 
                                                            గజిబిజి సిటీలైఫ్‌లో మనవైన రుచులు మర్చిపోతున్నాం. ఆఫీస్ నుంచి వస్తూ జంక్‌ఫుడ్ తినేస్తున్నాం. వీకెండ్స్‌లో హోటల్ తిండినే మృష్టాన్న భోజనం అని సరిపెట్టుకుంటున్నాం. ఉద్యోగాల పేరుతో.. ఇంటికి దూరంగా వచ్చిన వారి గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరైనా ఇంటికి పిలిచి షడ్రసోపేతమైన విందు ఇస్తామంటే ఎలా ఉంటుంది. ‘కాజ్ వై నాట్?’ అదే చేస్తున్నది. ఇద్దరు అమ్మాయిల ఆలోచనలోంచి పుట్టిన ఈ సొల్యూషన్ ఇంటి వంటతో పసందైన విందు ఇస్తూనే, అనుబంధాలు విరిసే సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. సిటీలో నయా కల్చర్‌కు శ్రీకారం చుట్టిన సహన, శ్రీమయిలను ‘జిందగీ’ పలకరించింది. ఆ ఘుమఘుమలే ఇవి..
కరీంనగర్‌కు చెందిన పెద్ది సహన, మంచిర్యాలకు చెందిన రేణికుంట శ్రీమయి ఇద్దరూ దగ్గరి బంధువులు. పై చదువుల కోసమని జర్మనీకి సహన వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తిండి తిప్పలు తట్టుకోలేక.. తన వంట తనే చేసుకునేది. చదువు ముగించుకొని హైదరాబాద్‌లో వ్యాపారం మొదలుపెట్టింది. ఎంత కష్టపడితే మాత్రం ఏముంది? రుచికరమైన ఆహారం లేక ఇబ్బందిగా ఫీలయ్యేది. వారంలో ఒక్కరోజైనా ఇంటి వంట తినాలనీ, స్నేహితులతో సరదాగా గడపాలనీ ఆమె ఆలోచన. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా.. ఇంటి రుచి దొరకలేదు ఆమెకు. స్నేహితులు ఎవరి బిజీలో వాళ్లు ఉండటంతో నలుగురితో కలిసే అవకాశమే గగనమైపోయింది. జీవితం ఇలా కృత్రిమంగా సాగిపోవడం సహనకు నచ్చలేదు. అదే సమయంలో హైదరాబాద్‌లో బీబీఏ ఫైనలియర్ చదువుతున్న శ్రీమయి ఆమెకు తోడైంది. ఇద్దరూ కలిసి మంచి భోజనం కోసం రోజంతా వెతికేవారు. అయినా వాళ్ల అభిరుచికి తగ్గ రుచి ఎక్కడా చవిచూడలేకపోయారు.

రుచీపచీ లేకుండా రోజులు భారంగా సాగుతున్నాయి. ఈ మహానగరంలో తమలాగే ఇంటి భోజనం కోసం పరితపించేవాళ్లు ఎందరో ఉంటారు కదా అనుకున్నారు ఇద్దరు. మనమే వారికి అలాంటి ఫుడ్ ఎందుకు అందివ్వకూడదు అని ‘కాజ్ వై నాట్?’ ప్రారంభించారు. ఇంటికి దూరంగా ఉంటూ చప్పిడి తిండి తింటున్నవాళ్లందరికీ మేలైన రుచులు పంచాలని భావించారు. నెలలో రెండు శనివారాలు అతిథులకు ఆహ్వానం పలకాలని నిశ్చయించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘కాజ్ వై నాట్?’ పిలుపు ఇచ్చారు. తమ స్వహస్తాలతో రుచికరమైన పదార్థాలు చేసి, ఇంట్లోనే కూర్చుని, కులాసాగా కబుర్లు చెప్పుకొంటూ విందు ఆరగించే ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఎవరూ రారేమో అనుకొని తమ స్నేహితులనే ఆహ్వానించి విందు చేశారు. తిన్నవాళ్లంతా మెచ్చుకోవడంతో ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు.
ప్రతి ఈవెంట్‌కు 10 నుంచి 20 మంది మాత్రమే హాజరయ్యేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నామమాత్రంగా రుసుం వసూలు చేస్తారు. వీరి పిలుపు అందుకొని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు బాగానే స్పందిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాల్లో ఉన్న తమ బంధువుల ఇంటిని వెన్యూగా ఫిక్స్ చేస్తుంటారు సహన, శ్రీమయి. ప్రతిసారీ ఒకేరకమైన వంటకాలు కాకుండా సరికొత్త థీమ్‌లతో విందులు పంచుతున్నారు. శనివారం ఉదయాన్నే ఇద్దరూ రంగంలోకి దిగుతారు. తాజా కాయగూరలు తెచ్చి, స్వయంగా అనేక రకాల పదార్థాలూ వండేస్తారు. సాయంత్రానికి బిలబిలమంటూ అతిథులు వచ్చేస్తారు. పరిచయాలు పూర్తయ్యాక.. అరిటాకు వేసి మరీ భోజనాలు పెడతారు. కోరిన పదార్థాన్ని కొసరి కొసరి వడ్డిస్తారు. అప్పడాలు తింటూ, ముచ్చట్లు చెప్పుకొంటూ సందడిగా విందారగిస్తారంతా. పదార్థాల విషయంలో సంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు సహన, శ్రీమయి. మక్క గట్క, అంబలి, ఉల్లికారం, ఎల్లిపాయ కారం, ముద్దపప్పు ఇలా.. పసందైన పదార్థాలు వండి వడ్డిస్తున్నారు.
తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ, పై చదువులకోసమని హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న వాళ్లకు అమ్మ చేతివంటను పరిచయం చేస్తున్న ‘కాజ్ వై నాట్?’ ప్రస్థానం మొదలై ఐదు నెలలే అయింది. ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా అని అతిథులు ఎదురు చూసేంతగా వీళ్లకు పేరొచ్చింది. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలే అందిస్తున్న ఆతిథ్యం.. నాలుగు వారాలకు పెంచాలనే యోచనలో ఉన్నారు సహన, శ్రీమయి. అంతేకాదు హైటెక్‌సిటీ, మాదాపూర్‌కే పరిమితమైన వెన్యూలు నగరవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనూ ఉన్నారు. ఈ ఇద్దరి ప్రయత్నం చవులూరించే విందును అందివ్వడమే కాకుండా.. ముచ్చటైన బంధాలకు వేదికగా నిలుస్తుండటం విశేషం.
– రాజు పిల్లనగోయిన
 
                            