు మండుతున్నాయి. కిటికీ తెరిచాడు.. గాలి కోసం. బయట ఏదో న్యూస్ ఛానెల్ వ్యాను.. టవర్ పైకెత్తుకుంటున్నారు. చూస్తున్న మోహన్ మదిలో ఏదో తెలియని భయం ఆవహించింది. చిగురుటాకులా కంపించిపోయాడు. ఒక్కసారిగా ఉద్వేగం కమ్ముకుంది. మెదడు మొద్దు బారింది. మనిషి కాలేక పోయాడు. అవమానభారం దుమారం రేపగా.. అనాలోచితంగా, క్షణికావేశంలో అప్పటికప్పుడు జరిగిపోయింది ఆ ఇంట్లో ఒక నిర్ణయం! అది ఘోరాతి ఘోరం!!
* * *
అప్పుడే మెలకువ వచ్చిన నందిని పక్కన మోహన్ లేకపోవడంతో హాల్లోకి వచ్చింది. ఫ్యానుకు వేలాడుతూ నిర్జీవంగా ఉన్న మోహన్ని చూసి..
“అయ్యో.. మోహన్! అత్తమ్మా..” కేకలు వేస్తూ ఒక్కుదుటున కుప్పకూలి పోయింది. భార్యకు తీరనిశోకం. అమ్మకు పుత్రశోకం. పిల్లలకు అంతులేని వేదన మిగిలిపోయింది.. ఆ ఇంట్లో. పోలీసులు వచ్చారు. కసాయిగా ఇంత హంగామా చేసిన ఆ మీడియా ఛానెల్స్ రంగులు మార్చేసాయి.
పదిహేను రోజులైంది.
బంధువులు, ఆఫీస్ వారు, చుట్టు పక్కలవారి సాయంతో అన్ని కార్యక్రమాలూ జరిగిపోయాయి. లోకం మెల్లగా మర్చిపోయింది. ఆ ఇంట్లో మాత్రం.. అందరి కళ్లలో కన్నీరు ఇంకా ఇంకి పోయిందనడానికి లేకుండా.. బావిలో ఊటలా ఉబికి వస్తూనే ఉంది. అది ఎంతగా అంటే, కళ్ల వెంబడి చిప్పిల్లిన కన్నీరు మున్నీరు.. చివరికి మున్నేరుగా అన్నట్లు!
“ఎందుకిలా చేసావ్? తప్పు చేసావ్.. మోహన్! నిన్నే నమ్ముకుని అందరినీ వదులుకుని వచ్చాను. నీ ఆత్మవిశ్వాసం ఏమైంది? నీతోపాటు మమ్మల్ని కూడా బలి చేసేశావు. రాత్రంతా మెలకువతో ఉంటే ఈ దారుణం జరక్కపోయేదేమో.. అయ్యో!” “బాబూ మోహన్! ముందు వెనకా ఆలోచించకుండా ఎందుకు చేశావు ఈ పని. అసలే మీ నాన్న పోయారు. నువ్వు కూడానా! ఈ వయసులో నాకీ కష్టం ఏమిటీ?”
“నాన్నా! ఇంక రారా మీరు” పిల్లలిద్దరి ఘోష!
పుట్టెడు దుఃఖం ఆ ఇంట్లో. రెండు రోజుల క్రితం బాగా నీరసం, నిద్రలేమితో కళ్లు తిరిగి పడిపోయిన నందినిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపారు. ఇంక.. పిల్లల దుఃఖం ఆగట్లేదు. ఇంటి పరిస్థితిని అలా చూస్తున్న భానుమతే మొదటిగా కాస్త తేరుకుంది. ఆలోచించింది. నందినిని, పిల్లలను అనునయించింది. ఇలా ఎన్నాళ్లు? ఇన్నాళ్లు ఏదో తిన్నారు. చక్కగా అన్ని రకాలతో వంట చేసింది.
ముఖ్యంగా మార్పు కావాలి. లేకపోతే అందరం ఏమైపోతామో! అనుకుని.. అదే ఊళ్లో వేరే చోట ఉన్న తెలిసినావిడకి ఫోన్ చేసింది. అక్కడ అద్దెకు ఇల్లేమైనా దొరుకుతుందా? అని.
ఒకరోజు తర్వాత ఫోన్ వచ్చింది. ఇల్లు అద్దెకు ఉన్నట్లు. ఇంటి ఓనర్‌కి చెప్పేసి ఇల్లు ఖాళీ చేసేశారు. సామాన్లు సర్దుతుంటే.. నందినికి ఫోన్. నందిని తల్లి నుంచి.
“నన్ను క్షమించు నందిని. కూతురు పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఏమీ చేయలేని అశక్తురాలు ఈ తల్లి. మీ నాన్న, అన్న ఇక్కడ కట్టి పడేశారు. జరిగిందేదో
జరిగిపోయింది. అన్నీ వదలి నువ్వు వస్తే ఇంట్లోకి రావచ్చట!”
“అలానా?! ఎవరిని వదలి రావాలి.. పిల్లలనా?” “అవును! మీ అత్త దగ్గర వదలి రమ్మంటున్నారు” వెనకాల నాన్న చెప్తున్నారు. “నువ్వూ ఒక తల్లివే కదమ్మా..” “సరే! పిల్లలను తీసుకుని వచ్చెయ్యమంటున్నారు” “అలాగా! అత్తమ్మ సంగతి” “ఏదైనా అనాథశరణా..” ఫోన్ కట్ చేసేసింది నందిని. అంతా విన్నది భానుమతి.. “మరేం ఫర్వాలేదమ్మా! నేనెక్కడైనా బతికేస్తా. ఈ పరిస్థితుల్లో పుట్టింటి అండ నీకుంటే మంచిదమ్మా! ఒకటే బాధ.. పిల్లలను నెలకోసారైనా చూపించమ్మా!” కంట తడిరాగా కోడలితో చెప్పింది.
“అత్తమ్మా! నేను వాళ్ల దగ్గరికి వెళ్తానని అనుకున్నారా? వాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నానని మోహన్నూ, నన్ను అనరాని మాటలన్నారు. కూతురిగా అప్పుడే చనిపోయానన్నారు. పిండం పెట్టేశామన్నారు. మోహన్ చనిపోయాక కనీసం చూడటానికి కూడా రాని కసాయి వారైపోయారు. వాళ్ల దృష్టిలో నేను పరాయిదాన్ని. వాళ్ల కర్కశత్వం ముందు.. పాపం! అమ్మ మాత్రం ఏం చేస్తుంది? మోహన్ని మీలో చూసుకోనివ్వండి. అది చాలు!” అంది భానుమతిని హత్తుకుని.
ఇల్లు మారాక పిల్లల్ని దగ్గరలోని బడిలో చేర్పించారు. నందిని ఇంకా మామూలు మనిషి కాలేకపోతుంటే.. పిల్లలను దింపడం దగ్గర నుంచీ ఇంట్లో అన్ని పనులూ తనే చక్కబెట్టుకుని వస్తున్నది భానుమతి. ఆఫీస్ నుండి రావాల్సిన డబ్బులు ముప్పై అయిదు లక్షల దాకా అందాయి. చుట్టుపక్కల వారిని పరిచయం చేసుకుంది భానుమతి. చిన్నచిన్న సహాయాలు చేస్తూ.. వీధిలో అందరికీ పరిచితురాలై పోయింది. “ఈ పక్క వీధిలో ఇరవై లక్షలకు ఇల్లు బేరం పెట్టారని పక్కింటి కామాక్షి చెప్తే చూసి వచ్చానమ్మా! కొనుక్కుని ఒక లక్ష ఖర్చు పెట్టుకుంటే ఇంటిని బాగు చేసుకోవచ్చు” అంది భానుమతి ఓరోజు.
“ఏమో అత్తమ్మా! మీరే ఆలోచించండి” చెప్పింది నందిని.
మంచి-చెడు గురించి అందరినీ సంప్రదించి, అన్నీ ఆలోచించి ఇల్లు తీసేసుకున్నారు. ఒక శుభముహూర్తాన నందిని పేర రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కొత్త ఇంటికి రంగుల దగ్గరనుంచీ సామాన్లు.. అవీఇవీ అన్ని పనులూ తనే దగ్గరుండి చూసుకుంది భానుమతి. మూడు నెలలు గడచినా నందిని తేరుకోలేదు. ఆలోచనల్లోంచి ఇంకా బయటికి రాలేదు.
‘నందినిలో మార్పు రావాలి. అదొక పీడకల అనుకుని బయట పడాలి’ అనుకుంది భానుమతి.
“మన బైక్ అలాగే ఉందమ్మా! పాడైపోతుంది. నువ్వు నేర్చుకుంటానంటే ఎదురింటి అమ్మాయి శృతి నేర్పుతానంది”
“అలాగే అత్తమ్మా! రేపటినుంచీ నేర్చుకుంటా”
“నేర్చుకోమ్మా! దేనికైనా అవసరం వస్తుంది. పక్కన వీధి వెనకాల పెద్ద పార్క్ ఉందమ్మా! పిల్లలను రోజూ తీసుకొని వెళ్దాం. కాస్త ఆడుకుంటారు”
“అలాగే అత్తమ్మా!”
* * *
ఆరోజు పిల్లలను బడిలో వదలి వస్తుంటే కొత్తగా కట్టిన ఆసుపత్రి రిసెప్షన్లో ఉద్యోగం ఉందని ఎవరో అంటుంటే భానుమతికి తెలిసింది. వాకబు చేసింది.. నందిని వద్దంటున్నా! “కాలం గాయాలను మాన్పుతుంది. వేరే పని ధ్యాసలో పడితే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది” అని చెప్పి పంపింది. ఇంటర్వ్యూ అయ్యాక ఉద్యోగం వచ్చింది నందినికి. బైక్ మీద రోజూ ఉద్యోగానికి వెళ్లి రావడం.. ఇంట్లో పిల్లలకు పాఠాలు చెప్పడం.. వంటలో సహాయం చేయడం.. సాయంత్రం అలా పార్క్‌కి వెళ్లడం.. అన్నీ కాస్త మార్పునిచ్చాయి నందినికి.
ఓరోజు.. నందినికి హాస్పిటల్లో పని ఉండటంతో రఘు, రాధిని బడి దగ్గర వదిలి వస్తున్నది భానుమతి. ఎదురుగా ఆటో ఒకావిడను గుద్దేసింది. ఆవిడ పడిపోతే చేతి మీద నుండి ఆటో చక్రం ఎక్కింది. ఆటోవాడు కనికరం లేకుండా ఆగకుండా పోయాడు. ఆవిడ రక్తమోడుతూ పడిఉంటే.. అందరూ ఫోన్లో ఫొటోలు తీసుకునేవారే! అయ్యో.. అనేవారే కానీ సహాయం చేసేవాళ్లే కరవు అనుకుంది భానుమతి.
ఆవిడను లేపి కూర్చోబెట్టి నీళ్లు తాగించింది. చేయి చితికిపోయి నొప్పితో విలవిల లాడుతున్నదామె. అక్కడ ఉన్న మరో ఆటో అతణ్ని బతిమిలాడి ఒకరిద్దరి సాయంతో నందిని పనిచేస్తున్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఎందుకైనా మంచిదని దారిలో పోలీసాయన కనిపిస్తే.. ఆటోలో ఎక్కించుకుంది. పాపం.. ఆమె చేయి లేపలేక పోతోంది. ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు. ఆవిడ పరిస్థితి చూసి.. ‘అయ్యో పాపం!’ అనుకుంది భానుమతి.. రాత్రి భోజనాలు అయ్యాక రఘు, రాధి చదువుకుని పడుకున్నారు.
నందినికి మోహన్ గుర్తుకొచ్చాడు. మోహన్ నిష్ర్కమణ తరువాత ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి చూసుకుంది. పిల్లలు, తను ఇలా ఉన్నారంటే అమ్మలాంటి అత్తమ్మే కారణం. ఇప్పుడు జీవితంలో కొంత ఆత్మవిశ్వాసం, కొత్త వెలుగు, ఆశ కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఒంటి చేత్తో ఊహించని విధంగా తన
జీవితాన్ని నిలబెట్టింది, నడిపిస్తోంది అత్తమ్మ!
మోహన్ వెళ్లిపోయాక ఈరోజు కుటుంబం ఇలా నిల బడి ఉందంటే.. దీని వెనకాల అత్తమ్మ కృషి, పట్టుదల, ఓర్పు-నేర్పు ఎంతో ఉంది. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డది. మాటల్లో చెప్పలేని పనులు చేసింది. మోహన్ ఉన్నప్పుడే సొంత ఇల్లు కొనుక్కోలేక పోయాము. ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం. అటువంటిది అత్తమ్మ కృషితో ఇప్పుడు ఆ కల నెరవేరింది. భానుమతి అప్పుడే పడుకుంటుంటుంటే.. నందిని వచ్చింది. కోడల్ని చూసి.. “ఏమ్మా! ఇంకా పడుకోలేదా?” అని అడిగింది.
“ఎందుకో ఈ రోజు నిద్ర రావడంలేదు అత్తమ్మా!” అంటూ, భానుమతి ఒళ్లో వచ్చి పడుకుంది. ఎంతో సాంత్వన పొందిన అనుభూతి. “మోహన్ వెళ్లిపోయాక నేను మనిషిగా మిగులుతానని అనుకోలేదు. ఈరోజు నేనిలా ఉన్నానంటే.. నా బతుకులో అంతటా అన్నిటా మీరే కనిపిస్తున్నారత్తమ్మా!” అంది కళ్లలో నీళ్లు చిప్పిల్లుతుంటే.
“అదేం లేదమ్మా! అదొక పీడకల అనుకుంటేగానీ బతకలేం!” “ఇన్నాళ్లూ అన్యమనస్కంగా ఉండి, మీకు ఏ పనుల్లోనూ సరిగ్గా సహాయం చేయలేదు. పిల్లల విషయంలో కూడా మీరు పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. పుత్రశోకంలో ఉండి కూడా మమ్మల్ని ఆదుకున్నారు. ఇక నుండీ మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అత్తమ్మా!” “మరేం ఫర్వాలేదు నందిని. నీ కోసం, పిల్లల కోసమే నా తాపత్రయమంతా! పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అది చాలు. ఇది మన కుటుంబం. ఇంకేం ఆలోచించకు. నీకు ఉద్యోగం దొరికింది.. అది చాలు. నాకు ఓపిక ఉన్నంత వరకు ఫర్వాలేదు.. చూసుకోగలను” అంది.
“అత్తమ్మా! ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. చివరి విచారణలో మోహన్ నిర్దోషిగా నిర్ధారణ అయిందట. కొత్తగా ఎవరో ఆఫీసర్ వచ్చారట. మనకు పెన్షన్. ఆపై ఉద్యోగం వచ్చే అవకాశం ఉందట!”
“మోహన్ తప్పు చేయడమ్మా! నిజం నిలకడ మీదే తేలుతుంది. అంతా విధిరాత. మన తలరాత” భానుమతి కళ్లలో కన్నీరు. “చాలా రాత్రయింది ఇంక పడుకోండి అత్తమ్మా!” అంది నందిని లేస్తూ. “అవునూ.. అడగడం మర్చిపోయా! పొద్దున ఆటో గుద్దినావిడకు ఎలా ఉందమ్మా!?” అడిగింది భానుమతి.
“కుడిచేతికి బాగా దెబ్బ తగలడంతో చేతి నరాలు చచ్చుపడి పోయాయట. మిగతా అంతా ఫర్వాలేదు. మీరు వెంటనే తీసుకొని రావడంతో ప్రాణాలకు ముప్పులేదంట. అందరూ మిమ్మల్నే మెచ్చుకున్నారు అత్తమ్మా!”
“పోనీలే! గుద్దిన ఆటోవాడు దొరికాడా? ఆవిడ తాలూకు వాళ్లు వచ్చారా!” అడిగింది భానుమతి. “దొరికాడులే! ఆవిడ బంధువులు వచ్చారు. తెలిసిందేమిటంటే.. ఆవిడ భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందట. దాంతో ఆవిడ మానసిక పరిస్థితి బాగులేదట”
“అలానా?!”
“ఆవిడ మోచేతి వరకూ చేయి తీసేశారు”
“అయ్యో పాపం! పేరేంటో.. అడగను కూడా అడగలేదు”
“ఆవిడ పేరు.. విమలం!”
ప్రస్తుతం మీడియా వెర్రి పోకడలకు బలై.. వేదనకు గురవుతున్న జీవితాలెన్నో! అలాంటి ఓ కుటుంబంలో ఓ అత్త.. అభాగ్యురాలైన తన కోడలిని జీవితంలో ముందుకు నడిపే కథాంశంతో సాగుతుంది.. ‘అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా!’. రచయిత జి.ఎన్.వి. సత్యనారాయణ. స్వస్థలం అనకాపల్లి దగ్గర కశింకోట. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇక్కడి ఎ.జి. ఆఫీస్‌లో ఏఏవోగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. సాహిత్యాభిలాషతో రచనలు చేస్తున్నారు. ఈయన రాసిన అనేక కథల్లో ఓ నలభై వరకూ.. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్రప్రభ, బాలజ్యోతి, ఈనాడు ఆదివారం, విపుల, రంజని, ఉషా.. ఇలా వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో కొన్నిటికి బహుమతులు వచ్చాయి. ఆకాశవాణికి రాసిన ‘లేతమనసులు’ నాటిక.. జాతీయస్థాయిలో ప్రసారమైంది. తాజాగా, విశాఖ సంస్కృతి, సహరి, రవళి కథల పోటీలలో బహుమతులు అందుకున్నారు. సాహిత్యం.. సమాజానికి ఉత్తేజం, వికాసం ఇస్తాయని నమ్ముతారు రచయిత. నమస్తే తెలంగాణ-ముల్కనూర్ సాహితీ పీఠం కథల పోటీల్లో బహుమతి పొందడం ఇదే మొదటిసారి.
– జి.ఎన్.వి. సత్యనారాయణ
9948570150