ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఏటా విడుదల చేసినట్టే ఈ ఏడాది కూడా ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఆ వందమందిలో వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశం నుంచి ఒక్కరూ లేరు. అత్యధిక జనాభా కలిగిన భారతీయుల్ని నిరాశపరిచిన ఆ జాబితాలో ప్రవాస భారతీయురాలు రేష్మ కేవల్మ్రణి పేరు ఉండటం మనకు ఊరట కలిగించే అంశం. ఇంతకుముందెన్నడూ పెద్దగా వార్తల్లో లేని రేష్మ అమెరికా ఔషధ రంగంలో ప్రసిద్ధురాలు. ఆమె నాయకత్వంలో జరిగిన పరిశోధన, జన్యు చికిత్సల్లోని విజయాలే ఆమెకు ఈ కీర్తిని తెచ్చిపెట్టాయి.
రేష్మ ముంబయిలో పుట్టింది. ఆమెకు పదకొండేళ్ల వయసున్నప్పుడు వాళ్ల కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. రేష్మ బోస్టన్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించింది. లిబరల్ ఆర్ట్స్, వైద్య సంబంధమైన కోర్సులను ఏడేండ్లపాటు అధ్యయనం చేసింది. తర్వాత మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఫెలోషిప్‌నకు ఎంపికైంది. అక్కడ క్లినికల్ నెఫ్రాలజీ (కిడ్నీ సంబంధమైన వ్యాధుల చికిత్స)లో ఇంటర్న్‌షిప్ చేసింది. అదే సంస్థలో కొంతకాలం ట్రాన్స్‌ప్లాంటేషన్ (అవయవ మార్పిడి) చికిత్సా పద్ధతుల గురించి అధ్యయనం చేసింది. మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ను వీడి బ్రిగామ్ అనే వైద్య సంస్థల్లో చేరింది. నెఫ్రాలజీలో వైద్య సేవలు అందించడంతోపాటు పరిశోధనలు కూడా చేసింది. అక్కడ పనిచేస్తున్న సందర్భంలోనే ఆమె దృష్టి బయోమెడికల్ రంగంపై పడింది. బయోఫార్మా విభాగంలోకి అడుగుపెట్టింది.
వైద్య సేవల పరిశోధన చేస్తున్న సందర్భంలో బయోఫార్మా పట్ల ఆసక్తి చూపిన రేష్మ క్యాలిఫోర్నియాలోని మల్టీ నేషనల్ బయో ఫార్మాసూటికల్ కంపెనీ ఆమ్గెన్లో చేరింది. బయోమెడికల్ పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో పుష్కర కాలం కృషిచేసింది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఆవిష్కరణల కోసం అన్వేషణే కాదు వందల మందికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంటుంది. తన నాయకత్వ లక్షణాల వల్ల రేష్మ తొందరగానే తనకంటూ ఓ గుర్తింపు పొందింది. ఈ పరిశోధనలో ఉన్నప్పుడే మేనేజ్మెంట్ విద్యకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కోర్సులో చేరింది. పదేండ్ల క్రితం ఆ కోర్స్ పూర్తిచేసింది. ఆ తర్వాత జింగో బయోవర్క్స్లో చేరింది. కొన్నాళ్లకే ఆ కంపెనీని వీడి వెర్టెక్స్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో అడుగుపెట్టింది.
ఇది బయోమెడికల్ కంపెనీ. బోస్టన్, మాసాచుసెట్స్ కేంద్రాలుగా పని చేస్తున్నది. పరిశోధన, ప్రతిభ, నాయకత్వ లక్షణాలు సమృద్ధిగా ఉన్న రేష్మ ఈ కంపెనీలో తొందరగా ఎదిగింది. ఏడాది తిరిగే సరికి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందింది. జన్యు లోపాల వల్ల వచ్చే సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నివారణ కోసం చేపట్టిన జీన్ థెరపీ అభివృద్ధిలో ఆమె చేసిన కృషి విజయవంతం కావడంతో ఈ రంగంలో ఆమె జైత్రయాత్ర మొదలైంది. డీఎన్ఏ లోపాలను సరిచేయడంలో సీఆర్ఐఎస్పీఆర్ థెరపీ ఓ విప్లవమనే చెప్పాలి. ఆ థెరపీ అభివృద్ధిలో రేష్మ కృషి ఉంది. ఈ విజయాలతో ఆమెకు పదవులు, గుర్తింపు వెదుక్కుంటూ వచ్చాయి. రెండేళ్లకు కంపెనీ సీఈఓ పగ్గాలు ఆమె చేతికి వచ్చాయి. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీకి సీఈఓ బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళగా రేష్మను మీడియా ప్రశంసించింది.
వెర్టెక్స్ సీఈఓగా రేష్మ నాయకత్వంలో ‘సిస్టిక్ ఫైబ్రోసిస్’ అనే జన్యువాధి నివారణ కోసం త్రికఫ్త అనే డ్రగ్ తయారుచేశారు. అరుదైన కిడ్నీ వ్యాధుల నివారణ, నొప్పుల నివారణకు వివిధ రకాల డ్రగ్స్‌ని ఆ కంపెనీ తయారుచేసింది. జన్యు లోపాలతో వచ్చే సికిల్‌సెల్ ఎనీమియా, బీటా థలసేమియా నివారణ కోసం ఆమె నాయకత్వంలో మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో జీన్ ఎడిటింగ్ థెరపీని అభివృద్ధి చేశారు. ఇలా బయోమెడికల్ రంగంలో జరిగే పరిశోధనల్లో కీలకమైన భూమికను పోషించిన ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి.
పలు వైద్య సంస్థల్లో సభ్యురాలిగా, పరిశోధన సంస్థలకు సలహాదారుగా రేష్మ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. ఆమె సాధించిన విజయాలు కొత్త ఆవిష్కరణలు, కంపెనీలకు లాభాలే కాదు ప్రజలకు ఎంతో మేలుచేశాయి. వైద్య రంగాన్ని ప్రభావితం చేసిన ఆమె టైమ్ మ్యాగజైన్ 2025లో ప్రకటించిన అత్యంత ప్రభావశీలమైన వందమంది వ్యక్తుల జాబితాలో చేరింది. ఈ జాబితాలో ఉన్న ఒకే ఒక్క ప్రవాస భారతీయురాలామె. రేష్మ ప్రసుత్తం మాసాచుసెట్స్ నగరంలో కుటుంబంతో నివసిస్తున్నది. తల్లిగా ఇద్దరు పిలల్ల బాధ్యతలతోపాటు బయోమెడికల్ పరిశోధనలో నాయకురాలిగానూ రాణిస్తున్నది.