చిన్నప్పుడు ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్’ అని ఆమెను ఎవరు అడిగినా తడుముకోకుండా ‘ఐపీఎస్ ఆఫీసర్ అవుతా’ అని చెప్పేది. ఆ ఆశకు, ఆశయానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డం నిలిచాయి. అయినా వెనకడుగు వేయలేదు. బడికి వెళ్లే రోజుల్లోనే ఎన్సీసీలో చేరి శారీరకంగా ఫిట్నెస్ సంపాదించింది. బీటెక్ చదివి సాంకేతికంగా రాటుదేలింది. బీటెక్ తర్వాత ఐటీ కొలువు వచ్చినా కాదనుకొని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఇప్పుడు తెలంగాణ గడ్డమీద కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. 1,211 మంది మహిళా కానిస్టేబుళ్ల పరేడ్‌కు తనే నాయకురాలైంది. తనే జనగామ బిడ్డ ఉప్పునూతల సౌమ్య. ఐపీఎస్ సాధించడమే తన లక్ష్యం అంటున్న సౌమ్య సక్సెస్ జర్నీ ఇది.
మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం, తిరుమలగిరి. నేను వరంగల్ కమిషనరేట్ నుంచి కానిస్టేబుల్‌కు సెలెక్ట్ అయ్యాను. అమ్మానాన్నలు అరుణ, మల్లయ్య వ్యవసాయం చేస్తారు. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ చేశాను. పోలీస్ కావాలన్నది నా చిన్ననాటి కల. అందులోనూ ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం. బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాను. రెండుమూడు సంస్థల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చినా.. తిరస్కరించాను. ఎలాగైనా పోలీసు కావాలని సీఐఎస్ఎఫ్ పోస్టుకు దరఖాస్తు చేశాను. సొంతంగా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా.. ఇంట్లోనే యూట్యూబ్‌లో క్లాసులు వింటూ, పాఠాలు రాసుకుంటూ, ఫిజికల్ ఈవెంట్స్ కోసం సిద్ధమయ్యాను. అలా మొదటి నోటిఫికేషన్లోనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాను.
నాన్న కోరిక..
ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశాను. అయితే నాన్న నాతో.. ‘తెలంగాణకు వచ్చి ఇక్కడే గట్టిగా ప్రయత్నం చేయ్’ అన్నారు. ఇంటి దగ్గర అమ్మానాన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి చేదోడు వాదోడుగా ఉందామనుకుంటున్న సమయంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్పడింది. ఆలస్యం చేయకుండా.. సీఐఎస్ఎఫ్ ఉద్యోగాన్ని వదులుకొని, కానిస్టేబుల్ పరీక్ష రాశాను. దీనికి కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో కష్టపడి చదుకున్నాను. ప్రిలిమ్స్ పాసైన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. క్రమం తప్పకుండా ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేశాను. చివరికి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఇక్కడ దాదాపు 9 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నా. శిక్షణలో బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్లలో ట్రోఫీలు వచ్చాయి. వీటితో పాటు 1,211 మంది ఉన్న మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించాను. అది నాకు చాలా గర్వంగా ఉంది. నాది బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి సైబర్ నేరాల తీరుపై అధ్యయనం చేశాను. వీటితో పాటు సెల్ఫ్ డిఫెన్స్‌లో కరాటే, యోగా, వెపన్ హ్యాండిలింగ్ లాంటివి నేర్చుకున్నాం. కొత్త క్రిమినల్ చట్టాల గురించి తెలుసుకున్నాం. ఇన్వెస్టిగేషన్, పర్సనల్ సెక్యూరిటీలో పట్టు సాధించాను. అందుకే బెస్ట్ ఇండోర్ ట్రోఫీ వచ్చింది. మరోమాట మా గ్రామంలో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయిని నేనే. అది నాకు గర్వకారణం.
అన్నయ్య అగ్రికల్చర్ డ్రోన్ ఆపరేటింగ్‌లో లీడ్పైలెట్గా ఉన్నారు. నాన్నకు ఐదు ఎకరాల పొలం ఉంది. అమ్మకు, నాన్నకు చదువంటే చాలా ఇష్టం. వాళ్ల కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువుకోలేకపోయారు. అందుకే నన్ను, అన్నయ్యను బాగా చదివించారు. మంచి సపోర్ట్ ఇచ్చేవారు. అమ్మాయి అని ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా.. ప్రతి విషయంలోనూ ప్రోత్సహించారు. నా స్కూలింగ్ జెడ్పీహెచ్ఎస్ గూడూరులో జరిగింది. నాకు చిన్నప్పట్నుంచి ఎన్సీసీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇంటర్ శివానీ జూనియర్ కాలేజీ, బీటెక్ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. ప్రస్తుతం గ్రూప్-1 కొట్టి డీఎస్పీ కావాలని, తర్వాత సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నేననుకున్న లక్ష్యాన్ని సాధిస్తానన్న నమ్మకం ఉంది.
నా బిడ్డ నచ్చిన ఉద్యోగాన్ని సాధించడమే కాదు, వెయ్యిమంది మహిళా కానిస్టేబుళ్లకు నాయకురాలై పరేడ్ నడిపించిడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్ నుంచి మా సౌమ్య ట్రోఫీ అందుకుంటుంటే.. మా ఆనందానికి అవధుల్లేవ్. పెద్దపెద్ద పోలీసు ఉన్నతాధికారులు మా బిడ్డను మధ్యలో ఉంచుకొని ఫొటోలు దిగుతుంటే పొంగిపోయాం. ఆమె కోసం మేం పడిన కష్టమంతా మర్చిపోయాం.
సౌమ్య తల్లిదండ్రులు