గారాబంగా ఎత్తుకుని లాలించే తల్లి.. జోలపాడలేదు. మురిపెంగా గుండెల మీద పడుకోబెట్టుకునే నాన్న.. ఊ కొట్టేలా కథలు చెప్పలేడు. పోనీ అక్కతో ముచ్చట్లాడుదామా అంటే.. తనదీ మౌనభాషే! మాటలు రాని వారి దైన్యం.. ఆ చిన్నారి బాల్యాన్ని మూగరోదనగా మార్చేసింది. బాల్యంలో మౌనంతో యుద్ధం చేసిన ఆమె.. నిశ్శబ్దాన్ని జయించింది. సైగల భాషను నేర్చుకొని ఇంట్లోవాళ్లకు మరింత దగ్గరైంది. బధిరులకు పాఠాలు చెప్పే బాధ్యతను తీసుకుని.. వాగ్దేవి అనిపించుకుంది రమ్య మిర్యాల. బధిరులకు సైన్ లాంగ్వేజ్‌లో ఇంటర్, డిగ్రీ విద్యనందిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ‘డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకురాలు రమ్య ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మన కుటుంబంలో ఎవరైనా ఒకరు ఏదైనా లోపంతో పుడితే జీవితాంతం బాధపడతాం కదా! అలాంటిది మా ఇంట్లో ముగ్గురిది అదే పరిస్థితి. అమ్మానాన్న, అక్క ముగ్గురూ పుట్టుకతో మూగవాళ్లు. ప్రేమను పంచే అమ్మానాన్న, మంచి చెడులు చెప్పే అక్క అస్సలు మాట్లాడలేరు. వాళ్ల భావాలను మాతో పంచుకోవాలని ఎంత ఆశ పడినా అర్థం కాని దుస్థితి. అందుకే అమ్మానాన్నలాగా బాధపడే చెవిటి, మూగవారికి తోడుగా నిలిచేందుకే ఈ డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నా. తర్వాత అన్నామలై యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో పీజీ సోషల్ సర్వీస్ చేశా. విదేశాలకు వెళ్లి పై చదువులు చదుకోవాలని.. అక్కడే ఉద్యోగం చేయాలని చిన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ, అమ్మానాన్నల పరిస్థితి చూసి వాళ్లకోసం ఇక్కడే ఉండిపోయాను. నా తోబుట్టువులైనా అమ్మానాన్నతో ఉంటారనుకుంటే మా అక్క కూడా బధిరురాలే! వాళ్లందరినీ విడిచి ఎక్కడికీ వెళ్లాలనిపించలేదు.

అమ్మానాన్నలిద్దరు పుట్టకతోనే మూగవాళ్లు. మలక్‌పేటలో ఉన్న మూగ, చెవిటి పాఠశాలలో చదువుకున్నారు. అలా వాళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. మౌనంగా ప్రేమించుకున్నారు. సైగలతోనే భావాలను పంచుకున్నారు. అమ్మకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. నాన్నకు ఆర్టీసీలో కొలువొచ్చింది. వాళ్లు పనిచేసే ప్రదేశాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేక సతమతమయ్యేవారట. వాళ్ల మధ్య పెరిగిన నాకు మాత్రం వాళ్ల సైగలకు అర్థాలు ఇట్టే తెలిసిపోయేవి. సైన్ భాష లోతుల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ముంబయిలోని సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సంస్థలో రెండేళ్లపాటు కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను. అలా అమ్మానాన్నకు మరింత దగ్గరవ్వొచ్చనే ఆలోచన నాది. ఆ సమయంలోనే జేఎస్కే రావు బధిరుల కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఆయన కన్నుమూసిన కొన్నిరోజులకు జేఎస్కే రావు ఆలోచనలు బతికించేందుకు నీలాంటి వాళ్లు ముందుకొస్తే బాగుంటుందని అమ్మ సలహా ఇచ్చింది. ఆ సమయంలో అమ్మ చేసిన సైగ నా గమ్యాన్ని నిర్దేశించింది.
మూగ, చెవిటి వారికి నావంతు సేవ చేసేందుకు 2004 నుంచి 2009 వరకు డెఫ్ వే ఫౌండేషన్‌లో ఉద్యోగినిగా పనిచేశాను. ‘మనం కూడా ఇలాంటి వారికోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేద్దామని’ అప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న సందీప్ తన అభిప్రాయాన్ని నాతో పంచుకున్నాడు. ఆయన మాటలతో ఏకీభవించి.. ఆ మంచి పనిలో నేనూ భాగమయ్యా. అలా 2009లో డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన మా సంస్థ పదోతరగతి పాసైన డెఫ్ విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్లో సీఈసీ, డిగ్రీలో బీకామ్ కంప్యూటర్ కోర్సులను అందిస్తుంది. వాటితో పాటు స్కిల్స్ డెవలప్మెంట్, ఇతర కంప్యూటర్ కోర్సులు నేర్పుతున్నాం. మా దగ్గర శిక్షణ పొందిన వారికి టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలూ కల్పిస్తున్నాం. పలువురు ప్రభుత్వ ఉద్యోగాలను సైతం సాధించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న 12 సెంటర్లలో 7,200 మంది విద్యార్థులు శిక్షణ తీసుకున్నారు. వీళ్లకు తరగతులు చెప్పే ట్రైనర్లలో 90 శాతం మంది ఆ కేటగిరికి చెందినవారే కావడం విశేషం.
నా సాధకబాధకాలు పంచుకుందామంటే నా తోబుట్టువు కూడా మాట్లాడలేదు. తనతో నా ఆలోచనలు పంచుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక అక్కతో గంటల తరబడి మాట్లాడేస్తున్నా. అక్క తనలాంటి వ్యక్తినే ప్రేమించి పెండ్లి చేసుకుంది. వారి పిల్లలు కూడా మా దగ్గరే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. వాళ్ల ఆలోచనలు తెలియాలంటే వాళ్లలాగా మారిపోవాల్సిందే. కొన్నాళ్ల కిందట నాన్న కన్నుమూయడంతో అమ్మ ఒంటరైంది. ఆ ఒంటరితనాన్ని దూరం చేయడానికి నేను ఆఫీస్‌లో ఉన్నా కూడా అరగంటకోసారి వీడియో కాల్ చేసి అమ్మను సైగలతోనే పలకరిస్తుంటా. ఆ సమయంలో తను పొందే రిలాక్సేషన్ నాకు అమ్మ కండ్లల్లో తెలిసిపోతుంటుంది.

మేము ట్రైనింగ్ ఇచ్చే పిల్లలందరూ మా ఇన్స్టిట్యూట్లో ఉన్నంతసేపు ఎలాంటి ఆత్మనూన్యతా భావం లేకుండా హాయిగా ఉంటారు. వారు నేర్చుకున్న విషయాన్ని సైగలతో వివరిస్తారు. జోకులు వేసుకుంటారు. గలగలా నవ్వేస్తుంటారు. కానీ, ఈ పిల్లల్లో చాలామంది ఇంటికి వెళ్లాక ఒంటరిగా ఫీలవుతున్నారు. లోపంతో పుట్టిన ఈ పిల్లలతో వారి తల్లిదండ్రులు అన్యమనస్కంగా ఉండటమే దీనికి కారణం! ఈ పిల్లలేం తప్పు చేయలేదు కదా! అలాంటి వారిని చిన్నచూపు చూడటం సరైన పద్ధతి కాదు. ఉపాధి అవకాశాల కోసం మనం ఎన్నో భాషలు నేర్చుకుంటున్నాం కదా! జర్మన్ అనీ, ఫ్రెంచ్ అనీ మనకు సంబంధం లేని భాషల్లో పాండిత్యం సంపాదిస్తున్నాం కదా!
అలాంటిది మన పిల్లల కోసం సైన్ భాష నేర్చుకోవడానికి నామోషీ ఎందుకో అర్థం కాదు. ఇలాంటి లోపం కలిగిన చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు కూడా సైన్ భాష నేర్చుకుంటే.. పిల్లలకు ఒక భరోసా కలుగుతుంది. వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ప్రస్తుతం మన దేశంలో కోటి మందికిపైగా బధిరులు ఉన్నారు. వారి కోసం మొబైల్ యాప్స్‌ను (DEF-ISL, EDUSIGN academy) అందుబాటులోకి తెచ్చాం. వారి అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ఆప్షన్స్ పొందుపరిచాం. ఇప్పటి వరకు మా సంస్థలో విద్యార్థులకు డిగ్రీ వరకే విద్యను అందించాం. అతి త్వరలో ఎంబీఏ కోర్సు ప్రారంభించనున్నాం. బధిరుల కోసం యూనివర్సిటీ స్థాపించి వారికి ఉన్నతమైన చదువు అందివ్వాలన్నదే మా అంతిమ లక్ష్యం.
-రాజు పిల్లనగోయిన
– కె.సాయిబాబా