తన తల్లి అనారోగ్యం ఆమెకు ఓ గమ్యాన్ని చూపించింది. క్యాన్సర్ బారినపడిన తల్లి కోసం తల్లడిల్లిన ఆ కూతురు.. క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? అని అన్వేషిస్తూ ముందుకుసాగింది. ఎంతోమంది మహిళలు రసాయనాల కాస్మోటిక్స్‌కు బలైపోతున్నారని తెలుసుకొని ఆవేదన చెందింది. తనవంతుగా కొంతమందినైనా కాపాడాలని నడుం బిగించింది. ప్రకృతి సిద్ధమైన కాస్మోటిక్ ఉత్పత్తులు తయారు చేసి క్యాన్సర్‌పై తనవంతుగా పోరాడుతున్నది 26 ఏండ్ల భీసెట్టి అశ్విని.
పన్నెండు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె ప్రయాణం వీహబ్ ప్రోత్సాహంతో పరుగు అందుకుంది. నేడు లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్నది. చిన్నవయస్సులోనే ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగిన ‘సాయిల్ అండ్ సోల్’ వ్యవస్థాపకురాలుఅశ్విని జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే…
అమ్మ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటినుంచి ఆమెతో నాకు ప్రత్యేకమైన బంధం ఉండేది. ఆకలితో ఉండేవారికి పిడికెడు అన్నం పెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని అమ్మ తరచూ చెప్పే మాటల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నాకు వచ్చిన లాభాల్లో 9 శాతంతో నా చుట్టుపక్కల ఉండే నిరాశ్రయులకు అన్నదానం చేస్తుంటాను. క్యాన్సర్ రోగులు ఎవరైనా కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు తెలిస్తే వారికి తోచిన సహాయం చేస్తున్నాను. అమ్మ పేరుతో అనాథ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను.
మా ఇంట్లో నాన్న, అక్క ఆయుర్వేదిక్ వైద్యులు కావడం వల్ల ప్రకృతి మీద నాకు ఒకరకమైన ఇష్టం ఏర్పడింది. అందుకే చెట్టూపుట్టలను నా తోబుట్టువుల్లా భావించేదాన్ని. నేను చిన్నప్పటినుంచే థ్రెడ్ బ్యాంగిల్స్, మట్టి బొమ్మలు చేస్తూ మురిసిపోయేదాన్ని. ప్రతిరోజు ఏదో ఒక రకమైన బొమ్మను తయారు చేయడం వల్ల వాటిపైన మరింత ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తే నాకు డబ్బు సంపాదించే మార్గం కూడా చూపించింది. ఇంటర్ పరీక్షలు రాసి ఇంటిపట్టున ఉన్న సమయంలో నాకు ఇష్టమైన బొమ్మలు, గాజులు తయారు చేసి తెలిసిన వాళ్లకు విక్రయించాను.
అలా రెండు మూడు నెలల్లోనే రూ.20 వేల వరకు సంపాదించాను. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన నాకు మానవ శరీరం గురించి, వాటికొచ్చే రోగాల గురించి తెలుసుకోవడం ఆసక్తిగా అనిపించేది. ఆ కోర్సు చేస్తున్నప్పుడే మా అమ్మకు క్యాన్సర్ సోకింది. అమ్మకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అందులో భాగంగానే మహిళలకు ఎలాంటి కారణాల వల్ల క్యాన్సర్ వస్తుందని పరిశోధిస్తే కాస్మోటిక్ విషయం బయటపడింది. అనేక రకాల కెమికల్స్ కలిపిన కాస్మోటిక్‌లు వాడటం వల్ల చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థమైంది. ఏడాది పాటు చేసిన నా పరిశోధనలో అమ్మను కాపాడుకోలేకపోయాను కానీ, ఇలాంటి రోగాలను కట్టడి చేయాలని మాత్రం గట్టిగా అనుకున్నాను.

సామాన్య మహిళలు వాడే కాస్మోటిక్లలో ప్రధానమైంది సబ్బు. ఆ సబ్బు తయారీ నుంచే నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. 2020 ఏడాది చివర్లో ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు కొబ్బరినూనె, అతి మధురం లాంటి నేచురల్ ఉత్పత్తులతో కొన్ని సబ్బులను తయారు చేశాను. వాటిని నాకు అత్యంత ఆత్మీయులైన 20 మంది స్నేహితురాళ్లకు ఇచ్చాను. వాళ్లు దానిని వాడిన తర్వాత 20 రోజులకు నాతో తమ అభిప్రాయం పంచుకున్నారు. సబ్బు చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
దాంతో నేచురల్ కాస్మోటిక్స్ తయారు చేయాలనే నా ఉత్సాహం రెట్టింపు అయింది. అలా ఒక్కొక్కరికీ నేను తయారు చేసిన సబ్బులను ఇస్తూ వారినుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఆర్డర్లు కూడా పెరగడంతో నేను తయారు చేసే కంపెనీకి పేరు పెట్టుకున్నాను. అదే సాయిల్ అండ్ సోల్. నా ఉత్పత్తుల తయారీకి కావాల్సిన ప్రతీ ముడిసరుకు భూమినుంచే వస్తుందని, వాటిని మనసు పెట్టి తయారు చేయాలనే భావం వచ్చేలా ఈ పేరు పెట్టుకున్నా.

వంటను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఒకరు వంటలో వనస్పతి వేస్తే, మరొకరు నెయ్యి వేస్తారు. దేని రుచి దానిదే కదా. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించాలన్నది నా పాలసీ. అందుకే నా వస్తువులను నెయ్యితో పోల్చుతాను. ఒకవైపు కాస్మోటిక్ రంగంలో నెమ్మదిగా రాణిస్తున్న తరుణంలో ఫిజియోథెరపీ చేసినందుకు ఉద్యోగావకాశాలు కూడా రావడం మొదలు పెట్టాయి. వ్యాపారంలో దిగాలనే పట్టుదలతో ఉద్యోగాలు చేయొద్దని నిర్ణయించుకున్నా. ఇందుకోసం పుట్టి పెరిగిన వైజాగ్‌ను విడిచి, 2022లో హైదరాబాద్‌లో ఉండే మా అక్క దగ్గరికొచ్చాను.
హైదరాబాద్ కొత్త ప్రాంతం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని ఒకపూట ఫిజియోథెరపీ హోం సర్వీస్ అందిస్తూ, మరోపక్క కాస్మోటిక్స్ తయారీలో ఫార్మలేషన్లకోసం కొత్త కోర్సులు నేర్చుకున్నాను. అలా నెమ్మదిగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నా ఉత్పత్తులను కంపెనీలకు సరఫరా చేయడం ప్రారంభించాను. ఒకటి రెండు ఆర్డర్ల నుంచి బల్క్ ఆర్డర్లు రావడం మొదలైంది. అక్క ఆయుర్వేద వైద్యురాలే కావడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆర్డర్లుంటే వాళ్ల యూనిట్లో తయారు చేసేదాన్ని. తక్కువ ఉంటే నా స్టోర్‌లోనే తయారు చేసి ఇచ్చేదాన్ని.
మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాలంటారు. మనం తయారు చేసిన ప్రొడక్ట్‌ను అమ్మడానికి అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. అందుకోసమే 2025లో వీహబ్‌లో చేరాను. తెలియని విషయాలు ఎన్నో అక్కడ నేర్చుకున్నాను. అన్నిటికంటే ముందు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని నేర్పించారు. ప్రస్తుతం 12 కంపెనీలకు బల్క్‌గా కాస్మోటిక్స్‌ను సరఫరా చేస్తున్నాను. దాంతోపాటు రిటైల్లోనూ అందిస్తున్నాను. వీటి తయారీకి కావాల్సిన ముడి సరుకంతా కేరళ, కర్ణాటక, ఏపీ ప్రాంతాలనుంచే కొనుగోలు చేస్తున్నాను.
ప్రస్తుతం 60 రకాల స్కిన్‌కేర్, బాడీ కేర్ ఉత్పత్తులు తయారు చేస్తుండగా, వాటిలో కొన్నిటిని ఆయుష్ ధ్రువీకరించింది. ఐదేళ్ల క్రితం రూ.12000లతో ప్రారంభించిన ఈ బిజినెస్ ప్రస్తుతం మంచి టర్నోవర్ సాధిస్తున్నది. గతేడాది రూ.35 లక్షల టర్నోవర్ సాధించింది. లాభం కూడా గణనీయంగానే వచ్చింది. చేసే పనిలో సంతృప్తితో పాటు సమాజహితం ఉండాలనేదే నా సిద్ధాంతం. కనీసం కొంతమందినైనా ఈ కెమికల్ కాస్మోటిక్స్ నుంచి దూరంగా ఉంచాలని నా లక్ష్యంగా పెట్టుకున్నాను.
– రాజు పిల్లనగోయిన