వాళ్లు నిజంగానే నోరు లేని బిడ్డలు. ఆకలేస్తే ఏడ్వను కూడా లేరు. అమ్మవైపు ఆశగా చూడనూ లేరు. ఎందుకంటే వాళ్లింకా పుట్టని బిడ్డలు. గర్భస్థ శిశువులు. అయినా సరే ఆ ఊపిరి ఆడపిల్లది అని తెలిస్తే చాలు… జాలి అన్నది లేకుండా చిదిమేసే ఎందరినో తన కళ్లతో చూసింది మహారాష్ట్రకు చెందిన వర్ష దేశ్‌పాండే. ఇదెక్కడి అన్యాయం, ఇంత వివక్ష ఎందువల్ల… అన్న ప్రశ్నలు ఆమెను పోరాటం వైపు నడిపించాయి. అగ్రవర్ణాలకు చెందిన ఆమె, ఇలాంటి విషయంలో దళిత మహిళలు మరింత ఇబ్బంది పడుతున్నారని గమనించింది. 35 ఏండ్ల కింద ‘దళిత్ మహిళా వికాస్ మండల్’ని స్థాపించి, దాని ద్వారా లక్షల్లో భ్రూణ హత్యలను ఆపి, ఎందరో ఆడబిడ్డలకు జీవితంలోనూ అండగా నిలిచింది. అందుకుగాను ఈ ఏడాది భారత్ నుంచి ఐక్యరాజ్య సమితి పీపుల్స్ అవార్డును అందుకుంది.
అందరూ మనుషులే అయినప్పటికీ ఆడవాళ్లు కొంచెం తక్కువ సమానం మనుషులు. ఎంతో బలంగా పాతుకుపోయిన ఇలాంటి భావనను సమాజం నుంచి పోగొట్టడానికి రకరకాల సంఘాలు వెలిశాయి. ఎన్నో ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. అదే కోవకు చెందిన ఓ ప్రయత్నమే దళిత్ మహిళా వికాస్ మండల్ స్థాపన. 35 ఏండ్ల క్రితం వర్ష దేశ్‌పాండే దీన్ని స్థాపించినప్పటికి తాను మెట్టిన మహారాష్ట్రలోని సతారా నగరంతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వరకట్న వేధింపులతో పాటు, భర్త వదిలేసిన ఆడవాళ్లు ఆ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. వాళ్లకు విడిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకురావాలని, విడిగా రేషన్ కార్డులు మంజూరు చేసి బతికేందుకు అవకాశం కల్పించాలని తీవ్రంగా పోరాటం చేసింది. ఆ సమయంలోనే అలా లింగవివక్ష కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కోసం దళిత్ మహిళా వికాస్ మండల్‌ను ఏర్పాటు చేసింది.
పుట్టాక సంగతి పక్కన పెడితే, కడుపులో ఉన్నప్పుడే ఆ సమయంలో ఆడబిడ్డల మీద కర్కశత్వం రాజ్యమేలింది. స్కానింగ్ చేసి మరీ ఆడపిల్లల్ని కనిపెట్టి కడుపులో ఉన్నప్పుడే చిదిమేయడం పరిపాటిగా మారింది. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే పార్లమెంటులో దీని మీద చట్టం చేయాల్సి వచ్చింది. 1994లో లింగ నిర్థారణ పరీక్షలు చట్ట విరుద్ధం అంటూ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టాన్ని రూపొందించారు. ఇది వర్ష ప్రారంభించిన సంస్థకు బలాన్ని చేకూర్చింది. మహారాష్ట్రలో తాను పనిచేస్తున్న ప్రాంతంతో పాటు ఎన్నో చోట్ల ఈ పరీక్షలు, గర్భవిచ్ఛిత్తి కార్యక్రమాలు విపరీతంగా జరిగేవని ఆమె అప్పటికే ఉన్న తన నెట్వర్క్ ద్వారా తెలుసుకుంది. దీంతో లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉండటాన్ని గమనించింది.
పెండ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో లా చదువుకొని సంఘ సేవలోకి వచ్చిన ఆమెకు ఈ విషయం మీద లోతుగా పనిచేయాల్సిన అవసరం అర్థమైంది. అందుకే ‘లేక్ లడ్కీ అభియాన్’ పేరిట కార్యాచరణ రూపొందించి చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రుల పనిపట్టేందుకు గర్భిణులతో కలిసి రంగంలోకి దిగింది. కొన్ని వందల స్టింగ్ ఆపరేషన్లు చేసింది. ఒక్క రోజులో 35కు పైగా అబార్షన్లు చేసే ఒక డాక్టర్‌ను పట్టుకొని జైలు శిక్ష పడేదాకా పోరాడింది. అది ఆ చుట్టు పక్కల ఎన్నో ఆసుపత్రుల వెన్నులో వణుకు పుట్టించింది. అలా ఆమె కొన్ని వేల మంది గర్భస్థ శిశువుల్ని కాపాడింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో 2011 సంవత్సరంలో 1000 మంది అబ్బాయిలకు గాను 807 అమ్మాయిలు ఉండగా 2014 నాటికి 905కి పెరిగింది. అనతి కాలంలోనే వీళ్ల చర్యలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నదానికి ఈ సంఖ్య ప్రత్యక్ష ఉదాహరణ.
జనాభా పరిరక్షణ, లింగ సమానత్వం, పునరుత్పాదకత దానికి సంబంధించిన సమస్యలు, పరిష్కారాల మీద పనిచేసే వ్యక్తులు, సంస్థలకు గడచిన నలభై రెండేండ్లుగా ఐక్యరాజ్య సమితి అవార్డులను ప్రదానం చేస్తున్నది. పాపులేషన్ అవార్డు పేరిట ఇస్తున్న దీన్ని భారత దేశం నుంచి తొలుత దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ (1983లో) అందుకోగా, ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా దీన్ని 1992లో పొందారు. అదే అవార్డును వారిద్దరి తర్వాత భారతదేశం నుంచి అందుకుంటున్న మూడో వ్యక్తి వర్షనే. నిజానికి ఒక్క భ్రూణ హత్యల గురించే కాదు, మహిళలకు సంబంధించి అనేక విషయాల మీద ఆమె పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన వాటా కోసం పోరాటాలు జరిపారు.
వాళ్ల ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో సదస్సులు పెట్టి పొలాలను ఉమ్మడి ఆస్తులుగా రాయించేందుకు కృషి చేశారు. అంతేకాదు, నగరాల్లోనూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసేందుకు ఎన్నో వృత్తి శిక్షణ క్యార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణించేందుకు సాయపడే వ్యవస్థలనూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వమూ ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించింది. తాము మహిళల కోసం రూపొందిస్తున్న అనేక విధానాల రూపకల్పన, నిర్వహణలో వర్ష ఇప్పుడు భాగస్వామి. ‘నేను పెండ్లి చేసుకునే ముందే మావారు నన్ను సమాజ సేవ చేయాల్సిందిగా కోరారు.
మా ఇంటి వాతావరణమూ, ఆలోచనలూ ఇందుకు చక్కగా సరిపోవడంతో దానికి ఆనందంగా ఒప్పుకొన్నా. ఆయన దన్నుతో, నాలాంటి ఎందరో కార్యకర్తల కృషితో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. న్యూయార్క్ వేదికగా ఈ అవార్డు అందుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలువైన సేవలు చేసిన వారితో పాటు నన్ను కూడా గుర్తించడం గర్వంగా ఉంది. ఈ సందర్భం లింగ వివక్ష వ్యతిరేక పోరాటానికి మరింత బలాన్నివ్వాలని కోరుకుంటున్నా’ అంటూ తన ఆనందాన్నీ అభిలాషనూ బహుమతి స్వీకారం తర్వాత వెలిబుచ్చారామె. నిజమే మంచి పనిని చాటి చెప్పడం అన్నది నలుగురిలోనూ ఆ దిశగా స్ఫూర్తి రగిలించే చర్యే!