చిన్నప్పుడు నేర్చుకున్న కుట్టుపని ఆమెకు ఆర్థిక భరోసానిచ్చింది. ఆసక్తితో నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వ్యాపారవేత్తగా నిలిపింది. ఈ రెండు యంత్రాల మధ్య మరచట్రం కన్నా వేగంగా పరుగులు తీసిందామె. పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కాలం మొరాయించేది. భారంగా కదిలే కాలానికి ఓవర్ హాలింగ్ చేసి తనకు అనుకూలంగా మలుచుకునేది. వస్త్ర వ్యాపారంలో ఎంబ్రాయిడరీకి ఉన్న డిమాండ్‌ను గుర్తించి అటుగా అడుగులు వేసిందామె. తన దారిలో ఎందరినో నడిపిస్తున్నది. కుట్టు యంత్రం నుంచి కనికట్టు చేసే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషీన్ అమ్మకాల వరకు సాగిన సిరిగణేష్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకురాలు పుట్ట మహాలక్ష్మి ఈ వారం మన స్టార్టప్ స్టార్. తన విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
సీకో చీరల పుట్టిల్లు గద్వాల్ మా ఊరు. మధ్యతరగతి నేత కార్మికుల కుటుంబం. మా ఆయన పేరు ఆనంద్‌బాబు. వారింట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. అనుకోని సంఘటనలు, ఒడుదొడుకుల స్థితిగతులు ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా నన్ను అడుగులు వేయించాయి. అమ్మగారింట్లో నేర్చుకున్న కుట్టుమెషీన్తో నా ప్రయాణం మొదలైంది. తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అమ్మకాలు, బ్యూటీ పార్లర్ నిర్వహణ ఇలా నా ప్రస్థానం కొనసాగింది. మొదట్లో ఆటంకాలు పలకరించాయి. అయినా నిరుత్సాహపడలేదు. నేను సాధించగలను అన్న నమ్మకం నన్ను నడిపించింది. అలా సిరిగణేష్ ఎంటర్‌ప్రైజెస్‌తో ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తాను.
మొదట్లో నేను కుట్టుమెషీన్ పట్టుకున్నప్పుడు అందరూ ఎందుకు? అన్నవారే! ఇంటి పనులు చూసుకుంటే చాలు అని అడ్డుపడ్డవారే. కానీ, ఏదైనా సాధించాలనే తపన, తెలిసిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను తీరికగా ఉండనివ్వలేదు. వెంటనే తెలిసిన వారి దగ్గర కుట్టుమెషీన్ అద్దెకు తీసుకొని టైలరింగ్ మొదలుపెట్టాను. ఎంత కష్టపడ్డా మా ఆర్థిక అవసరాలకు సరిపడా సంపాదించలేకపోయాను. లాభం లేదనుకొని హైదరాబాద్‌కు మకాం మార్చాను. ఇక్కడికి వచ్చాక డ్రెస్ మెటీరియల్ దుకాణంలో టైలరింగ్ చేశాను. అప్పట్లో బ్యూటీ పార్లర్స్‌కు చాలా డిమాండ్ ఉండేది. దీంతో కాస్మెటాలజీలో శిక్షణ తీసుకున్నా. ఏడాదిలోపే ఇంటి దగ్గరే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశాను. అందులోనే డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతూ, టైలరింగ్ చేసేదాన్ని.
నాలుగు రాళ్లు వస్తున్నాయని అక్కడే ఆగిపోతే ఈ రోజు సిరిగణేష్ ఎంటర్ప్రైజెస్ ఉండేది కాదు. నిరంతరం పరిశ్రమ కొనసాగిస్తేనే విజయం వరిస్తుంది. టైలరింగ్‌కు అనుబంధంగా ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, చీరలపై పెయింటింగ్ చేయాలనిపించింది. అదే నా వ్యాపారం అవుతుందని అప్పుడు అనుకోలేదు. పైగా అప్పట్లో సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీకి బాగా గిరాకీ ఉండేది. ఆ పని చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉండేవారు. దీంతో ఎలాగైనా ఎంబ్రాయిడరీ మెషినరీ కొనాలని ఫిక్సయ్యాను. నేను సొంతంగా సంపాదించుకున్న బంగారం అమ్మేశాను. మా తమ్ముడు రూ.2 లక్షలు సమకూర్చాడు. ఆ మొత్తంతో సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీ మెషినరీ కొని మరో ప్రయాణం మొదలుపెట్టాను.
అంచెలంచెలుగా ఎదుగుతూ 2011లో సిరిగణేష్ ఎంటర్ప్రైజెస్ సంస్థను ప్రారంభించాను. మా దగ్గర కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాలు విక్రయిస్తాం. మార్కెట్లో అందుబాటులో ఉన్న యంత్రాల విడిభాగాలను తెప్పించి, వినియోగదారులు కోరిన విధంగా పూర్తిస్థాయి యంత్రంగా డెవలప్ చేసి ఇస్తాం. ప్రస్తుతం ఒక్కో యంత్రం ధర రూ. 3 లక్షల నుంచి రూ. 7లక్షల వరకు ఉంది. వినియోగదారులకు యంత్రాలు విక్రయించి చేతులు దులుపుకోం. వృత్తి నైపుణ్యాలను పెంపొందించేలా ప్రోత్సహిస్తాం. ఎంబ్రాయిడరీ డిజైన్లపై అవగాహన కల్పిస్తాం. అంతేకాదు యంత్ర నిర్వహణలో పూర్తి శిక్షణనిస్తాం. మెషీన్ డెలీవరీ, ఇన్స్టలేషన్తోపాటు ఏడాదిపాటు వారి వ్యాపారం కొనసాగించేందుకు అవసరమైన ఓరియంటేషన్ ఇస్తాం. ఈ తరహా సేవలు అందించే సంస్థలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. కానీ, వినియోగదారులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం మా ప్రత్యేకత. ఇప్పటివరకు దాదాపు 2,000 యంత్రాలను విక్రయించాం. దేశవ్యాప్తంగా మాకు కస్టమర్లు ఉన్నారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలే మా సంస్థ ఎదుగుదలకు కారణం. అంతేకాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలమంది మహిళలు సిరిగణేష్ సంస్థ ద్వారా ఉపాధి పొందుతుండటం సంతోషాన్నిస్తున్నది. సంస్థ పనితీరును ప్రశంసిస్తూ టైమ్స్ బిజినెస్ అవార్డు, సుమన్ ఆర్ట్స్ అవార్డులు వరించాయి.
వ్యాపారంలో కుదురుకునే సమయంలో మల్టీ నీడిల్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. అదెలా నిర్వహించాలో తెలియలేదు. సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీకి గిరాకీ తగ్గిపోవడంతో నేను గతంలో కొన్న యంత్రాన్ని నష్టానికి అమ్మేయాల్సి వచ్చింది. ఆ నష్టాలన్నీ పూడ్చుకున్న తర్వాత అధునాతన టెక్నాలజీతో పనిచేసే మల్టీ నీడిల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషినరీపై అధ్యయనం చేశాను. కస్టమైజ్డ్ విధానంలో అవసరానికి తగినట్లుగా మెషీన్ డిజైన్ చేసుకుని వ్యాపారాన్ని కొనసాగించాను.