కరోనా ఎందరి కలలనో ఛిద్రం చేసింది. మరెందరి జీవితాలనో మొత్తంగా మార్చేసింది. కొవిడ్ దెబ్బకు కొందరు కుదేలైతే.. మరికొందరు కొత్త అవకాశాలు సృష్టించుకొని తామేంటో నిరూపించుకున్నారు. బిహార్‌కు చెందిన ప్రిన్స్ శుక్లా రెండో కోవకు చెందుతాడు. ఇంజినీరింగ్ చదివిన శుక్లాకు బెంగళూరులో ఐటీ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే.. స్విట్జర్లాండ్‌లో స్కాలర్షిప్ ఆఫరూ వచ్చింది. ఆ ఆనందంలో ఉండగానే కరోనా ఘంటికలు మోగాయి. స్విట్జర్లాండ్ ఆఫర్ వెనక్కి వెళ్లింది. ఐటీ ఉద్యోగం ఊడింది. గంపెడాశలతో బెంగళూరుకు వెళ్లిన శుక్లా.. బండెడు కష్టంతో బిహార్‌లోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇరుగు పొరుగు శుక్లాను ఫెయిల్యూర్ కింద జమకట్టారు.
నాలుగు రోజుల్లోనే పుంజుకున్నాడు శుక్ల. తండ్రిని అడిగి ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. రైతులకు అండగా ఏదో చేయాలనుకున్నాడు. సన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, సేంద్రియ ఎరువులు అందిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అగ్రేట్ పేరుతో సంస్థను నెలకొల్పి.. సాగుబడిలో మేలైన దిగుబడి ఎలా సాధించాలో రైతులకు మార్గదర్శనం చేశాడు. గ్రాఫ్టింగ్, మల్టీ క్రాపింగ్, సస్టయినబుల్ ఫార్మింగ్ తదితర పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాడు.
మూడేండ్లు తిరక్కుండానే… అగ్రేట్ సంస్థ పదివేల మంది రైతుల అభిమానం చూరగొన్నది. ఆ రైతుల ఉత్పత్తులను మార్కెట్ చేసే స్థాయికి చేరుకుంది. మారుమూల పల్లెల్లో రైతులు పండించే పంటలను ఏకంగా ఐటీసీ, గోద్రెజ్, పార్లె లాంటి భారీ సంస్థలు నేరుగా కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాడు శుక్ల. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు తాను కూడా ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాడు. కేవలం లక్ష రూపాయలతో ప్రారంభమైన అగ్రేట్ సంస్థ ఐదేండ్లు తిరిగేసరికి రూ.2.5 కోట్ల టర్నోవర్ సాధించింది. అంతేకాదు, రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తూ శుక్ల అందరివాడు అనిపించుకుంటున్నాడు. హ్యాట్సాఫ్ టు ప్రిన్స్ శుక్ల!