ఒకప్పుడు ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా మాత్రమే కాదు.. అపురూప శిల్పకళకు చిరునామాలుగా నిలిచాయి. అద్భుత వాస్తుకళను కళ్లముందుంచాయి. సంగీత నృత్య కళలకు ఆలవాలమై అలరించాయి. కానీ, కాలక్రమంలో ఎన్నో గుళ్లు ప్రాభవాన్ని కోల్పోయి నిరాదరణకు గురయ్యాయి. ఈ పరిస్థితిలో మార్పు కోరుతూ, ఆలయాల పునరుజ్జీవానికి చేస్తున్న ప్రయత్నమే ‘గుడి సంబురాలు’. భారతీయ ఆధ్యాత్మిక గరిమ భావి తరాలకు ‘పరంపర’గా అందించాలనే కృత నిశ్చయంతో ఇద్దరు నారీమణులు చేపట్టిన ఆధ్యాత్మిక కళాయాత్ర విశేషాలు ఇవి..
శ్రీనాగి సికింద్రాబాద్‌లో పెరిగింది. సెయింట్ ఆన్స్ స్కూల్లో చదివింది. శశికళా రెడ్డిది నిజామాబాద్. అక్కడ హైస్కూల్ చదువు పూర్తి చేసి, హైదరాబాద్ వచ్చింది. రెడ్డి ఉమెన్స్ కాలేజ్‌లో చేరింది. శ్రీనాగి హైస్కూల్ క్లాస్మేట్ ఒకరు అదే కాలేజ్‌లో చేరారు. ఆమె ద్వారా శ్రీనాగికి పరిచయమైంది శశికళ. వీళ్లిద్దరికీ ఆలయాలు, ఆధ్యాత్మిక విశేషాలు, సంగీతం చాలా ఇష్టం. శ్రీనాగి చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకుంది. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో వైద్య విద్య పూర్తిచేసింది. వైద్యురాలిగా పనిచేసింది. మెడ్విన్ హాస్పిటల్‌కి డైరెక్టర్‌గా, సీఈఓగా సేవలు అందించింది. వైద్యవృత్తిలో ఎంత బిజీగా ఉన్నా ఆధ్యాత్మిక యాత్రలకు కచ్చితంగా సమయం కేటాయించేది. దాదాపు దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలూ సందర్శించిందామె. కథక్ నృత్యం కూడా నేర్చుకుంది. హిందుస్థానీ గాత్ర సంగీతాన్ని సాధన చేసింది. శశికళా రెడ్డి విషయానికి వస్తే.. రోష్ని అనే సంస్థను స్థాపించింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సాయపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి చూపేది. ఈ అభిరుచులే వాళ్ల మధ్య స్నేహాన్ని పెంచాయి.
హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ సంగీత, నృత్య వేడుకలు జరుగుతూనే ఉంటాయి. వీటిలో భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలు వెలవెలబోతూ ఉండటం గనించారు శ్రీనాగి, శశికళ. అదే సమయంలో యువత పాశ్చాత్య సంగీత, నృత్య కార్యక్రమాలకే మొగ్గు చూపడమూ కనిపించింది. మన సంగీత, నృత్య రీతులకు ఆదరణ లేనట్టే ఆలయాలకూ ఆదరణ లేదని భావించారు. ఒకప్పుడు సంగీత, నృత్య వేడుకలకు వేదికలుగా వెలిగిన ఆలయాలను చీకట్లు ముసురుకున్నాయి. మన గుళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఆలయాల్లో మూగబోయిన సంగీత కచేరీలకు పెద్దపీట వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆలయ మంటపాల్లో అందెల సవ్వడి మార్మోగాలని నిశ్చయించుకున్నారు. ఆలయం, ఆధ్యాత్మికం, సంగీతం, నృత్యం, వేడుక.. ఇవే లక్ష్యాలుగా దశాబ్దం కిందట ‘పరంపర’ అనే సంస్థను స్థాపించారు. మృగ్యమైపోతున్న సంప్రదాయ కళలకు ఊతమిచ్చేలా, ఆలయాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా, శాస్త్రీయ కళాకారులను ప్రోత్సహించేలా ఆలయాల్లో సంబురాలకు శ్రీకారం చుట్టారు శ్రీనాగి, శశి.
హైదరాబాద్‌కి సమీపంలో అమ్మపల్లి అనే ఊరు ఉంది. అక్కడ ఎనిమిది వందల సంవత్సరాల నాటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది. అద్భుతమైన శిల్పకళకు ఆలవాలంగా ఉన్న ఆ పురాతన ఆలయం సందర్శకులు లేక వెలవెలబోయేది. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో పదేండ్ల కిందట అమ్మపల్లి కోవెలలో ‘గుడి సంబురాలు’ నిర్వహించారు. జిగేల్మనే వెలుగులో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఆ వేడుక చూడటానికి అమ్మపల్లివాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ తండోపతండాలుగా వచ్చారు. ఆహూతులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. ఆలయ వైభవాన్ని చాటుతూ, ఆధ్యాత్మిక విశేషాలను చెబుతూ ఆ రోజు జరిగిన గుడి సంబురాలు విజయవంతం అయ్యాయి. ఈ వేడుక తర్వాత ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. ఆలయాన్ని అధికారులూ పట్టించుకున్నారు. కొత్త నిర్మాణాలకు విరాళాలు అందించారు. ఆలయానికి ప్రాచుర్యం రావడంతో భక్తుల రాక కూడా పెరిగింది.
ఆలయ ప్రాంగణంలో ఫొటో షూట్లే కాదు, సినిమా షూటింగులూ జరుగుతున్నాయి. వెరసి ఆలయ భవిష్యత్తు ఏంటన్న బెంగ తీరిపోయింది. దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావికి జీవకళ వచ్చింది. ప్రాంగణంలో కాటేజీలు వెలిశాయి. ఆ మొదటి విజయంతో మరిన్ని ఆలయాల్లోనూ ‘గుడి సంబురాలు’ నిర్వహించాలని తలపోశారు ఈ ఇద్దరు స్నేహితులు. కాలపరీక్షను ఎదుర్కొంటున్న గుళ్లను వెలుగులోకి తీసుకురావడంతోపాటు మన సంప్రదాయ కళలకు పట్టం కట్టాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. వారసత్వ కట్టడాలు, మెట్ల బావులు, బీచ్‌లలో ఆధ్యాత్మిక, సంగీత, నృత్య ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. పదేళ్ల నుంచి ఆ ‘పరంపర’ కొనసాగుతూనే ఉంది.
ప్రకృతి రమణీయత ఉన్న చోట మానసిక ఆనందం కోసం వచ్చేవారికి సంగీతంతో సాంత్వన చేకూర్చేందుకూ కచేరీలు చేపడుతున్నది పరంపర. హైదరాబాద్ నగరంలోని కృష్ణకాంత్ పార్క్, ఇందిరా పార్క్, బొటానికల్ గార్డెన్, సుందరయ్య పార్కుల్లో వీటిని నిర్వహిస్తున్నారు. శాస్త్రీయ సంగీత కచేరీలు సంపన్నుల కాలక్షేప వేదికలు అన్న ముద్రను చెరిపేసి.. సామాన్యులకు చేరువ చేసిందీ సంస్థ.
పరంపర ఆహ్వానం అందుకుని భరతనాట్య కళాకారిణి రమా వైద్యనాథన్ ఢిల్లీ నుంచి వచ్చి కరీంనగర్ ఎలగందుల కోటలో ప్రదర్శన ఇచ్చింది. వరంగల్ వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోటలోనూ సంబురాలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఒడిస్సీ కళాకారిణి బిజయాని సత్పతితో హైదరాబాద్, నిజామాబాద్, పొన్నూరు, విజయవాడల్లో ప్రదర్శనలు ఇప్పించారు. ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనల ద్వారా.. నిరాదరణకు గురవుతున్న వారసత్వ కట్టడాలపైకి ప్రజల దృష్టి మళ్లించగలిగారు శ్రీనాగి, శశి. ‘మా జిల్లాలో గుడి సంబురాలు జరపాల’ని కలెక్టర్లు, ఉన్నతాధికారులే ఆహ్వానించే స్థాయికి ‘పరంపర’ గుర్తింపు పొందింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లు ఆలయ సంబురాల కోసం ఆహ్వానం పలికారు. గుడి సంబురాలకు ప్రభుత్వ తోడ్పాటు కూడా తోడవ్వడంతో ఆధ్యాత్మిక, సంగీత, నృత్య ప్రచారానికి మరింత ఆదరణ పెరిగింది. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాద్రి క్షేత్రంలోనూ గుడి సంబురాలు చేపట్టాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ నుంచి ఆహ్వానం అందుకున్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు రాములోరి సన్నిధిలో, ఉత్తుంగ గోదావరి తరంగాల సాక్షిగా జరిగిన ‘గుడి సంబురాలు’ చూసి భక్తులు తన్మయులయ్యారు. ఆనాటి ప్రదర్శన గురించి.. ‘ఇన్నేళ్ల వైకుంఠ ఏకాదశి వేడుకలలో ఇంత మంచి రోజు ముందెన్నడూ లేద’ని ఒక భక్తుడు ఆ జిల్లా కలెక్టర్‌కి లేఖ రాశాడంటే.. ‘పరంపర’ ఎంతటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. రామప్ప ఆలయంలో ‘పరంపర’ నేతృత్వంలో ప్రముఖ నృత్యకారులు నిర్వహించిన ప్రదర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కావడం విశేషం. ‘ఆలయాల ప్రాచుర్యానికి, సంగీత, నృత్య కళల పరిరక్షణకు గుడి సంబురాల ఆలోచన అభినందనీయమ’ని రాష్ట్రపతి ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది అంటారు శ్రీనాగి, శశి. పెద్ద ఆలయాల్లో మాత్రమే కాదు, చారిత్రక విశిష్టత ఉన్న చిన్న గుళ్లలోనూ ‘గుడి సంబురాలు’ నిర్వహిస్తున్నారు.
‘పరంపర’ నిర్వహించే గుడి సంబురాలు, సంగీత కచేరీలు పదేండ్లుగా కొనసాగుతున్నాయి. ఈ సంస్థలో ఉద్యోగులు ఇద్దరే. వాళ్లే వ్యవస్థాపకులైన శ్రీనాగి, శశికళా రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, కళాకారులతో ప్రదర్శన నిర్వహణ వరకు వాళ్లే అన్ని పనులూ చక్కదిద్దుకుంటున్నారు. దాతలు ఇచ్చిన విరాళాలను కళాకారులు, సౌండ్, లైటింగ్ నిపుణులకు చెల్లిస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పదేండ్లుగా తమ కాలాన్ని కళలకు, ఆలయాల అభివృద్ధికి అంకితం చేసిన ఈ మిత్రద్వయం ‘పరంపర’ నిరంతరం ఇలాగే కొనసాగాలని మనమూ ఆశిద్దాం!
– నాగవర్ధన్ రాయల