ఫ్యాషన్… మహిళలకు అవసరం. కానీ, వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం. తాను వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నప్పుడు మొదటి దాని మీద ఆసక్తి ఉన్నా రెండోది అవసరం అని గ్రహించిందామె. అందుకే శానిటరీ న్యాప్కిన్స్ తయారీకి సంబంధించి చాలా రోజులపాటు అధ్యయనం జరిపింది. అదే రంగంలో ప్రవేశించాలని తలపెట్టింది. అయిదేండ్ల కింద తాను ప్రారంభించిన ఆ సంస్థ ఇప్పుడు నెలకు ఏకంగా రెండు కోట్ల దాకా ప్యాడ్లను ఉత్పత్తి చేస్తున్నది. అంతేకాదు పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధినీ ఇస్తున్న మహేశ్వరి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకురాలు రాత్లావత్ మహేశ్వరి జిందగీతో పంచుకున్న సంగతులు..
అందరూ నడిచిన బాటలో నడవడం తొలినుంచీ నాకు అంతగా నచ్చేది కాదు. ప్రయోగాలు చేయడం, మిగతా వారికన్నా భిన్నంగా ఆలోచించి ఆ దిశగా అడుగేయడమే అలవాటు. అందుకే ఇంజినీరింగ్ చదివిన నేను ఆ తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ వైపు మళ్లాను. కానీ, దానికి భిన్నమైన పారిశ్రామిక రంగంలో కెరీర్ ప్రారంభించాను. అయితేనేం, అందులో విజయం సాధించడం అన్నది సంతోషాన్ని ఇచ్చే విషయం. మలుపులతో ఈ ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ముందు నా సంగతులు కొన్ని చెబుతాను. మాది హైదరాబాద్‌లోని దుండిగల్. దాంతో మొదటినుంచీ ఈ నేలతో నాకు మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఇంటర్మీడియెట్ అయిపోగానే అందరితోపాటు నేను కూడా ఇంజినీరింగ్ చదివాను. అయితే నాకు రకరకాల మోడళ్ల దుస్తులంటే బాగా ఇష్టం. వాటి గురించి బాగా తెలుసుకుంటూ ఉండేదాన్ని. దాంతో ఇంజినీరింగ్ అయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లింది. ఇంకేం, హైదరాబాద్‌లో ఓ కాలేజీ నుంచి ఏడాది కోర్సు చేశా. అది పూర్తవుతూనే పెండ్లయింది.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక, కెరీర్లోనూ కొత్త అడుగులు వేయాలనుకున్నాను. అప్పటిదాకా నేను అనుకున్నట్టు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న అవకాశాలను చూశాను. కానీ, ఐఆర్ఎస్ అధికారి అయిన మామగారు నలుగురికీ ఉపయోగపడేలా ఇంకేదైనా చేయొచ్చేమో ఆలోచించమన్నారు. ఇక్కడి ఓ చిన్న శానిటరీ న్యాప్కిన్ యూనిట్‌ను చూసిరమ్మని సలహా ఇచ్చారు. నిజంగానే అప్పటికే ఫ్యాషన్ రంగంలో చాలామంది ఉన్నారు. వీధివీధికీ బొటిక్‌లు ఉన్నాయి. దాంతో ఆయన సలహా నాకు నచ్చింది. చేతితో న్యాప్కిన్లు చేసే ఆ చిన్న యూనిట్‌ను చూశాను.
అయితే అది నాకు అంత శుభ్రమైన పద్ధతిలా అనిపించలేదు. దాంతో మెషినరీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అనుకున్నా. దాని కోసం పూణె, నాగ్‌పూర్‌లాంటి చోట్ల ఉన్న పెద్ద యూనిట్లకు వెళ్లాను. ముంబయిలో జరిగిన ఓ ఎగ్జిబిషన్లో చైనాకు సంబంధించిన మెషినరీని చూశా. వాళ్లతో మాట్లాడి చైనా వెళ్లి యంత్రాలు, పనితీరు తెలుసుకున్నాక, ముడిసరుకు గురించీ అధ్యయనం చేశా. ఈ పనులన్నిటిలో మా వారు నాకు తోడుగా ఉన్నారు. ఒక మంచి అవగాహన వచ్చింది అనుకున్నాక 2019 నవంబరులో దుండిగల్‌లో నా పేరు మీదుగానే ‘మహేశ్వరి ఇండస్ట్రీస్’ పేరిట మా తయారీ యూనిట్‌ను ప్రారంభించాం. ఇంగ్లిష్‌లో ఆత్మవిశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఆ అర్థం వచ్చేలా మా ఉత్పత్తులకు ‘కాన్ఫిడేస్’ అనే పేరు పెట్టాం.
మా ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వానికి నివేదించడంతో మంచి సబ్సిడీని ఇచ్చి ప్రోత్సహించింది. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావలసిన అనుమతుల ప్రక్రియ అంతా చాలా సులభంగా పూర్తయ్యింది. మా ఫ్యాక్టరీలో మహిళలనే ఉద్యోగులుగా నియమించుకోవాలని తద్వారా పేదలైన కొంతమంది ఆడవాళ్లకైనా సాయం చేయవచ్చని ప్రారంభించినప్పుడే అనుకున్నా! అలా ప్యాకింగ్ సెక్షన్ కోసం తొలుత 10 మంది ఆడవాళ్లను నియమించుకున్నాం. ఇప్పుడా సంఖ్య 75కు పెరిగింది. మహిళలకు పట్టులేని మెషిన్ ఆపరేటింగ్ సెక్షన్స్‌లో మాత్రమే మగవాళ్లున్నారు. ఇక, చాలా స్టార్టప్లలాగే మాకు కూడా మొదట్లో ఒడుదొడుకులు తప్పలేదు. ఆర్డర్ల కోసం ప్రభుత్వాలను సంప్రదించడం, ఎన్జీవోలతో కలిసి పనిచేయడం, అప్పటికే పేరెన్నికగన్న బ్రాండ్లతో సంప్రదింపులు జరపడం… ఇలా రకరకాల ప్రయత్నాలు చేశాం.
రెండేండ్ల పాటు మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ గురుకులాల్లోని దాదాపు 38 వేల మంది పిల్లలకు ప్రభుత్వం తరఫున తక్కువ ధరకు మా శానిటరీ న్యాప్కిన్లను అందజేశాం. ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించాం. ఎన్జీఓల సాయంతో గ్రామాల్లోనూ, పాఠశాలలు, కాలేజీల్లో రుతుక్రమానికి సంబంధించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని వేలమంది పిల్లలు, మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను అందజేశాం. అన్నట్టు టీఎస్ ఐపాస్‌లోని సంస్థలకు సంబంధించి ఆ ఏడాది సెకండ్ బెస్ట్ స్టార్టప్‌గా కేటీఆర్ గారి చేతుల మీదుగా అవార్డునూ అందుకున్నా.
మావారు ఎస్బీఐ మేనేజరుగా పనిచేసేవారు. సంస్థ ప్రారంభం నుంచీ ప్రతి విషయంలోనూ ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. బిజినెస్ కాస్త పెద్దదయ్యాక ఆయన ఉద్యోగం మానేసి వ్యాపారం చూసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం మా ఫ్యాక్టరీలో రోజుకు 7.5 లక్షల వరకూ న్యాప్కిన్లు తయారవుతున్నాయి. ముందు ముందు చిన్నపిల్లలతోపాటు వృద్ధుల కోసమూ డైపర్లు తయారు చేయాలనుకుంటున్నాం. ఈ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మాలాంటి ఆంత్రప్రెన్యూర్లు మరింతమంది తయారయ్యే అవకాశం ఉంటుంది.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– రజనీకాంత్ గౌడ్