e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బతుకమ్మ తెలంగాణ సినిమా కవులు పదునైన పాటల ప్రవాహం

తెలంగాణ సినిమా కవులు పదునైన పాటల ప్రవాహం

తెలంగాణ సినిమా కవులు పదునైన పాటల ప్రవాహం

ఆయన కలం పదునైన పాటల ప్రవాహం. యువతరాన్ని ఉర్రూతలూపే అక్షరాల సమాహారం. ‘మెరుపై సాగరా.. ఆ గెలుపే నీదిరా.. నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా’ అంటూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ‘ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ, నీళ్లకు బదులు నిప్పులు రానీ..’ అంటూ మనిషి మనిషికీ ధైర్యాన్ని, ఆవేశాన్ని ఆయుధంగా అందించాడు. ఆయనే చిన్ని చరణ్‌గా సుపరిచితులైన చరణ్‌ అర్జున్‌. 

తెలుగు సినీ ప్రేమికులకు చిన్ని చరణ్‌గా సుపరిచితుడైన చరణ్‌ అర్జున్‌ది నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి. తల్లిదండ్రులు కొండేటి గోపమ్మ, మల్లేశ్‌. స్వగ్రామంలోనే పాఠశాల విద్యను అభ్యసించారు. ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సంగీత శాఖలో డిగ్రీ, డిప్లొమా కోర్సులో చేరారు. దాన్ని మధ్యలోనే వదిలేసి, సువిశాల సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. పాఠశాల దశ నుంచే పాటలు రాసేవారు, పాడటంపై మక్కువ చూపేవారు. అలా రాసిన ఒక పాటతో ‘జన్మభూమి’ రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. చరణ్‌ పాటల గురించి తెలుసుకొన్ని సినీదర్శకుడు ఎన్‌.శంకర్‌, ఆయనను సినీరంగానికి ఆహ్వానించారు. అలా, 2003లో వచ్చిన ‘ఆయుధం’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదటిపాటతోనే మంచి గుర్తింపు రావడంతో, చదువును మధ్యలోనే ఆపేసి, పాటల రచయితగా స్థిర పడిపోయారు.

తొలి ఆయుధం..

‘ఆయుధం’లో ‘ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా’ అంటూ మొదటి పాట రాశారు చరణ్‌. తొలిప్రేమతో ప్రేమికుల్లో మొదలయ్యే గిలిగింతల్ని, పులకింతల్ని ఈ గీతం ద్వారా కండ్లకు కట్టారు. ఆ తర్వాత, ‘తొలిచూపులోనే’ (2003)లో ‘పగడాల పెదవిపైన తెలుగింటి మీగడల్లే తేనెల్ని చిలుకును తొలిముద్దు.. మకరందాన్ని పీల్చును మలిముద్దు’ అంటూ ప్రణయ గీతం అల్లారు. చుంబనంలోని స్వచ్ఛదనాన్ని, తీయదనాన్ని వివరిస్తూ, ప్రణయలోక సరిహద్దులు దాటిన ముద్దు మాహాత్మ్యాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి’(2004)లో ‘ఓహో చందమామా.. ఒక్క మాటుందమ్మా’ అంటూ రాసిన పాటా వైవిధ్యమైందే. ఓ అమ్మాయి నెలరాజుతో చెప్పుకొంటున్న సంగతులను పాటగా అల్లి తన ప్రత్యేకతను చాటారు. తనలోని భావుకుడిని ప్రపంచానికి పరిచయం చేశారు.

ైస్టెల్‌ ైస్టెల్‌గా..

పాటల రచయితగా చిన్ని చరణ్‌కు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన సినిమా ‘ైస్టెల్‌'(2006). ఇందులో ఆయన రాసిన మూడు పాటలూ విశేష జనాదరణను పొందాయి. డ్యాన్స్‌నే లక్ష్యంగా పెట్టుకున్న నలుగురు యువకుల ఆత్మవిశ్వాసాన్ని ఎలుగెత్తి చాటేలా రాసిన పాట.. ‘మెరుపై సాగరా.. ఆ గెలుపే నీదిరా’.ఒక ఉన్నతమైన ఆశయంతో ముందుకు నడిచేలా ప్రతి ఒక్కరికీ ఇది ఉత్తేజాన్నిస్తుంది. ఇంచుమించుగా ఇదే ఒరవడిలో సాగిన గీతం ‘రా.. రా.. రా.. రా.. రమ్మంటున్నా.. రణరంగంలో సిద్ధంగున్నా’. సంకల్పంతో సాగిపోవడమే కాదు, నీ గమనానికి అడ్డుపడే అసూయపరులను ఎదుర్కొనే సత్తా కూడా ఉండాలని హితవు చెప్పారు.

స్నేహం.. ప్రేమ

‘శంభో శివ శంభో’(2010)లో ‘ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ, నీళ్లకు బదులు నిప్పులు రానీ’ అనే మహోజ్జ్వల చైతన్య గీతాన్ని అల్లారు. ఈ పాటలో యువకుల వీరావేశం, సంకల్పం కనిపిస్తుంది. ఆ తర్వాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’(2009)లో ‘ఎవడే.. ఎవడే.. ఎవడే.. సుబ్రమణ్యం’ అంటూ సరికొత్త శైలిని ఎంచుకున్నారు. ఇందులో ‘కనులే తెలిపింది కలలే చూపింది.. ఏమైయిందో ఏమో గాని అంతా మారింది’ అనే పంక్తుల్లో చెలి తలపులు ప్రియుడిని ఎలా వేధించాయో, ఆమె వలపుల వలలో పడిన ప్రియుడి వింత మైకమేమిటో కొంటె భావాలు జోడించి చెప్పారు.

మాస్‌.. క్లాస్‌.. 

‘రచ్చ’(2012)లో ‘మిలుకు మిలుకు సిలకా.. నీ మీఠా పెదవే కొరకా’ అంటూ ఓ శృంగార గీతాన్ని రాశారు. మాస్‌.. క్లాస్‌.. ప్రేక్షకులతో ఈ పాట చప్పట్లు కొట్టించింది. ‘నేను నాన్న అబద్ధం’(2011)లో ‘తన పేరే అణువంత.. తన పారే జనమంత.. తన ఊరే జగమంత.. తన జీవం జన్మంత’ అంటూ ఓ పాటకు జీవం పోశారు.  ప్రేమికుడి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రేయసి పాడే గీతమిది.  ‘జార్జ్‌ రెడ్డి’ (2019)లోని  ‘నాలాగే అన్ని నాలాగే.. నాచిన్ని కన్నా చూస్తున్నా నిన్ను నాలోనా’ పాట ప్రేమబంధాన్ని, అనురాగాన్ని కలబోసుకుంది. సినిమాలో ఈ పాటను చరణే పాడటం విశేషం. వీటితోపాటు లక్ష్మీకల్యాణం, ఢీ, డాన్‌, ఫుల్‌ గ్యారంటీ.. లాంటి అనేక సినిమాలకు చిన్ని చరణ్‌ పాటలు రాశారు. కొన్ని సినిమాలకు సంగీతం అందించి, పాటలూ పాడారు. తెలంగాణ నేలపై పాటల తేజమై ప్రకాశిస్తూ ప్రయాణిస్తున్నారు చరణ్‌.

-తిరునగరి శరత్‌ చంద్ర

6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ సినిమా కవులు పదునైన పాటల ప్రవాహం

ట్రెండింగ్‌

Advertisement