పిల్లల విషయంలో అమ్మ కన్నా ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు? ఆహారం నుంచి ఆరోగ్యం వరకు అన్నింటిపై శ్రద్ధ పెడుతూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. ముఖ్యంగా పసిపిల్లలు వేసుకునే దుస్తులు, ఆడుకునే బొమ్మల్లోనూ ఆరోగ్యాన్ని వెతికే తల్లులకోసం తీసుకొచ్చిందే.. ‘వైట్వాటర్ కిడ్స్’. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లాథింగ్ బ్రాండ్‌ను అహ్మదాబాద్‌కు చెందిన శ్వేత, అంకిత అనే ఇద్దరు ఆక్కాచెల్లెళ్లు ప్రారంభించారు. ఆంత్రప్రెన్యూర్లుగా స్థిరపడాలన్న వారి లక్ష్యానికి సమాజ హితం జోడించి ముందుకుసాగుతున్నారు.
పసిపిల్లల చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. వాతావరణంలో ఏ చిన్నమార్పు వచ్చినా, కొత్త దుస్తులు వేసినా.. ఆ పసి మేను కందిపోతుంది. ముఖ్యంగా కొందరు పిల్లలకు దుస్తుల వల్ల తీవ్రంగా దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడతాయి ‘వైట్వాటర్ కిడ్స్’ బ్రాండ్ దుస్తులు. పూర్తి ఆర్గానిక్ కాటన్‌తో తయారు చేస్తున్న దుస్తులు, బొమ్మలు పిల్లలకు వరంగా మారాయి.శ్వేత, అంకిత చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు.
ఎందుకంటే వారిద్దరూ విధి వంచితులే! ఒకరు చర్మ సంబంధమైన అనారోగ్యంతోపాటు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. మరొకరు సరిగ్గా నడవలేరు. అయినా, ఇద్దరూ పట్టుదలగా చదువుకున్నారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయినా వారికి తృప్తి కలగలేదు. వ్యాపారవేత్తలుగా స్థిరపడి.. పదిమందికీ ఉపాధి కల్పించాలని కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునే దిశగా 2017లో ‘వైట్వాటర్ కిడ్స్’ ప్రారంభించారు. పిల్లలకు స్కిన్ ఫ్రెండ్లీ దుస్తులు అందిస్తూనే, పర్యావరణానికి హితం చేస్తున్నారు.
టెక్స్టైల్ డిజైనర్ అయిన శ్వేత కాటన్ దుస్తుల ప్రాముఖ్యతపై మొదట్నుంచీ ప్రచారం చేసేది. అలాగే తన పిల్లల కోసం మెత్తటి కాటన్ దుస్తులనే వెతికి మరీ కొనేది. ఆమె కోరుకున్న క్వాలిటీ దొరికేది కాదు. దీంతో ఎప్పటికైనా కాటన్ క్లాథింగ్లో బిజినెస్ ప్రారంభించాలని అనుకుందామె! ‘పిల్లల నుంచి పెద్దల వరకు కాటన్ దుస్తులు ఇచ్చేంత హాయి, ఆరోగ్యం మరే ఫ్యాబ్రిక్ ఇవ్వలేవు. 2007 నుంచి 2017 వరకు నేను రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్లి దుస్తులు పరిశీలించేదాన్ని. అలాగే స్థానిక చేనేత కళాకారులతో తరచూ మాట్లాడేదాన్ని. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు, మార్కెట్ పరిస్థితులను తెలుసుకునేదాన్ని. మొత్తానికి అన్నిటిపై అవగాహన వచ్చాక ఈ స్టార్టప్ ప్రారంభించామ’ని శ్వేత చెప్పుకొచ్చింది.
‘వైట్వాటర్ కిడ్స్’ పేరును కూడా అక్కాచెల్లెళ్లు వాళ్ల కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా ఎంచుకున్నారు. ప్యూరిటీకి వైట్, లైఫ్ ట్రాన్స్పరెన్సీకి వాటర్లను గుర్తుగా ఈ పేరు ఎంచుకున్నారు. ‘వైట్వాటర్ కిడ్స్’ దుస్తులను గ్రామీణ చేనేత కళాకారులు ఎంతో ప్రేమతో తయారు చేస్తున్నారు. పశ్చిమ్ బెంగాల్‌లోని కంతా, గుజరాత్‌లోని అజ్రక్ నుంచి దక్షిణ భారతంలోని వివిధ కళాకారుల వరకు అందరూ సంప్రదాయ పద్ధతుల్లో పిల్లల దుస్తులను అందంగా, ప్రేమగా తయారు చేస్తున్నారు.
‘ఈ స్టార్టప్ ప్రారంభించడానికి ముందే దేశంలోని వివిధ చేనేత కళాకారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మాకు ఎలాంటి డిజైన్లలో దుస్తులు కావాలో వాళ్లకు వివరించాం. ముఖ్యంగా మహిళా కళాకారులను ప్రోత్సహించాలని భావించాం. వందలమంది మహిళలు ఇప్పుడు మాతో ట్రావెల్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌పై కళాకారులతో బ్లాక్ ప్రింట్స్ వేయిస్తున్నాం. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధమైన రంగులనే దీనికి వినియోగిస్తున్నాం. బొమ్మలు కూడా తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తులు పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ’ అని చెబుతున్నది అంకిత.
‘వైట్వాటర్ కిడ్స్’ ఉత్పత్తులకు సింగపూర్, అమెరికా, ఇటలీ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. జబ్లా, కుర్తీ సెట్లు, టవళ్లు, మెత్తలు ఇలా రకరకాల ఉత్పత్తులు సరసమైన ధరలకు అందిస్తున్నారు వీళ్లు. ధర తక్కువగా ఉండటం తమకు ప్లస్ అయిందని చెబుతున్నారు. లాభాల కన్నా.. వినియోగదారుల సంతృప్తి, పిల్లల ఆరోగ్యమే తమకు ముఖ్యం అంటారు. ఇది కేవలం వ్యాపారం కాదని, ఒక ఉద్యమంలా చేపట్టామని శ్వేత చెబుతున్నది. నేటి బాల్యం ప్లాస్టిక్, రసాయనాల చుట్టే తిరుగుతున్నది. దుస్తుల్లోనూ రసాయనాలు, సింథటిక్ రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థిని మార్చాలని, కాటన్ దుస్తులకు పూర్వ వైభవం తీసుకురావాలన్న వీళ్ల ప్రయత్నం ప్రశంసనీయం.
శ్వేత, అంకిత కేవలం దుస్తుల డిజైనింగ్‌కే పరిమితం కాలేదు. శ్వేత మంచి రచయిత్రి. పిల్లల దుస్తుల ద్వారా కథలు చెప్పాలనుకుంది. ఫ్యాబ్రిక్‌పై చిన్న చిన్న కవితలు రాస్తుందామె. పిల్లల అందాన్ని, ఆనందాన్ని, ఎదుగుదలను తెలుపుతూ చిట్టిపొట్టి కవితలు, వాక్యాలు రాస్తుంది. వాటిని ఫ్యాబ్రిక్‌పై ముద్రిస్తారు. దాంతో తయారైన దుస్తులు తల్లిదండ్రులకు మరింత ముచ్చటగొలుపుతాయని చెబుతుంది శ్వేత. వైట్వాటర్ కిడ్స్ దుస్తులు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు.