చాలామందికి సినిమాలంటే ఇష్టం. కానీ, ఆ యువకుడికి మాత్రం ప్యాషన్. సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో కృష్ణనగర్ బాట పట్టాడు. ఒక్క అవకాశమూ దక్కించుకోలేకపోయాడు. తనను తాను నిరూపించుకునేందుకు రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సందేశాత్మక నాటికలు ప్రదర్శిస్తూ నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు సింగపంగ ప్రభాకర్. రంగస్థల కళాకారుడిగా తాను చేస్తున్న
కృషికి గాను ఈ ఏడాది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జేఎల్ నర్సింగరావు స్మారక ‘రంగస్థల యువ పురస్కారం’ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..

మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామం. అమ్మానాన్నలిద్దరూ మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాళ్లు. పొలం పనులు లేనప్పుడు నాన్న మేస్త్రీ పనికి వెళ్తుండేవారు. నాకు చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. నటించాలనే కోరిక ఉండేది. ఎన్టీయార్, ఏయన్నార్ సినిమాలు టీవీలో వస్తే ఎన్ని పనులున్నా, ఎంత రాత్రైనా నిద్రపోకుండా మరీ చూసేవాణ్ని. సినిమాలతో పాటు వీధి నాటికలపైనా ఆసక్తి ఎక్కువే. పీర్ల పండుగకు మా నాన్న ‘సాహెబ్’ వేషం వేసినప్పుడు నేను కూడా అలాంటి గెటప్‌లు వేయాలని అనుకునేవాణ్ని. ఒకవైపు సినిమాలు, నటనలపైన ఇష్టం పెంచుకుంటూనే మరోవైపు నా చదువును కొనసాగించాను. నేను డిగ్రీలో ఉండగా కళాశాల వార్షికోత్సవానికి మా లెక్చరర్ల ప్రోత్సాహంతో తొలిసారి నాటిక వేశాను. నా డిగ్రీ పూర్తయ్యేవరకు ప్రతి కార్యక్రమంలో నా నాటిక ప్రదర్శన ఉండేది.
తొలి నాటికతోనే గుర్తింపు డైరెక్షన్ అవకాశాల కోసం హైదరాబాద్ బాటపట్టాను. ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలులేకపోవడంతో ఒక్క అవకాశం కూడా తలుపు తట్టలేదు. నటుడిగానైనా రాణించాలని ప్రయత్నాలు చేశాను. అయినా ఫలితం శూన్యం. నిరాశతో కుమిలిపోతున్న నాకు నా మిత్రుడొకడు కలిసి… యాక్టింగ్ నేర్చుకుంటే అవకాశాలు వస్తాయని చెప్పాడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న థియేటర్ ఆర్ట్స్ కోర్సు గురించి చెప్పాడు. వెంటనే అందులో మాస్టర్ ఆఫ్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎంపీఏ)లో చేరాను. అక్కడే నా జీవితంలో మరో శకం మొదలైందని చెప్పొచ్చు. అప్పటివరకు నాలో నాటించాలనే కోరిక ఉన్నా.. ఎలా యాక్టింగ్ చేయాలో తెలియదు. ఈ కోర్సు ద్వారా నాలోని నటుడు బయటికి వచ్చాడు. ఎంపీఏ చేసేటప్పుడు ‘కాలజ్ఞానం’ నా తొలి నాటిక. అందులో ఆత్మానుజరావు అనే వృద్ధుడి పాత్ర పోషించాను. దానికి మంచి గుర్తింపు వచ్చింది. అలా పీజీ చేస్తున్నప్పుడే ముప్పైకి పైగా నాటికల్లో నటించాను. రెండు నాటికలకు దర్శకత్వం వహించాను.
ఉత్తమ డైరెక్టర్‌గా కోర్సు పూర్తిచేసుకొని బయటికి రావడంతోనే 2017 అక్టోబర్‌లో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవంలో ఊసరవెల్లి నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించాను. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాటకమిది. ఆ తరువాత కరోనా కష్టకాలంలో మన ధైర్యాన్ని గుర్తుచేస్తూ మరో నాటిక రాసి, దర్శకత్వం వహించి రవీంద్రభారతిలో ప్రదర్శించాను. ఇప్పటివరకు 14 నాటికలు రాశాను. 30 నాటికల్లో వివిధ పాత్రలు పోషించాను. అవి వందసార్లకు పైగా ప్రదర్శనకు నోచుకున్నాయి.
నాటికలతోపాటు షార్ట్‌ఫిల్మ్‌లు కూడా ప్రారంభించాను. ఇతరుల ముందు చేయి చాచొద్దని నాటకాల ద్వారా సంపాదించిన డబ్బుతోనే వాటిని నిర్మించాను. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘అపరాధం’ కథ ఆధారంగా ‘ కుమారి’ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాను. 2022లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీలో ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకుంది. ఆ తరువాత 2023లో నిర్మించిన ‘సిపాయి’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నాను. దానితోపాటు ‘డెకో డెకో నాటక్ డెకో’ అంటూ రంగస్థల కళాకారులపై పాటను రచించి దర్శకత్వం వహించాను.

అమ్మానాన్నలు నన్ను ఏదైనా ఉద్యోగంలో చూడాలనుకున్నారు. కానీ, నేను మాత్రం నాకు నచ్చింది చేస్తానని చెప్పాను. మొదట్లో వద్దన్నా తరువాత ఎదుగుదల చూసి ఆనందపడుతున్నారు. నా ఈ ప్రయాణంలోనూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. కొన్నిసార్లు క్యాటరింగ్ చేస్తూ జీవితాన్ని గడిపిన రోజులున్నాయి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్‌లో మైమ్ నిపుణుడిగా పనిచేశాను. ఉచిత శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో ‘సింగపంగ థియేటర్ గ్రూప్’ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాను. హైదరాబాద్‌లోని బస్తీల్లో, గ్రామాల్లో ఇప్పటివరకు 6 వర్క్‌షాపులు నిర్వహించాను. ఎన్నటికైనా తెలుగు సినిమా దర్శకుడిగా ఎదగాలన్నదే నా ముందున్న లక్ష్యం.
రంగస్థలంలో రాణిస్తున్న నాకు సినిమా అవకాశాలు సైతం వచ్చాయి. రెండు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. రంగస్థల నటుడిగా నా కృషిని గుర్తిస్తూ.. ఈ ఏడాది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు జేఎల్ నర్సింగరావు స్మారక ‘రంగస్థల యువ పురస్కారం’ అందించారు. నేను చదువుకున్న చోటే.. పురస్కారం అందుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా!
– రాజు పిల్లనగోయిన