ఈ కల్తీ దునియాలో.. పసి పిల్లలకు ఏం తినిపించాలన్నా భయంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పోషకాల గురించి ఆలోచించడం అత్యాశే అవుతుంది. ఆ దంపతులకూ ఇదే సమస్య వచ్చింది. తమ పిల్లలకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందించాలని భావించారు. ఉద్యోగాలు వదిలి తృణధాన్యాలతో పోషకాహార ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు. తమ ప్రయాణంలో మహిళా రైతులను భాగస్వామ్యం చేసి.. వాళ్లు పండించిన ధాన్యంతో పిల్లలకు, పెద్దలకు పోషకాహార ఉత్పత్తులు అందిస్తున్న మాధవి, సీతారాం విజయ ప్రస్థానం ఇది. తాజాగా యూఎన్ నిర్వహిస్తున్న సఫల్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఖాద్యం స్పెషాలిటీ ఫుడ్స్ ఫౌండర్ మాధవిని జిందగీ పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
నేను పుట్టింది సూర్యాపేటలో. మా నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. నా చదువంతా ఇక్కడే సాగింది. డిగ్రీ పూర్తి కాగానే 2005లో సీతారాంతో నా వివాహమైంది. ఆయన హిమాలయ సంస్థలో సౌత్ ఇండియా మేనేజర్‌గా పనిచేసేవారు. దాంతో పెండ్లి తర్వాత కర్నూల్లో కాపురం ఉన్నాం. నేను ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో భాగంగా ఆయన తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవారు. పిల్లలు కలిగిన తర్వాత తీరిక లేకుండా మారిపోయింది.
బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడంలోనే నా రోజంతా గడిచిపోయేది. వారికి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని ఆలోచించేదాన్ని. పోషకాలతో కూడిన ఆహారం కోసం వెతుకుతున్న నాకు తృణధాన్యాల ఉపయోగాల గురించి తెలిసింది. ఆరోగ్యాన్ని పంచే తృణధాన్యాల ఉత్పత్తులను నా పిల్లలతో పాటు అందరు చిన్నారులకూ అందించాలనుకున్నాను. ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని భావించాను. నా ఆలోచన మావారితో పంచుకుంటే ఆయన కూడా మద్దతుగా నిలిచారు. 2008లో ఇద్దరం ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చి, కొత్త ప్రయాణం మొదలుపెట్టాం.

మా ఇద్దరికీ వ్యవసాయంలో అనుభవం లేదు. అయినా తృణధాన్యాల గురించి లోతుగా పరిశోధన చేశాం. రైతులతో పండించి పంటను మేమే కొని ప్రాసెసింగ్ చేయాలన్నది మా ఆలోచన. అందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వికారాబాద్ ప్రాంతంలోని రైతుల దగ్గరికి వెళ్లి మా ఆలోచనలు పంచుకున్నాం. అప్పటికే పత్తి, వరి పంటలు సాగుచేస్తున్న వాళ్లంతా తృణధాన్యాల సాగుకు ఆసక్తి చూపించలేదు. కొందరు మేం వేయలేమని ముఖం మీదే చెప్పేశారు. కొందరు పట్టించుకోలేదు. మరికొందరు సరే అన్నారు కానీ, ఆచరణలో పెట్టలేకపోయారు.
అయినా మేం వెనక్కి తగ్గలేదు. ఒక్కో దశ దాటుతూ.. 2014లో రెండు ఎకరాల లోపు పొలం ఉన్న మహిళా రైతులతో తృణ ధాన్యాలు సాగు చేయించాలని భావించాం. తొలి ప్రయత్నంగా ఒకేసారి 15 మంది మహిళా రైతులతో తృణధాన్యాలు సాగు చేయించాం. పత్తి పంట మధ్యలో తృణధాన్యాలు వేయించాం. కావాల్సిన విత్తనాలు మేమే ఇచ్చాం. పంటకు కావాల్సిన మందులు సబ్సిడీ రూపంలో అందించాం. పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు మేమే కొనుగోలు చేశాం. మంచి పంట దక్కిందన్న తృప్తి మాకు, మంచి ధర పలికిందన్న సంతోషం రైతులకూ కలిగింది. మొదట్లో ఏడాదికి ఒకే పంట తీసిన ఆ మహిళా రైతులు.. ఇప్పుడు రెండు, మూడు పంటలు తీస్తున్నారు.
ఒక యూనిట్ నెలకొల్పి 2018 వరకు చిన్నమొత్తంలో ప్రాసెసింగ్ చేశాం. తర్వాత ఖాద్యం స్పెషాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించాం. మొదట్లో వాటిని అమ్మేందుకు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. హైబ్రిడ్ తిండికి అలవాటు పడిన జనాలు తృణధాన్యాలు అంటే వింతగా చూశారు. మా దగ్గర కొన్నవాళ్లు మళ్లీ కావాలంటూ రాలేదు. దాంతో నిరాశకు గురై అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేశాం. తృణధాన్యాలు వండుకోవాలంటే వాటిని రాత్రంతా నానబెట్టాలి.
ఆ శ్రమ పడలేమని చాలామంది చెప్పారు. ఈ సమస్యను అధిగమించేలా, మా ఉత్పత్తులు నేరుగా వండుకునేలా రెడీ టూ కుక్ రూపంలో తీసుకొచ్చాం. దోశల పిండి, కిచిడీ, రొట్టెల పిండి ఇలా రకరకాల రెడీ టూ కుక్ ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చాం. అలా పిల్లలకు పోషకాలు అందించేందుకు మొదలు పెట్టిన ఖాద్యం ఫుడ్‌ను పెద్దలు కూడా ఆదరించడంతో మొదటి ఏడాది రూ.40 లక్షల వరకు టర్నోవర్ సాధించగలిగాం. 2020 నాటికి రూ.కోటికి చేరుకున్నాం.

మా వ్యాపారం పుంజుకుంటున్న రోజుల్లో కరోనా కలకలం మొదలైంది. మా ఉత్పత్తుల కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. మావారికి కరోనా సోకింది. మొత్తంగా కరోనా నాలుగు కోట్ల నష్టం మిగిల్చింది. చాలామంది బిజినెస్ మానుకోమని సలహా ఇచ్చారు. దేవుడి దయతో ఆయన కోలుకున్నారు. మార్కెట్లో నిలబడిన తర్వాత గెలిచి తీరాలని ఆయన, మా కుటుంబసభ్యులు ధైర్యమిచ్చారు. అప్పటి వరకు పిండి రూపంలో అందించిన పదార్థాలకు రెడీ టూ ఈట్ (ఆర్టీఈ)గా అందివ్వడం మొదలుపెట్టాం. మిల్లెట్ పాస్తా తీసుకొచ్చాం. ఇందులో వేడినీళ్లు పోసుకుంటే సరి.. తినేయొచ్చు. కొన్నాళ్లకే మా వ్యాపారం మళ్లీ పుంజుకుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలిగాం.
రక్షణ రంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి నేను అనుమతి సాధించాను. ఢిల్లీలో నిర్వహించిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లో సైతం ఖాద్యం రుచులను పరిచయం చేశా. ప్రస్తుతం మహిళా సాధికారతలో భాగంగా యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తున్న సఫల్ కార్యక్రమంలో భారత్, న్యూజిలాండ్, జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఇందులో భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలు ఎంపికయ్యారు. వారిలో నేనూ ఉన్నాను. పన్నెండు వారాలపాటు జరిగే ఈ వర్చువల్ సమావేశాలకు నాకు ఆహ్వానం అందడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు నాకు దొరికిన గొప్ప వరంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నా.
తృణధాన్యాలు చేతికొచ్చేవరకు రైతన్నలకు నిత్యం సూచనలిచ్చేందుకు మేం ఒప్పందం కుదుర్చుకున్న గ్రామాల్లో ఒకరిని గైడ్‌గా పెట్టాం. మొదట్లో నేను, ఆయన ఇద్దరం రైతులను కలిసేవాళ్లం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మా ఆయన తిరుగుతున్నారు. తృణధాన్యాల సాగులో సలహాలు, సూచనల కోసం 73375 77730 నెంబర్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం వికారాబాద్, అరకు, పాడేరు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు మొత్తంగా 1350 మంది మహిళా రైతులు సుమారు 4,000 హెక్టార్లలో తృణ ధాన్యాలు సాగు చేస్తున్నారు. మేడ్చల్‌లోని మా ప్రాసెసింగ్ యూనిట్లో 22 మంది మహిళలు పనిచేస్తున్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా మా ప్రయాణంలో వారిని భాగస్వాములం చేశాం.
– రాజు పిల్లనగోయిన
– కె.సాయిబాబా