లాంగ్ రైడింగ్ చేయాలంటే ఏ స్పోర్ట్ బైకో లేక బుల్లెటు మీదనో వెళుతుంటారు కదా.
పాత బైక్‌పై దూరపు ప్రయాణాలు చేయాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. కానీ ఈ కుర్రోడు చేసి చూపించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం ఉమ్లింగ్ లా చేరుకొని గిన్నిస్ రికార్డు సైతం కైవసం చేసుకున్నాడు పురాణం సాహిత్ కుమార్. నాన్న నడిపి వదిలేసిన ఆ బండి మీద భారతదేశం మొత్తం చుట్టొస్తానని చెబుతున్న ఈ యువకుడు లడఖ్ యాత్రా విశేషాలు ‘బతుకమ్మ’తో పంచుకున్నాడు..
మాది సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మ గృహిణి. బీటెక్ పూర్తిచేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయంటారు కదా. నా చిన్నప్పుడు మా నాన్న సైకిల్ మీద నన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పుతుంటే చాలా మురిసిపోయేవాణ్ని. మా చుట్టుపక్కలవాళ్లు బండ్లు కొనుకున్నా కూడా 2009 వరకు మా నాన్న సైకిల్‌పైనే సవారి చేశారు. పైసాపైసా పోగు చేసి 2009లో ప్యాషన్ ప్రో తీసుకున్నాడు. దానిపై అమ్మనాన్నలతో కలిసి బంధువుల ఇంటికి, దేవాలయాలకు వెళుతుంటే నాకు భలే ఆనందంగా ఉండేది. ఆ బండితో నాకు తెలియకుండానే ఓ బంధం ఏర్పడింది.
కొన్నాళ్లకు నాన్న కొత్తబండి కొనుకున్నా.. పాతది మాత్రం నాకు ప్రత్యేకం. దాని మీదే నేను ప్రతిరోజూ కాలేజీకి వెళ్లేవాణ్ని. కొన్ని ట్రావెలింగ్ వీడియోలు చూసిన నాకు ఈ బైక్ మీద లాంగ్ జర్నీ చేయాలని అనిపించింది. ఆ విషయం ఇంట్లో చెబితే.. ‘బుద్ధిగా ఉద్యోగం చేసుకోక ఇవేం కోరికలం’టూ వద్దన్నారు. అయినా కూడా వాళ్లను ఒప్పించి ఏడాదిన్నర క్రితం ప్యాషన్ ప్రో బండి మీద ఆయోధ్యకు వెళ్లాను. అదే నా మొదటి బైక్ యాత్ర. అక్కడినుంచి కాశీకి వెళ్లొచ్చాను. ఆ తరువాత హంపి వెళ్లాను. తిరుపతికి కూడా వెళ్లొచ్చాను.

ఇలా ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గమైన లడఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్ గురించి తెలిసింది. 5729 మీటర్ల ఎత్తున ఉన్న మార్గమది. చాలామంది బైకర్స్ అక్కడికి వెళ్లాలని కోరుకుంటారట! కానీ, మధ్యలోనే వెనుతిరుగుతారట. నేను మాత్రం ఎంత కష్టమైనా, నా బండి మీద ఉమ్లింగ్ లాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకొని ఇలాంటి ఆసక్తి ఉన్న నా మిత్రులు నిఖిత్, అజిమ్లకు చెప్పాను. వాళ్లు కూడా వస్తామనడంతో ముగ్గురం కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యాం.
బయటికి ఆత్మవిశ్వాసంతో ఉన్నా లోపల మాత్రం చలికి తట్టుకోగలుగుతానో, లేదో? బండి మధ్యలో ఆగిపోతుందేమో అన్న అనుమానాలూ రాకపోలేదు. మొత్తానికి ఈ ఏడాది ఏప్రిల్ 12న తాడ్బంద్ హన్మాన్ దేవాలయం నుంచి మా యాత్ర ప్రారంభించాం. మే 16 వరకు కొనసాగించాం. దాదాపు 3,000 కిలోమీటర్లు సాగిన మా ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయి. నా స్నేహితులవి కొత్త బండ్లు, నాదేమో చాలా పాతది! సెల్ఫ్ కూడా లేదు. అయినా కూడా వాళ్లతో సమానంగా డ్రైవ్ చేశాను.
జమ్మూ కశ్మీర్ వరకు మా యాత్ర సాఫీగానే సాగింది. ఆ తరువాత లడఖ్ ప్రాంతానికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడ రోడ్లన్నీ కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఉష్ణాగ్రతలు మైనస్ 15 డిగ్రీలకు చేరాయి. మా ప్రయాణంలో ప్రతిరోజూ ఐదువందల కిలోమీటర్లకు తక్కువ కాకుండా ముందుకు సాగాం. రాత్రుళ్లు చిన్నటెంట్లు ఏర్పాటు చేసుకొని పడుకునేవాళ్లం. కొన్నిసార్లు లాడ్జీల్లో గడిపాం. కొన్ని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోతే బాగుండు అని అనిపించింది. వాటిలో ముఖ్యంగా… ఓ గ్రామానికి చేరుకుంటున్న సమయంలో రాళ్లు, దుమ్ము మధ్యలోంచి ప్రయాణం చేశాం. పైగా కొండవాలు నుంచి రాళ్లు పడుతుంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముందుకు సాగాం. హాన్లీ అనే గ్రామానికి వెళుతుంటే 6 గంటల తరువాత ఆ దారి మూసేశారు.
రోడ్డు మరమ్మతు పనుల కోసం కొండల్లో బాంబులు పెట్టి పేల్చుతున్నారట. చీకటి పడుతుంటే.. గ్రామంలోకి వెళ్లనివ్వమని బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బ్రో)వాళ్లను బతిమిలాం. చివరికి వాళ్లు జాగ్రత్తలు చెప్పి పంపించారు. మొత్తానికి ఎలాగో అలా హాన్లీ గ్రామానికి చేరుకున్నాం. మైనస్ డిగ్రీ టెంపరేచర్లో శరీరం గడ్డకట్టుకు పోతుందా అనిపించేది. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోదామా అన్న ఆలోచనలు వచ్చేవి! కానీ, నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకుసాగాను.
మా ప్రయాణంలో చాలామంది ఆదరించారు. హాన్లీలో మాకు గది ఇచ్చిన యజమాని ఉచితంగానే టీ, స్నాక్స్, ఆహారం ఏర్పాటు చేసింది. లడఖ్ ప్రాంతంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. కొన్ని లాడ్జీలు సైతం ఉచితంగా మాకు వసతి కల్పించాయి. ఈ యాత్ర నాలో చాలా మార్పు తెచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 100 సీసీ ఇంజిన్ బైక్‌తో ఉమ్లింగ్ లా చేరుకున్న మొట్టమొదటి బైకర్‌గా గిన్నిస్ రికార్డు సాధించాను. వెళ్లేటప్పుడు అమ్మానాన్న చాలా టెన్షన్ పడ్డారు. గిన్నిస్ రికార్డుతో తిరిగొచ్చాక ఎంతో సంతోషిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే బండిపైన భారతదేశం మొత్తం చుట్టిరావాలన్నదే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన