ఇతిహాసాలు, పురాణాలు అంటే ఏమిటో తెలియని జెన్‌జీ తరమిది. అందుకే అంతరించిపోతున్న ఆ కథలను కొత్తగా పరిచయం చేయాలనుకున్నది ఈ మహిళ. తల్లిగా తన కొడుకులకు కథలు చెబుతూ పెంచిన ఆమె.. ఈ తరం పిల్లల కోసం వాటిని ఆడియో రూపంలోకి తీసుకొచ్చింది. లండన్‌లో స్థిరపడ్డా.. ప్రతి దీపావళికి తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహిస్తూ రామాయణాన్ని కండ్లముందు ఆవిష్కృతం చేస్తున్నది నీలిమ పెనుమర్తి. కథంటే కచ్చితంగా గంటపాటు ఉండాల్సిందే అని ‘స్టోరీహవర్ గ్లోబల్’ను ఏర్పాటు చేసి పిల్లలకు ఆడియో కథలు వినిపిస్తున్న నీలిమ ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు.. ఆమె మాటల్లోనే..
నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. మా అమ్మ టీచర్. నాన్న ఐడీపీఎల్‌లో ఉద్యోగి. డిగ్రీ వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. 1994లో పెళ్లి చేసుకున్నాక లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో ఎంఎస్ (కెమెస్ట్రీ) చేయడానికి సాలర్షిప్ వచ్చింది. మా వారు కూడా సాలర్షిప్తోనే లండన్ బాట పట్టడంతో 1996 నుంచి అక్కడే స్థిరపడ్డాం. చదువు పూర్తయిన తరువాత నేను కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. చిన్నబ్బాయి పుట్టాక ఉద్యోగానికి రాజీనామా చేసి తల్లిగా ఇద్దరు కొడుకుల బాధ్యతను తీసుకున్నాను. నన్ను మా ఇంట్లో ఎలా పెంచారో నా బిడ్డలిద్దరిని కూడా అలానే పెంచాలనుకున్నాను. అందుకోసమే వారికి నీతి కథలను నూరిపోశాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లి రావడం మూలంగా మన సంస్కృతి, సంప్రదాయాల మీద వాళ్లకు అవగాహన కలిగింది. రామాయణ, భారతం కూడా చదివారు.

కథలు చదువుతున్న సందర్భంలో నా ఇద్దరు కొడుకులు అందులోని పాత్రలను పంచుకొని సంభాషించడం నాకు ఎంతగానో నచ్చేది. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా రామాయణం ఇతివృత్తంగా ఓ స్టోరీ బోర్డ్ చేశాడు. చాలా బాగా వచ్చింది. తర్వాత సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్ రాయమని చెప్పాను. దాన్ని మూడేళ్లలో పూర్తిచేశారు. నా చిన్నతనంలో కథలు వింటూ పెరిగాను. ఇప్పటి తరానికి కథలు చదివించడం కంటే వినిపిస్తేనే వారు ఆ కథలను అర్థం చేసుకుంటారని అనిపించింది. ఈ క్రమంలో మా అబ్బాయిలు రాసిన రామాయణాన్ని ఆడియో రూపంలోకి మార్చాలనుకున్నాను.
దానిని వాళ్లతోనే రికార్డు చేయించి వెబ్సైట్లో పొందుపరిచాను. ఇది రామ జననం నుంచి రామరావణ యుద్ధం తర్వాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు రావడం, దీపావళి వేడుక చేసుకోవడం వరకు సాగుతుంది. దాన్ని ఇతర భాషల్లోకూడా వినిపించాలనే కుతూహలంతోనే హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, బేగంపేటలోని అంధ విద్యార్థుల పాఠశాల పిల్లలతో తెలుగు, హిందీ భాషల్లో ఆడియో రికార్డింగ్ చేయించాను. ఈ మధ్యకాలంలోనే ఇంద్రజిత్ చాప్టర్‌ను కలిపాను.

మాల్గుడి డేస్ వీడియోలకు సిగ్నేచర్ ట్యూన్ ఉన్నట్లే.. మా ఆడియో బుక్స్‌కి కూడా ట్యూన్ ఉంటే బాగుంటుందని భావించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికి రాయమని చెప్పాను. తాను రామాయణం కథను ఒక వాక్యంలో ‘వారధి నిర్మాణం.. సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబం’ అనే భావంతో రాసింది. భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ఎవీ సిమన్స్ అనే మరో అమ్మాయి ‘లైట్ ద ల్యాంప్స్’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని వివరించింది. వాళ్లు ఆ స్థాయిలో ఆలోచిస్తారని అస్సలు ఊహించనేలేదు. మా పిల్లలతోపాటు యూకేలోని భారతీయ మూలాలు ఉన్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో మరో ప్రాజెక్టు చేపట్టాను.
2021లో మా చిన్నబ్బాయి ఆయూర్, తన ఫ్రెండ్ ఆరూష్‌తో కలిసి ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద మొఘల్స్ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్ రికార్డు చేయించాను. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించే వరకూ సాగుతుంది. దీని గురించి శశి థరూర్ ప్రస్తావించడం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. గంటపాటు ఉండే ఈ ఆడియో కథను ఢిల్లీలో తెలిసిన టీచర్‌తో హిందీలోకి అనువదించాను. ఖతార్ ఏయిర్‌వేస్, బ్రిటిష్ ఏయిర్‌వేస్ రెండేళ్లపాటు ఈ ఆడియోలను ప్లే చేయడం విశేషం.
కథలపై నాకున్న ఇష్టంతో కరోనా సమయంలో మా ఇంట్లోవాళ్లతోనే కథలు రాయించాను. మా ఇంట్లో సామెతలు ఎక్కువ వాడుతుంటారు. మన సామెతలను పరిచయం చేయడానికి ‘తాతమ్మ కథలు’ పేరుతో మా అమ్మ, అత్త, మామగారితో ఒకో సామెతకు ఒకో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్ చేసి రికార్డ్ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో రూపంలో పొందుపరిచాను. ఆడియో కథలను మరింత దగ్గర చేసేందుకు నాకు కనిపించిన మార్గమే తోలుబొమ్మలాట. లండన్‌లో దీనికి ఆదరణ ఎక్కువ. తోలుబొమ్మలు ఆడించే టీంతో మాట్లాడి ఏటా దీపావళికి విద్యాసంస్థలు, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్లు, కేర్ హోమ్స్‌లలో ప్రదర్శనలు నిర్వహిస్తుంటాను. ఇప్పటివరకు సుమారుగా 80కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం.
నా ఆడియో కథలు సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘https://storyhour.co.uk/’ వెబ్సైట్లో వినొచ్చు. భాష బాగుంటేనే మన ఆలోచనలు బాగుంటాయని నా అభ్రిపాయం. సైన్స్ సబ్జెక్ట్‌ని కూడా ఈ క్రియేటివ్ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష. ప్రస్తుతం
ఆ ప్రాజెక్ట్ పనిలోనే ఉన్నాను. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఈ తరహా కథలను దగ్గర చేసేందుకు మా ‘స్టోరీహవర్గ్లోబల్’ కృషి చేయనుంది.
అమ్మానాన్నలతో ఆడుకోవాలని, కథలు చెప్పించుకోవాలని చిన్నపిల్లలకు ఉండే అతిముఖ్యమైన కోరిక. కానీ, నేడు ఉద్యోగ జీవితంలో అది సాధ్యపడటం లేదు. అలాంటి పిల్లల కోసం కథలకు ఆడియో బుక్ రూపమిచ్చాను. వాటిని ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంచాను. పిల్లలకే కాకుండా నీతి కథలు ఇప్పుడున్న పెద్దవారికి కూడా అవసరమే. చాలామంది బాగున్నాయంటూ మెసేజ్‌లు చేస్తుంటారు. ప్రతీ పాఠశాలలో సబ్జెక్టులతో పాటు ఓ గంటపాటు కథలు చెబితే ఎంత బాగుంటుందో కదా!
– రాజు పిల్లనగోయిన