సోషల్ మీడియాలో కామెడీతో కడుపుబ్బా నవ్వించే ‘అల్లాడిపోతున్నా డమ్మా’ రీల్ చూడని వాళ్లుండరు. ఆమె చేసిన ‘పానీపూరీ’ సాఫ్ట్ సెటైర్‌కి మచ్చు తునక! సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే ఓవర్‌నైట్‌లో స్టార్‌గా ఎదిగిపోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు..ఆమె చేసినవన్నీ వైరల్ వీడియోలే! సింగర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, లిరిసిస్ట్‌గా రాణిస్తూ మల్టీ టాలెంట్‌తో అందరినీ మెప్పిస్తున్నది సమీరా భరద్వాజ్. నాలుగు వందల సినిమాల్లో పాడి, సీరియల్స్‌లో నటించి, సోషల్ మీడియాలో కామెడీ పండించి చేసిందల్లా బంగారమే అన్నట్టు ఫాలోవర్స్‌ని పెంచుకుంటూపోతున్న సమీర జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
నేను పుట్టింది భద్రాచలం. పెరిగింది చెన్నై. అమ్మా వాళ్లది విజయవాడ. నాన్నది గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అందువల్ల ప్రత్యేకంగా నాది ఈ ఊరు అని చెప్పలేను. మా అమ్మమ్మ సంగీతం టీచర్. అమ్మ బాగా పాడుతుంది. అప్పటి పరిస్థితుల వల్ల ఆమె ఎక్కడా పాడేందుకు ప్రయత్నాలు చేయలేదు. అమ్మ గాయని అవ్వాలనుకుంది. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. ఆ కోరిక నా ద్వారా తీర్చుకోవాలనుకుంది. నన్ను గాయనిగా చూడాలని మూడేళ్లకే సంగీతం శిక్షణ ఇప్పించింది.
చిన్నప్పటి నుంచీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని, సుశీల గారిని చూస్తూ మంచి గాయనిగా ఎదగాలనుకున్నా. నేర్చుకునే రోజుల్లోనే అనేక షోలలో పాడాను. ఒకసారి సుశీల గారు నా పాట విని చాలా మెచ్చుకున్నారు, ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను. పదేళ్ల క్రితం ఒక రియాలిటీ షోలో పాల్గొన్నాను. ఆ సమయంలో ‘బ్రూస్లీ’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. అదే నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్.
చిరంజీవి, బాలకృష్ణ, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలకు పాటలు పాడాను. నాకు బ్రేక్ ఇచ్చిన పాట అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ‘తెలుసా.. తెలుసా..’. ‘అర్జున్ రెడ్డి’లో ‘మధురమే ఈ క్షణమే..’, ‘శతమానం భవతి’లో ‘నాలో నేను..’, ‘మిస్టర్ బచ్చన్’లో ‘అబ్బ చ్చా.. అబ్బ చ్చా..’, ‘తండేల్’లో బుజ్జి తల్లి ఫిమేల్ వెర్షన్, ‘కోర్ట్’లో ‘ప్రేమలో..’.. ఇలా చాలా హిట్ సాంగ్స్ పాడాను. ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల సినిమాల్లో పాడాను. కొన్ని సినిమాల్లో పాటలకు లిరిక్స్ కూడా రాశాను.
‘గుండమ్మ కథ’ సీరియల్లో ఒక ఎపిసోడ్లో సింగింగ్ కాంపిటిషన్లో జడ్జ్ పాత్రలో నటించేందుకు పిలిచారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు కథలో మార్పులు చేశారు. నా క్యారెక్టర్ని పొడిగించారు. ఒక్కరోజు అనుకుంటే వారం రోజులు నటించాల్సి వచ్చింది. రీల్స్ వైరల్ కావడం వల్ల ఒక్కసారిగా అవకాశాలు చుట్టుముట్టాయి. సీరియల్స్‌లో నటించాలన్న ఆసక్తి లేక సినిమాల వైపు మళ్లాను. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘సారంగపాణి జాతకం’లో నటించాను. కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నాకు కంఫర్టబుల్‌గా ఉండి, నాకు నచ్చే కాస్ట్యూమ్స్ వేసుకోగలిగే పాత్రలు ఆఫర్ వస్తే ఓకే చెబుతాను.
ప్లేబాక్ సింగర్స్ గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు. మొదట్లో రియాలిటీ షోలలో ఎక్కువగా పాడలేదు. అందువల్ల ఎక్కువమందికి నేను సింగర్‌గా తెలియదు. సోషల్ మీడియా రీచ్ ఎక్కువ కాబట్టి ఇన్ఫ్లూయెన్సర్గానే గుర్తింపు దక్కింది. రీల్స్ చేయడం మొదలుపెట్టాక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా పేరొచ్చింది. నేను చేసే కామెడీ చూసి చాలామంది సమస్యలు మర్చిపోతున్నారు. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి, రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది?! వీలైనంత కామెడీ పండించడం కోసం సంతోషంగా రీల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఒకసారి ఒక అభిమాని అమెరికా నుంచి ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ కొడుకుని కోల్పోయి బాధపడుతుందని, తన ఫ్రెండ్ నా అభిమాని అని చెప్పింది. ఒక్కసారి తన ఫ్రెండ్‌తో మాట్లాడమని రిక్వెస్ట్ చేసింది. సరేనని కాసేపు మాట్లాడాను. నా వల్ల చాలారోజుల తర్వాత ఆమె నవ్వింది. నన్ను చూసి ఏడుస్తూ, ‘మీ వీడియోస్ చూస్తూ కొంతవరకైనా నా బాధని మర్చిపోతున్నాను’ అన్నది! ఆమె మాటలు నాకు సంతృప్తినిచ్చాయి. ఒక్క పనిచేస్తూ ఆగిపోకుండా వీలైనంత వరకు అనేక రంగాల్లో రాణించాలని అప్పుడే నిర్ణయించుకున్నా.
గాయనిగానే కాకుండా యాంకరింగ్, యాక్టింగ్, డబ్బింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్‌స్వామి గారి వైఫ్ పాత్రకి, ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్‌కి, ‘కుబేర’లో నాగార్జున గారి వైఫ్ పాత్రకి .. ఇంకా చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా పేరొచ్చింది. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే భయం లేకుండా ఎలాంటి టాస్క్ ఇచ్చినా కెమెరా ముందు అలవోకగా చేసేస్తాను. నాకు తెలియని రంగంలోనైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోను. కొత్త కాబట్టి ముందుగానే బాగా ప్రిపేరవుతాను. నావంతు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను.
చిన్నప్పటి నుంచీ నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించిన మా అమ్మానాన్నలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. మా నాన్న ఐటీసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. నా భార్త టీసీఎస్ ఉద్యోగి. మాకు ఒకపాప. పేరు ఆద్య. ఈ మధ్యనే తనూ ఒక టీవీ షోలో కనిపించింది. మా అత్తామామలతో మేం కలిసే ఉంటాం. నా పెళ్లి తర్వాతే నా కెరీర్ మొదలైంది. పెళ్లికి ముందు అన్నీ నేర్చుకోవడమే సరిపోయింది. పెళ్లి తర్వాతనే ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించా. మా అత్తామామలకూ సంగీతం అంటే ఇష్టం. మా మధ్య ఎక్కువ తక్కువ భేదాలుండవు. అందరం సమానమనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. అందుకే నాకు ప్రతి విషయంలో పూర్తి సహకారం లభిస్తున్నది. నేను నా భర్తకు ఇచ్చే సహకారం కంటే ఆయన నాకు ఇచ్చే ప్రోత్సాహం ఎక్కువ. విదేశాల్లో షోలలో పాడటానికి వెళ్లినప్పుడు ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటాడు.
– హరిణి