విజయతీరాలు చేరాలంటే ఆ దారిలో ఎన్నో ముళ్లు. ముఖ్యంగా ఆడపిల్లలకయితే అవి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటాయి. జనగామకు చెందిన గాదె మంజుల కూడా ఇలాంటి దారిలోనే నడిచారు. చిన్నతనంలోనే జరిగిన పెళ్లి, చదువుకు విరామమిచ్చింది. భర్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులూ… అధికమాసంలా పలకరించాయి. అయితేనేం, ఆమె పుస్తకం వదలలేదు. జీవిత లక్ష్యాన్ని మరువలేదు. ఆ అలుపెరుగని శ్రమ ఆమెకు న్యాయపీఠాన్ని కట్టబెట్టింది. గాదె మంజుల… ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జి. ఆమె కథ ఎందరో పల్లెటూరి ఆడపిల్లలకు ఆదర్శం. ఆమె తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
జీవితం కొందరికి వడ్డించిన విస్తరిలా ఉంటే, కొంతమందికి ఆ అవకాశం లేకపోయినా తామే వడ్డించుకుని, అందులోనే నలుగురికీ కడుపు నింపుతారు. ఇందులో రెండో కోవకు చెందుతారు మంజుల. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామం వీళ్ల సొంతూరు. తండ్రి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చారు. ఇక్కడే ఆటోడ్రైవర్‌గా ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. అందులో తొలి సంతానంగా పుట్టిన మంజులకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆడపిల్ల కావడంతో ఇంటర్మీడియెట్‌తోనే ముగింపు పలికారు తల్లిదండ్రులు. బంధువుల అబ్బాయినే చూసి పెళ్లి చేశారు. తన చదువు అక్కడితో ఆగిపోయిందని తొలుత అనుకున్నారు మంజుల. అయినా, తనకిష్టమైన పుస్తకాలను వదలకుండా ఉండేలా టీచర్ వృత్తిలో చేరారు. ఆమెకు ఉన్నత చదువుల మీద ఉన్న ఇష్టం భర్త అశోక్‌కు తెలియడంతో ఆయన ఆ దిశగా ప్రోత్సహించారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలోనే డిగ్రీ, తర్వాత పీజీ పూర్తి చేశారు. చదువుకున్నది కామర్స్ కావడంతో కొన్నాళ్లు అకౌంటెంట్‌గానూ పనిచేశారు.
పల్లెటూరికి సేవ చేయాలని…
చిన్నతనంలో తన ఊరివాళ్లు భూ వివాదాలు, కుటుంబ తగాదాల విషయంలో స్థానికంగా పంచాయతీలు చేసుకుని సర్దుకుపోయేవాళ్లు. అక్కడ సరైన న్యాయం జరగలేదనీ, కోర్టుకు వెళితేనే వాళ్లకు నిజమైన న్యాయం జరిగి ఉండేదనీ మంజులకు ఎన్నోసార్లు అనిపించేది. అందుకే తన ఊరివాళ్లకు ఒక లాయర్ అవసరం ఉందనీ, ఆ లాయర్ తానే అవ్వాలనీ కోరుకునేవారు. ఆ ఆలోచనతోనే ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఎల్ఎల్బీ చదివి, గోల్డ్ మెడల్ సాధించారు. ఇక, తన కలను నిజం చేసుకోవాలని అత్తగారి ఊరు ఖిలా షాపూర్ తిరిగి వచ్చారు. తన సొంతూరూ, ఇదీ దగ్గరలోనే ఉండేవి. జనగామ కోర్టులో న్యాయవాదిగా కొత్త జీవితం మొదలుపెట్టారు. తమ గ్రామాల వాళ్లకు న్యాయ సలహాలిస్తూ, అవసరం ఉన్న కేసులను కోర్టులకు తీసుకెళ్లి తన వాదన వినిపిస్తూ… తాను కోరుకున్న వృత్తిని ఆస్వాదించసాగారు.
ఆస్తులమ్మినా లక్ష్యం వీడలేదు…
అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కానే కాదన్న సంగతి మంజులకు అప్పుడే అర్థమైంది. న్యాయవాద వృత్తిలో కుదురుకుంటున్న సమయంలోనే భర్త పక్షవాతం బారినపడ్డారు. ఆ స్ట్రోక్ ఆయనను దాదాపు కోమాలోకి తీసుకెళ్లింది. భర్త వైద్యం కోసం మంజుల మళ్లీ హైదరాబాద్ చేరారు. ఒక్క ఇల్లు తప్ప ఉన్న ఆస్తులన్నీ వైద్య ఖర్చుల కోసం అమ్మేశారు. చికిత్స తర్వాత భర్తతో కలిసి పుట్టింటికి చేరారు. ఆయన్ను నిరంతరం కంటికి రెప్పలా చూసుకోవాల్సి రావడంతో ఆమె తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. చాలా రోజులు అలాగే గడిచిపోయాక, ఇంటినుంచే పేదలూ, పల్లెటూరి వాళ్లకు సాయం చేయాలన్న ఆలోచన కలిగింది. ఒక యూట్యూబ్ చానెల్ ప్రారంభించమని తమ్ముళ్లు ప్రోత్సహించడంతో ‘మను లీగల్ ట్యుటోరియల్’ పేరిట చానెల్ ప్రారంభించారు. న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే రకరకాల విషయాల గురించి అవగాహన కలిగించడం మొదలుపెట్టారు. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల్లోనే వేల మంది సబ్‌స్ర్కైబర్లు అయ్యారు. ఎంతోమంది ఫోన్లు చేసి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కార మార్గాలు
తెలుసుకునేవారు.
ఆ బాధలోనూ పరీక్షకు…
న్యాయ విషయాల్లో ఆమెకు ఉన్న పట్టు చూసిన కుటుంబసభ్యులు జడ్జిగా ఎందుకు ప్రయత్నించకూడదు… అన్నారు. దాంతో ఆమె ఇంట్లో భర్తను చూసుకుంటూనే జడ్జి పరీక్షలకు చదవడం ప్రారంభించారు. తీరా రేపు పరీక్ష అనగా భర్తకు మళ్లీ స్ట్రోక్ వచ్చింది. అంత బాధలోనూ పరీక్షకు హాజరయ్యారు. అలా ఒకటీ రెండూ కాదు… మొత్తం అయిదుసార్లు జడ్జి పరీక్షలకు సొంతంగా చదువుకుని హాజరయ్యారు. చివరికి మంజుల పట్టుదల ముందు విజయం మోకరిల్లింది. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.
‘మా నాన్న ఆటోడ్రైవర్. నేను ఇంటర్మీడియెట్ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. టీచర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఇంగ్లిష్ భాష మీద పట్టు సాధించా. ఇప్పటికీ నేనేం అద్భుతంగా ఆంగ్లంలో మాట్లాడలేను. భాష కన్నా మనకు విషయ పరిజ్ఞానం ఎంతో ముఖ్యం. అందుకే ఆడపిల్లలమనీ, డబ్బు లేదనీ, పల్లెటూళ్లో చదువుకున్నామనీ ఏ ఒక్కరూ వెనకడుగు వేయవద్దు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సరే, మీ లక్ష్యం మీ శ్వాసగా ముందుకు వెళ్లండి. తప్పక విజయాన్ని అందుకుంటారు’ అని చెబుతారు మంజుల. మన తెలంగాణ మట్టి బిడ్డ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ… ఆమెకు ఆల్ ది బెస్ట్
చెబుదామా మరి!