భారతదేశం ఓ విభిన్న సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయాలు, వేషభాషలే కాదు రుచులూ చాలా ప్రత్యేకం. ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ఉపఖండంలో ఎక్కడి విస్తరి అక్కడ ప్రత్యేకమే. ఒక రాష్ట్రంలో ఉన్న రుచులు మరో రాష్ట్రంలో కనిపించవు. ఒక ప్రాంతంలో ఉండే పదార్థాలు మరో ప్రాంతానికి పరిచయమే ఉండవు. అయితే ఎక్కడ ఏది విశేషంగా ప్రాచుర్యంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఏ వంటకాలు తప్పనిసరిగా విస్తట్లో ఉంటాయి అన్నది రుచి చూసి మరీ తెలుసుకుని వాటన్నిటినీ ఒక్కచోట చేర్చారు షెఫ్ సారిక గుప్తా. ఆమె రాసిన పుస్తకం 28 స్టేట్స్ 28 ప్లేట్స్… భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన శాకాహార వంటకాలను మన ముందు ఉంచుతుంది. వీటి రెసిపీని పర్ఫెక్ట్గా అందించేందుకు ఒక్కో వంటకాన్నీ నాలుగైదు సార్లు వండానని చెబుతున్న సారిక ‘జిందగీ’తో పుస్తకానికి సంబంధించిన మరిన్ని విశేషాలను పంచుకున్నారు.
ఇంటి వంటలోనే మన ఆరోగ్యం దాగుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే నేను దాని మీద ఎక్కువ దృష్టి పెడతాను. చిన్నప్పటినుంచీ వంట చేయడం అంటే ఇష్టం. ముప్పయ్యేండ్ల క్రితం జీ టీవీలో సంజీవ్ కపూర్ ఖానా ఖజానా కార్యక్రమం వచ్చేది. అప్పుడు నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. అందులో చూసి రకరకాల వంటలు చేస్తుండేదాన్ని. అన్నట్టు నేను పుట్టి పెరిగింది విశాఖపట్టణంలో. హైదరాబాద్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్లో అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఒక్కొక్కరి బాక్సులోని సాంబారు ఒక్కోలా ఉండేది. కానీ అన్నీ బాగుండేవి. ఈ విభిన్నత ఏంటా అని అప్పుడు కూడా ఆలోచించేదాన్ని. మా బంధువులు రాజస్థాన్లో ఉండటం వల్ల అక్కడి రుచులు, తెలుగు రాష్ర్టాల్లో పెరగడం వల్ల ఇక్కడి రుచులు బాగా పరిచయం. ఇక, పెండ్లయ్యాక కుటుంబంతో నేను ఉన్న, చూసిన ప్రాంతాలు అక్కడి వంటకాలు నేను ఈ పుస్తకాన్ని రాసేందుకు భూమిక అయ్యాయి.
డిగ్రీ పూర్తిచేసిన వెంటనే నాకు పెండ్లయ్యింది. మా వారు యోగేశ్ గుప్తా, ఐపీఎస్. అప్పుడు ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉండేవారు. మా కొత్త కాపురం అక్కడే. తర్వాత ముంబయి, కోల్కతా, జమ్మూ కశ్మీర్… ఇలా వివిధ చోట్లకి బదిలీలు అయ్యాయి. దీంతో మేం ఆయా ప్రాంతాల్లో చాలా రోజులే ఉన్నాం. వాటి చుట్టుపక్కల విహార కేంద్రాలు కూడా చూసేవాళ్లం. ఒకటే వంటకం విభిన్నమైన రుచుల్లో దొరకడం అన్నది అప్పుడే నేను గమనించాను. మన దగ్గర ఆలూ దమ్, కశ్మీరీ ఆలూ దమ్ వేరు వేరుగా ఉంటాయి. అక్కడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. తొలినుంచీ వంటల మీద ఇష్టం కాబట్టి, నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి పదార్థాలు రుచి చూస్తా.
వాటిని ఎలా చేశారు అని స్థానికులనో, స్నేహితులనో, అదీ కాకపోతే మాతోపాటు వచ్చే డ్రైవర్నో అడిగి తెలుసుకుంటా. ఆ రెసిపీ గుర్తుండదనిపిస్తే జాగ్రత్తగా రాసుకుంటా. అలా నాకు ఎన్నో ప్రాంతాల రుచులతో అనుబంధం ఏర్పడింది. నా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కొన్ని రెసిపీలు పెడుతూ ఉండేదాన్ని. కొవిడ్ సమయంలో అందరం ఇండ్లకు పరిమితమైనప్పుడు మా కుటుంబసభ్యుల నుంచి ఒక సూచన వచ్చింది. నీకు బోలెడు వంటలు వచ్చు కదా, వాటితో నువ్వే ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది… అన్నది దాని సారాంశం. నాకూ నిజమే అనిపించింది. అలా 2021లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించా.
నేను వెళ్లిన ప్రదేశాలు నాకు తెలిసిన రుచులన్నిటినీ ఒక చోటకి చేర్చే పని మొదలుపెట్టా. అందులో ప్రతి ఒక్కటీ విభిన్నమే. అవన్నీ చేస్తున్నప్పుడే మా అబ్బాయి యుగంతర్ ఈ పుస్తకానికి పేరు పెట్టాడు. ‘28 స్టేట్స్… 28 ప్లేట్స్…’ అని. నాకు కూడా బాగా నచ్చింది. ఇవన్నీ ఒక దగ్గరికి చేర్చడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. మా కజిన్స్ మహారాష్ట్ర, అసోం ఇలా వివిధ రాష్ర్టాల్లో ఉంటారు. వాళ్లను అడిగి అక్కడి వంటకాల గురించి తెలుసుకునేదాన్ని. వచ్చినప్పుడు చేసిపెట్టి రుచి అడిగేదాన్ని. కుదరకపోతే మళ్లీ చేసేదాన్ని. తెలియనివి కూడా ఇది ఇలా ఉండవచ్చు అని ఊహించి దాని రుచి బాగా కుదిరేదాకా చేసి ఆ రెసిపీని రాసుకునే దాన్ని. ఇలా పర్ఫెక్షన్ కోసం ఒక్కో వంటకాన్ని నాలుగైదుసార్లు తయారు చేశానంటే నమ్మండి. అందుకే ఉప్పు, నీళ్లకు కూడా కొలతలు రాయగలిగా. నేను వంట చేసే తొలినాళ్లలో ఉప్పు వేయడంలో ఇబ్బంది పడేదాన్ని, అందుకే దాన్ని ప్రస్తావించా!
160కి పైగా రెసిపీలున్న ఈ పుస్తకం మొత్తాన్నీ నేను ఫోన్లోనే రాశాను. ఫొటోలు కూడా నేనే తీశా. ఫొటో బాగా రావడం కోసం వంట చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరో విషయం రెసిపీ ఎక్కడిదైనా దానికి వాడే పదార్థాలు అందరికీ దొరికేలాంటివే ఎంచుకున్నా. మదురై ఫేమస్ పానీయం జిగర్తండా, మణిపూర్ బ్లాక్ రైస్, కొంకణ్ తీర ప్రాంతంలో దొరికే కోకం లాంటివి మాత్రం ప్రత్యేకంగా అక్కడినుంచే తెప్పించాల్సి వచ్చింది. ఇది అచ్చంగా శాకాహార వంటల పుస్తకం కదా, ప్రతి రాష్ట్రంలోనూ శాకాహార వంటలే ప్రత్యేకంగా ఉంటాయా… అన్న అనుమానమూ రావచ్చు. కానీ ఉన్నాయి. ఒక్క ఈశాన్య రాష్ర్టాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల చక్కటి శాకాహార వెరైటీలు తింటున్నారు. ఈశాన్య రాష్ర్టాలకు చెందిన రెండు మాంసాహార వంటకాలను మాత్రం శాకాహారంగా మార్చి రాశానంతే.
ఇంతకీ వెజిటేరియన్ వంటలే ఎందుకు రాశానంటే నేను పక్కా శాకాహారిని. నేను రుచిచూసిన వంటలు మాత్రమే రాయాలనుకున్నా. మొత్తానికి ఈ పుస్తకం పూర్తి చేయడానికి రెండేండ్లు పట్టింది. అలవాటు లేని పనే అయినా నేర్చుకుని మరీ, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ నేనే చేసుకున్నా. పుస్తకాన్ని అమ్మకానికి పెట్టగానే తొలి 1500 కాపీలు చాలా వేగంగా అమ్ముడైపోయాయి. మరిన్ని రెసిపీలు జోడించి రెండో ఎడిషన్ తెచ్చాం. ఏ ప్రాంతానికి వెళ్తే ఏ ఆహారం ప్రయత్నించ వచ్చో చెప్పే గైడ్లాగా ఇది ఉందని కొందరు మెచ్చుకున్నారు. ఈ ఉత్సాహానికి తోడు, మా ఇద్దరు అబ్బాయిలు, మావారి ప్రోత్సాహంతో మరో పుస్తకం రాయడం మొదలుపెట్టా. ఎవరు ఏ వంటకం గురించి తెలుసుకున్నా సరే చక్కగా వీటిని వండుకుని తినమనే నేను చెప్తా… ఇంటి ఆహారాన్ని మించిన ఆరోగ్యదాయిని ఇంకోటి ఉండదు మరి!
తెలంగాణ వంటల్లో ఇక్కడి వారికి ఇష్టమైన ముద్దపప్పు, పచ్చి పులుసులను రాశాను. దప్పళం, సాలన్, ఖుబానీ కా మీఠాలు కూడా తెలంగాణ థాలీలో చేర్చాను. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నాకిష్టమైన అల్లం పచ్చడితోపాటు మిరపకాయ, అరటికాయ బజ్జీలు, మామిడికాయ పులిహోర లాంటివి చెప్పాను. ఇక్కడ గోంగూర పచ్చడి కూడా ఫేమసే అయినా ఇటు కేరళ, అటు జమ్ము కశ్మీర్లాంటి చాలా రాష్ర్టాల్లో గోంగూర దొరకదు కనుక ఆ వంటకం గురించి పుస్తకంలో చెప్పలేదు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి