‘నాన్నా ఎన్నిసార్లు ఆపరేషన్లు చేయిస్తారు? ఈ నొప్పిని మళ్లీ మళ్లీ ఎంతకాలం భరించాలి? ఒకేసారి నన్ను చంపేయండి. ఈ నొప్పి నుంచి విముక్తి కలిగించే మందు చావు ఒక్కటే నాన్నా’ అని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేముందు తండ్రిని వేడుకుంది ఓ బిడ్డ. ఏడాది జీతమంతా ఆమె వైద్యానికే ఖర్చు చేసినా ఎముకల్ని గుల్ల చేసే ఆమె రోగాన్ని మాత్రం తగ్గించలేకపోయాడా తండ్రి. అయితేనేం నిరంతరం మానసిక స్థయిర్యాన్ని అందిస్తూ ఆమెను ప్రయోజకురాలిని చేశాడు. అందమైన బొమ్మలు చేస్తూ కళాకారిణిగా ఎదిగిన ఆమెను, అడ్మిషన్ ఇమ్మంటే నిరాకరించిన పాఠశాలలు, కళాశాలలే జీవిత పాఠాలు చెప్పాలంటూ ఆహ్వానిస్తున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం అందుకున్న ఆ ధీశాలి పేరు రాధిక. ఊరు కోయంబత్తూరు. ఆమెకు అంత పేరుప్రఖ్యాతులు ఎలా వచ్చాయో తెలుసా?
కొన్ని జబ్బులు మందులకు తగ్గుతాయి. కొన్ని మాత్రం వైద్యానికి లొంగకుండా మనిషిని కుంగదీస్తాయి. రాధికది రెండో రకం సమస్య. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక అందరు అమ్మాయిల్లా ఆడుతూ పాడుతూ పెరగలేదు. ఎదిగే వయసులో ఆమె ఎముకలు బలహీనమైపోయాయి. అయిదేండ్ల ప్రాయంలో మొదటిసారి రాధిక ఎముక విరిగింది. అప్పుడు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ తర్వాత మూడు నెలలు బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తొమ్మిది నెలలు గడిచిన తర్వాత అదే కాలు మరో చోట విరిగింది. ఏడాది తర్వాత ఇంకోసారి విరిగింది. ఎముకలు పెళుసుబారే వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఏ చిన్న పనిచేసినా ఎముకలు విరిగిపోయే పరిస్థితి వచ్చింది. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి రాధిక బాల్యాన్ని ఇంటికే పరిమితం చేసింది. బడి కూడా మానేసింది.
ఇంట్లో ఉన్నా రాధికకు బాధలు తప్పలేదు. కదిలే ప్రయత్నం చేస్తే ఎముకలు విరిగేవి. భయంతో నడవడం మానేసింది. మంచం మీదే కాలం గడిపేది. కిటికీలోంచి వీధుల్లో ఆడుకునే స్నేహితుల్ని చూస్తూ ఉండేది. అందరూ పొద్దున బడికి, సాయంత్రం ట్యూషన్లకు పోతుంటే, తను మాత్రం హాస్పిటల్‌కు వెళ్తుండేది. రోజంతా వీల్ చెయిర్‌లోనే ఉండేది. అవసరమైతే వాకర్ సాయంతో చిన్నగా ఇంట్లోనే అడుగులు వేసేది. ఈ రోగం పూర్తిగా నయం కావడం సాధ్యం కాదని కూడా వైద్యులు చెప్పారు. వాళ్ల నాన్న టెక్స్టైల్ మిల్లులో సూపర్వైజర్గా పని చేసేవారు. ఆయన ఏడాదంతా సంపాదించిన జీతం మొత్తం ఆమె సర్జరీలకే ఖర్చయ్యేవి. వాటిని భరిస్తూ… రాధిక ఇంటి పట్టునే ఉంటూ ఇంటర్ వరకు చదువుకుంది. ఎన్నోసార్లు ఈ బాధలు పడలేక చనిపోయినా బాగుండునన్న ఆలోచనలు చేసేది.
పిల్లలకు బొమ్మలేయడం అంటే ఇష్టం ఉంటుంది. అలాగే తనూ పెన్సిళ్లతో చిత్రాలు గీయడం మొదలుపెట్టింది రాధిక. కొన్నాళ్లకు అందులో ఆరితేరింది. టీవీలో పిల్లల కోసం వచ్చే వినోద కార్యక్రమాల్లోని కొన్ని యానిమేటెడ్ బొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి. రాధిక ఆసక్తిని గమనించిన వాళ్ల అన్నయ్య రాజ్‌మోహన్ యూట్యూబ్‌లో కొన్ని ఆఫ్రికన్ బొమ్మలనూ చూపించాడు. అవి ఎంతగానో నచ్చడంతో, పేపర్‌తో వాటికి ప్రతిరూపాలను తయారు చేసింది. ఆ ప్రయత్నమే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఒక్క కాగితంతోనే కాదు, లోహపు తీగలతోనూ ఆఫ్రికన్ బొమ్మలను తయారు చేయడం ప్రారంభించింది. వాటికి వాళ్ల అన్నయ్య రంగులద్దాడు. ఆ బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉండటంతో ఇరుగుపొరుగు వాళ్లు కొనడం మొదలుపెట్టారు. పాకెట్ మనీతో రంగులు కొని, బొమ్మలు తయారు చేస్తూ చిన్నగా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రాజ్‌మోహన్ స్నేహితుడు ఈ బొమ్మల పట్ల ఆసక్తితో తన స్టాల్లో వాటిని ప్రదర్శనకు పెట్టాడు. వారం రోజుల్లోనే పాతిక బొమ్మలు అమ్ముడయ్యాయి. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తను చేసిన బొమ్మలు అమ్మడం కోసం 2018 నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ ఇన్‌లాంటి వేదికల్ని ఉపయోగించింది. సోషల్ మీడియాలో ఈ బొమ్మలు చూసి ఊటీలోని ఓ వ్యాపారి పాతిక బొమ్మలు ఆర్డర్ చేశాడట. అది కూడా చిన్న బొమ్మలు కాదు మూడున్నర అడుగుల బొమ్మలు.
ఆ బొమ్మలను తన హోటల్ అలంకరణకు ఉపయోగించాడు. అప్పటి నుంచి ఆమెకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని చేస్తూ కొత్తగా తన కళను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పోయింది రాధిక. పెరుగుతున్న ఆర్డర్లకు తగ్గట్టు పనిచేస్తూనే విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. బొమ్మలు చేసే పేపరు నాణ్యమైనది ఉండాలని అంటుందామె. ‘నేను చేసే బొమ్మలు నా ఎముకల్లా పెళుసుగా ఉండకూడదు. ఆ బొమ్మ విరిగిపోకూడదు’ అంటూ దాన్ని బలపరుస్తుంది. వినియోగదారుల ఇష్టాన్ని బట్టి కస్టమైజ్డ్గా బొమ్మలు చేస్తున్నది. ప్రతి నెల 30 నుంచి 50 బొమ్మలదాకా చేస్తున్నది. ఈ పనుల్లోపడి ఆమె రోగాన్నే మర్చిపోయి గంటల తరబడి బొమ్మల తయారీలో గడుపుతున్నది. రాధిక వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. పేపర్ బొమ్మల తయారీలో ప్రత్యేకమైన శైలిని సాధించింది. క్యారికేచర్ల లాంటి తన బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసింది. వివిధ వృత్తులు, వాళ్ల ఆహార్యం, ఉపకరణాలను జోడించి మరిన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తున్నది.
‘లాక్డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో ఉండిపోయారు. కొద్ది రోజులు ఇంటిపట్టున ఉండడానికే ఆనాడు ఎంతో బాధపడ్డారు. కానీ, నా జీవితమే లాక్డౌన్. నేనెంత బాధపడి ఉంటానో అర్థం చేసుకోండి. ఇంట్లోని టీవీతోనే కాలక్షేపం. ఇంట్లో ఎప్పుడూ కూర్చుని ఉండడం వల్ల నా వెన్నెముక వంగి పోయింది. దానిని ఆపరేషన్ చేసి సరి చేశారు. ఎముకలు విరగకుండా నాలుగు లోహపు రేకులతో తయారు చేసిన తొడుగులను కాళ్లకు తొడిగి, కర్ర సాయంతో నడుస్తున్నాను. నేను ఏ ప్రాంతానికీ, ఏ దేశానికీ పోలేకున్నా నా బొమ్మలు పోతున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటున్నది రాధిక. ఇరుగింటి వాళ్లతో మొదలైన బొమ్మల వ్యాపారం ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల దాకా విస్తరించింది. దేశంలోని 24 రాష్ర్టాలతోపాటు ఆరు దేశాలకు తన ఆఫ్రికా బొమ్మలు ప్రయాణించాయి. ఆమె పట్టుదల, ఉత్సాహాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నుంచి ఆహ్వానం అందుకుంది రాధిక. ఆయనను కలిసినప్పుడు ఆఫ్రికన్ పేపర్ బొమ్మను కానుకగా ఇచ్చింది. విద్యార్థుల్లో మనోధైర్యం నింపడాకి తన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని వివరించేందుకు రాధికను పాఠశాలలు, కళాశాలలు ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు తన శారీరక పరిస్థితిని చూసి చేర్చుకునేందుకు నిరాకరించిన పాఠశాలలు కూడా ఆమెను పిలిచి ఉపన్యసించమని అడుగుతున్నాయి. అవమానం ఎదుర్కొన్నచోటే గౌరవం పొందిన రాధిక తనదైన బొమ్మల ప్రపంచాన్ని నిర్మించుకుంటూ, వ్యాపారంలో రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నది.