ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే కాదు, ఆ క్రీడాంగణంలో అడుగుపెట్టడం కూడా సాహసమే! ఈ మైదానంలో సత్తా చాటింది జర్నలిస్ట్ గీతికా తాలుక్దార్. క్రీడాకారిణిగా కాదు.. కెమెరా ఉమెన్‌గా! అప్పటి నుంచి ఆమె సెలెబ్రిటీగా మారిపోయారు! ఒలింపిక్స్ న్యూస్ కవరేజ్ కోసం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన ఏకైక భారతీయ మహిళా స్పోర్ట్స్ ఫొటో జర్నలిస్ట్ ఆమె. గతంలో జపాన్ ఒలింపిక్ క్రీడల్లో ఈ ఘనత సాధించింది. మళ్లీ పారిస్ ఒలింపిక్స్‌లో క్లిక్‌మనిపిస్తూ తన రికార్డుని తానే అధిగమించి విజయ గీతిక అనిపించుకుంది!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత దేశం పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఎక్కడో చివరన నిలిచింది. మనుబాకర్, నీరజ్ చోప్రా, అమన్ సెహ్రావత్ విజయాలు ఊరటనిచ్చేవే! అలాంటిదే మరో విజయం భారతదేశానికి దక్కింది. ప్రపంచమూ ఆ విజయంవైపు చూసింది. కానీ, భారతదేశమే పెద్దగా పట్టించుకోలేదు. పతకాలు గెలిచిన క్షణాలు చేజారిపోకుండా చేసిన విజయం ఆమెది. ఆ విజేత పేరు గీతికా తాలుక్దార్.
అస్సాంలోని తిన్సుకియా జిల్లా, డూమ్డూమా పట్టణం ఆమె స్వస్థలం. అక్కడి కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేసింది గీతిక. తర్వాత గువాహటిలో ఉన్నత విద్య అభ్యసించింది. పాటలు బాగాపాడేది. సాంస్కృతిక పోటీల్లో అందరికంటే ముందుండేది. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత పాత్రికేయ వృత్తిని ఎంచుకుంది. పదిహేనేండ్లపాటు వివిధ పత్రికలు, ప్రచురణ సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేసింది.
జర్నలిస్ట్ జీవితం సంతృప్తికరంగా ఉన్నా ఇంకా ఏదో చేయాలనే తపనతో ఉండేది గీతిక. తన ఆసక్తికి తగినట్టుగా దక్షిణ కొరియాలోని ‘సియోల్ నేషనల్ యూనివర్సిటీ’లో ప్రతిష్ఠాత్మకమైన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలనుకుంది. 2020లో ఆ కోర్సుకు దరఖాస్తు చేసింది. ఆ దేశ క్రీడాశాఖ నుంచి స్కాలర్షిప్ అందుకుంది. ఈ ఆర్థిక సాయంతో చదువు పూర్తి చేసింది. మాస్టర్స్ అయిన వెంటనే ఆమెకు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.
కొవిడ్ ప్రకంపనల మధ్యే ఆనాటి పోటీలు జరిగాయి. అలాంటి భయానక సమయంలోనూ ఒలింపిక్స్ విశేషాలను ప్రపంచానికి చాటడానికి భారీ కెమెరాను చేతుల్లోకి తీసుకుంది గీతిక. టోక్యో ఒలింపిక్స్‌లో ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేసింది. విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపిన వృత్తి ధర్మానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. మరెన్నో ప్రపంచ స్థాయి క్రీడా వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానాలు అందాయి. పదిహేనేండ్ల పాత్రికేయ వృత్తిలో ఎందరో జర్నలిస్టులకు దక్కని అవకాశాలు, విజయాలు ఆమెను వరించాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024 వార్తా విశేషాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నలిస్టులను ఎంపిక చేసింది. క్రీడా వేడుకల్లో పనిచేసిన అనుభవం, ప్రతిభ ఆధారంగా వారికి ఆహ్వానం పలుకుతుంది. టోక్యోలో ప్రతిభ కనబరచిన గీతికకు పారిస్ నుంచి పిలుపు అందింది. ఆటల్లో వెనక్కి నెట్టినట్టే స్పోర్ట్స్ జర్నలిజం, ఫొటో జర్నలిజంలోనూ ఆడవాళ్లను వెనక్కి నెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆమె పట్టుదల ముందు అవన్నీ తోకముడిచాయి.
‘స్పోర్ట్స్ జర్నలిజం ఆడవాళ్లకు సవాళ్లతో కూడుకున్న పని. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండాలి. క్రీడల షెడ్యూల్ ప్రకారం రాత్రీపగలూ పనిచేయాల్సి వస్తుంది. గంటలపాటు నిలబడాలి. పరిగెత్తుతూనే ఉండాలి. వీటిని నేను కష్టంగా భావించను. కెమెరా అందుకోగానే.. నా లెన్స్ మంచి చిత్రం కోసం 360 డిగ్రీలూ కలయజూస్తాయి. ఈ కెరీర్లో పురుషాధి క్యత అంటారా! దాన్ని నేనెప్పుడూ లక్ష్య పెట్టలేదు’ అని చెబుతుంది గీతిక.
టోక్యో ఒలింపిక్స్ 2020 వేడుకల తర్వాత పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు ఆమె ఎన్నో అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాలుపంచుకుంది! ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేసింది. ఫిఫా వరల్డ్ కప్- కతార్, ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్-ఫ్రాన్స్, ఫిఫా వరల్డ్ కప్- రష్యా, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియా గేమ్స్.. ఇలా ఎన్నో అంతర్జాతీయ క్రీడా సంబురాలను ఆసక్తిగా కవర్ చేసింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో అదిరిపోయే చిత్తరువులు తీసి శభాష్ అనిపించుకుంది. ఒలింపిక్స్‌ని కవర్ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా స్పోర్ట్స్ ఫొటో జర్నలిస్ట్‌గా క్రీడా చరిత్రలోనే కాదు పాత్రికేయ చరిత్రలోనూ ఆమె పేరు నిలిచిపోతుంది.