రహీమా ఖుషీ.. మయన్మార్‌లోని కుతూపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న పేద రోహింగ్యా కుటుంబంలో పుట్టింది. అక్కడి క్యాంప్ స్కూల్లోనే ఐదో తరగతి వరకు చదివింది. రోహింగ్యా మహిళల దుస్థితిని కళ్లారా చూసిన ఖుషీ, ఆ జీవితాల్లో మార్పు తీసుకురావాలని సంకల్పించింది. ఇందుకు మార్గం అక్షరమే అని ఆమెకు అర్థమైంది. కానీ, బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం రోహింగ్యాలకు పెద్ద చదువులు నిషిద్ధం. రహీమా ఖుషీ తన మూలాలను దాచిపెట్టి ఎస్సెస్సీ పరీక్షలు రాసింది.
గవర్నమెంట్ వుమెన్స్ కాలేజీ నుంచి ఉన్నతవిద్య పూర్తి చేసింది. పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసింది. దివాస్ అనే ఎన్జీవోకు సీయీవోగానూ వ్యవహరించింది. ఇదంతా చేస్తూనే.. న్యాయవాది కావాలన్న కలను నిజం చేసుకునేందుకు మరోసారి అధికారుల కళ్లు కప్పి లా యూనివర్సిటీలో సీటు సంపాదించింది. విషయం బయటికి పొక్కడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖుషీని విశ్వ విద్యాలయ ఆవరణ నుంచి గెంటేసింది.
చదువుమాట ఎత్తితే చంపేస్తామని, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారు. యాసిడ్ దాడికి ప్రయత్నించారు. అయినా, ఖుషీ భయపడలేదు. తన పోరాటాన్ని ఆపనూలేదు. ప్రస్తుతం రోహింగ్యా మహిళలకు కుటుంబ నియంత్రణ మీద అవగాహన కల్పిస్తున్నదామె. మాతృ మరణాలను నియంత్రించే పనిలోనూ ఉన్నది. కొందరి జీవితమే ఓ పోరాటం.