‘హే… ఒక్కదానివే వెళ్తున్నావా? ఎవరినన్నా తోడు పంపించనా!’, ‘తొందరగా వచ్చేయ్… మళ్లీ చీకటి పడేదాకా ఉండకు.. అసలే ఒంటరిగా వెళ్తున్నావ్’, ‘ఏంటీ? ఎప్పుడూ ఊళ్ల వెంట తిరగాలంటే ఎలా? బోలెడు డబ్బులు ఖర్చు’.. ఇలాంటి మాటలేవీ తనకు పట్టవంటున్నది సోలో యాత్రికురాలు సరస్వతి నారాయణ అయ్యర్. ఢిల్లీకి చెందిన ఈమె ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తున్నది. అంతేకాదు, ఆడపిల్లలు ఇలా ఒక్కరే, భద్రంగా ఎలా ప్రయాణం చేయాలో చెబుతూ తన యాత్రకు సంబంధించిన వీడియోలూ అప్లోడ్ చేస్తున్నది. జీరోబడ్జెట్ యాత్రికురాలి గురించి తెలుసుకుంటే ఎవరైనా హీరో అనాల్సిందే. ఆ ముచ్చట్లు మీకోసం!
సాహసం చేయాలంటే సంపన్నులే కానక్కర్లేదు, ధైర్యవంతులు అయితే చాలు… అని చెబుతుంటుంది సరస్వతి. అవును ఇంత పెద్ద భారతదేశంలో, ఒక్క యాత్ర చేయాలంటేనే వేలు ఖర్చయ్యే చోట దేశమంతా తిరగాలంటే ఇంకెంత డబ్బుండాలి! అలాగని అందమైన ప్రదేశాలను చుట్టేయాలన్న తన ఆశలను వదులుకోలేదామె. తనదైన పద్ధతిలో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ ధైర్యమే ఆమెకు విజయాన్ని కట్టబెట్టింది. సోలో ట్రావెలర్‌గా ఇప్పుడామె పర్యాటక ప్రియుల సర్కిల్లో తెగ ఫేమస్. ఆమెను చూసి తమ కలల్ని నెరవేర్చుకోవడానికి అడుగు బయటపెట్టిన వాళ్లు కొందరైతే, తన ప్రయాణాన్ని గమనిస్తూ ఆనందిస్తున్న వాళ్లు ఇంకొందరు. అసలైన మహిళా సాధికారత అంటే ఇదే అని మెచ్చుకొనే వాళ్లూ ఎందరో. అసలామె ప్రయాణం ఎలా సాగుతుందంటే…
సరస్వతి చదువు పూర్తయిన తర్వాత ఓ బీమా కంపెనీలో ఉద్యోగిగా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక వివిధ ప్రదేశాలు చూడాలన్న తన ఆశలకు, ఆ ఉద్యోగానికీ అస్సలు పొంతన కుదరడం లేదనిపించి ఆఫీసు మానేసింది. దీంతో రెండేండ్ల క్రితం తన కలల ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. అలాగని చేతిలో దండిగా డబ్బులేం లేవు. ‘ఇంతలోనే వెళ్లాలి’ అనుకోవడానికి అసలు బడ్జెట్టే లేదు. అందుకే ‘హిచ్ హైకింగ్’ను మోడల్‌గా పెట్టుకుంది. అంటే, మనం వెళ్లాల్సిన దారిలో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి ఉచితంగా ప్రయాణించడం అన్నమాట! అంతేకాదు, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణించడం కూడా ఒక పద్ధతిగా పెట్టుకుంది. ఇలా సౌకర్యంగా ప్రయాణించేందుకు అతి తక్కువ లగేజ్‌ను సర్దుకుంటుంది. రెండుచీరలు, రెండు నైట్ డ్రెస్‌లు, ఒక క్యాంపింగ్ టెంట్, లిఫ్ట్ బోర్డులు, కొంచెం చిరుతిండి… అంతే. ఇక ఉండేందుకు దేవాలయాలు, ధర్మశాలలు, ఆశ్రమాలు, బడుల్లాంటి వాటిని ఎంచుకుంటుంది. అదీ లేదంటే చీకటి పడేలోపే ఏదన్నా ఊరికి చేరుకుని అక్కడి ఇండ్ల వాళ్లను పరిచయం చేసుకుంటుంది.
భద్రమే అనిపించిన చోట తన టెంట్ ఏర్పాటు చేసుకుని పడుకుంటుంది. ట్రావెలర్లకు బస ఇచ్చే ఇళ్లనూ వెతికి పట్టుకుని వాళ్లకు కాస్త సాయం చేసి ఉచితంగా ఆరోజుకు అక్కడ ఉంటుంది. ఇక, ఆహారం విషయమూ అంతే. ఎక్కువగా గుళ్లు, గురుద్వారాల్లాంటి చోట్ల ఆహారం తింటుంది. లేదంటే దగ్గరిలోని ఊరికి వెళ్లి నాలుగైదు గంటలు పని వెతుక్కుంటుంది. అందుకుగానూ తనకు అన్నం పెట్టమని అడుగుతుంది. అలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా లద్దాఖ్, మానస సరోవరం, హిమాలయాలు… ఇలా ఎన్నో ప్రదేశాలను చూస్తూ, వివిధ రాష్ర్టాలు దాటి సరస్వతి ప్రయాణం చేసింది. ఇటీవలే దేశ సరిహద్దు దాటి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లకూ జీరోబడ్జెట్ ప్రయాణం చేసింది. కేవలం ఓ చోటుకు వెళ్లడమే కాదు, అక్కడి సంస్కృతిని తెలుసుకోవడం, వంటల్ని రుచి చూడటం, నచ్చిన మనుషులతో దోస్తీ చేయడం లాంటివీ చేస్తున్నది. ఇటీవల ఆసక్తి నెలకొన్న ట్రెండ్… జీరో బడ్జెట్ ట్రావెల్‌కి సరస్వతి ఓ చక్కని ఉదాహరణ.
తన ప్రయాణాన్ని గురించి సరస్వతి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి పెడుతుంటుంది. ‘సేఫ్ లడ్కీ’ పేరిట ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్నూ, ‘ట్రావెల్ విత్ అయ్యర్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌నూ నడుపుతున్నది. ఇన్‌స్టాలో లక్షా 53 వేల మంది ఫాలోవర్లు ఉండగా, యూట్యూబ్‌లో 3 లక్షల 15 వేలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఈ వీడియోల్లో తను ప్రయాణించిన ప్రదేశాల ముచ్చట్లతోపాటు, భద్రతకు సంబంధించిన చిట్కాలు, తోటి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే మాటలు పంచుకుంటూ ఉంటుంది. తనలాగే జీరో బడ్జెట్లో ఎలా ప్రయాణించాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న సంగతులు వివరిస్తుంటుంది. ‘సిస్టర్ మాకూ ఇలా ప్రయాణించాలని ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి ఏం చేయాలి?’… అంటూ చాలామంది ఆమెను సలహాలు సూచనలూ అడుగుతుంటారు. అలాంటి వారెందరికో ఆమె రకరకాల సందర్భాల్లో వాళ్ల కలను నెలవేర్చుకునే మార్గాలను చెబుతుంటుంది. భౌతికంగా చూసుకుంటే ఆమె సుదీర్ఘమైన దూరాలను దాటి ఉండవచ్చు, నిజానికి మహిళగా ఒంటరి ప్రయాణం చేస్తూ సరస్వతి బలమైన సామాజిక అడ్డంకిని దాటింది. కాస్త ధైర్యం చేసి అడుగేస్తే ఆడపిల్ల సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది!