‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతులతో కెమెరా పట్టుకుంది మేకల లక్ష్మమ్మ. చదువు రాని ఈ పల్లెటూరు పెద్దమ్మ కెమెరాను భుజానికెత్తుకొని రైతు బతుకును హృద్యంగా ఒడిసిపట్టింది. దేశదేశాలూ తిరిగి ఎన్నెన్నో వీడియోలు తీసి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, చిరు ధాన్యాల ప్రయోజనాలు ఇలా పది మందికీ ఉపయోగపడే ఎన్నో వీడియోలను తీసింది. నేటికీ ఎక్కడ విత్తనాల ఎగ్జిబిషన్ జరిగినా.. కెమెరాతో సిద్ధంగా ఉండే ఈ మట్టితల్లిని ‘జిందగీ’ పలకరించింది.
మాది న్యాల్కల్ మండలంలోని హుమ్నపూర్ గ్రామం. పెద్దలు సంపాదించిన రెండెకరాల పొలంల ఎవుసం చేసుకునేది. పాతికేండ్ల కిందట దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్లు (డీడీఎస్) మీటింగ్ పెడితే పోయినా. మా చుట్టున్న ఊర్లనుంచి ఆడోళ్లంతా హాజరైర్రు. అక్కడికొచ్చిన డీడీఎస్ డైరెక్టర్ సతీష్ సార్ మా అందరిని పలుకరించుకుంటా ‘మీరేమేం పంటలు పండిస్తరు? ఏడాదంతా ఏం పనులు చేస్తరు?’ అని అడిగిండు. ఆ సారు ముందర మాట్లాడాలంటే అందరు భయవడ్డరు. నేనే ధైర్యం చేసి నిలబడి ‘మా దగ్గర తైజొన్నల సీజన్ అయిపోతే పనేం ఉండది సారు. మా దగ్గర గట్టు జాగుంది. గట్టు పొడ్త చెట్లు పెట్టాలని అనుకుంటున్నమ’ని చెప్పిన. నా మాటలను మెచ్చుకొని రూ.20 ఇనాం ఇచ్చిండు. పర్యావరణానికి చెట్లు అవసరమని.. వాటి నుంచి వచ్చే ఫలాలు చాలా విలువైనవని వివరించిండు. ఆ సారు తోడ్పాటుతో చెట్లు పెట్టుకున్నాం. ఆ తరువాత మళ్లొకసారి మీటింగ్ పెట్టిండు. అప్పుడు దసరా పండుగ రోజులు. ‘మేము ఆ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటం. కొత్త పెట్టుకుంటం. మీటింగ్ జల్దిన ఒడగొట్టుకొని పోతమంటే’ దాని గురించి సారు అడిగిండు. మా పండుగ గురించి నేను చెబుతుంటే రికార్డు చేసుకొని అప్పటికే ఏర్పాటైన మా సంఘం రేడియోల వినిపించిండు.

డీడీఎస్లో సభ్యురాలిగా చేరి ఉన్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటుంటే మళ్లొకపారి మీటింగ్ పెట్టి.. మండలానికి ఒకరు వీడియో తీసుడు నేర్చుకోవాలని సతీష్ సారే చెప్పిండు. మాచునూర్‌లో డీడీఎస్ కెమెరామెన్ క్లాస్‌లకు మా మండలం నుంచి నన్ను పంపించిర్రు. మాకు వీడియో తీసుడు నేర్పించడానికి బొంబాయి నుంచి మనిషిని రప్పించిర్రు. మాకేమో చదువురాదు. వాటి పేర్లు కూడా తెలువది. తిప్పలు వడి మరీ వాటి పేర్లు నేర్చుకున్నాం. మొత్తానికి నాతోపాటు ఎనిమిది మందికి ఆరు నెలల్లో వీడియో తీయడం నేర్పించిర్రు. ఎప్పుడూ తాకని వస్తువులను చేతుల్లోకి తీసుకొని మేమే వీడియోలు తీస్తుంటే సంబురమనిపించింది. మా తొమ్మిది మందిమి కలిసి మిగతా గ్రామాల్లోని డీడీఎస్ సభ్యులకు వీడియోలు తీసుడు నేర్పించినం. నేనైతే అదనంగా రెండు గ్రూపులకు నేర్పించిన. ఒక గ్రూప్‌లో 30 ఏండ్లలోపు వాళ్లుంటే, మరో గ్రూప్‌లో 40 ఏండ్లలోపు మహిళలు ఉన్నారు.
కెమెరా ఉమెన్ కావాలనే ఆలోచనే నాకు లేకుండే. ఏదోలా నేర్చుకున్నామనే ఆనందంతోపాటు తరువాత ఏం చేయాలనే ఆలోచనలు కూడా మొదలైనయి. గప్పుడే మా ఏరియాలో బయోడైవర్సిటీ విత్తనాల మేళా నిర్వహించిర్రు. మొత్తం కవరేజ్ మేమే చేయాలని చెప్పిర్రు. మాకు అప్పజెప్పిన మొదటి పని కావడంతో చాలా నేర్పుగా తీసినం. ఆ వీడియోలు చూసి చాలామంది మంచిగతీసిర్రు అని మెచ్చుకున్నరు. అప్పటివరకు మా ఏరియాలోనే విత్తనాలు, పంట పొలాల వీడియోలు తీసిన మేము వరంగల్ బీటీ పత్తి నాణ్యతను చెప్పడానికి పోయినం. పత్తి సాగు మీద వీడియోలు తీసి శభాష్ అనిపించుకున్నం. ఆ వీడియోలు చూసిన అప్పటి కేంద్ర సర్కార్ మాకు అవార్డు కూడా అందించింది. ఆ తరువాత అనంతపురం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలపై, నీటి సద్వినియోగం మీద డాక్యుమెంటరీ చేసినం. కేరళ, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సైతం వీడియోలు తీసిన.

మిగతావాళ్లకంటే నేను కాస్త భిన్నంగా ఆలోచించేదాన్ని. రైతులు తాము పండించిన పంటలు వివరించే సందర్భంలో, వాటిని శుధ్ది చేసేటప్పుడు వీడియోలు తీయాల్సినప్పుడు.. ముందుగాల్నే ఇట్ల చేయాలని వాళ్లకు చెప్పేది. నా పనితనం మెచ్చి విదేశాలకు కూడా పంపించిర్రు. జర్మనీ, బాలీ, సింగపూర్, కెనడాలో సాగు విధానాలపై వీడియోలు తీసిన. అట్ల విదేశాలకు పోయి వీడియోలు తీసినప్పుడు మస్తు సంతోషం అనిపించింది. నేనేంది.. దేశాలకు పోవుడేంది! గిసొంటి రోజు వస్తదని అస్సలు ఊహించలేదు. కానీ, డీడీఎస్ సహకారంతో నా టాలెంట్‌ను నిరూపించుకున్న. అక్కడ వీడియోలు తీస్తుంటే అందరు ఆశ్చర్యపోయేది. వాళ్ల గుర్తుగా సన్మానాలు చేసి, ఫొటోలు కూడా తీసుకున్నరు. వీడియోగ్రాఫర్‌గా రాణించిన అతికొద్ది రోజుల్లోనే దాన్ని ఎడిటింగ్ చేయడం కూడా నేర్చుకున్నా. ఈ సంఘంలో చేరి వీడియోగ్రాఫర్‌గా ఎదగడం వల్ల వచ్చిన వేతనాన్ని జమ చేసుకొని ఎకరంన్నర పొలం కొనుక్కున్న.
తెలంగాణ వచ్చినాంక కేసీఆర్ సార్ గుర్తించి నాకు రూ.లక్ష బహుమతి ఇచ్చి, సన్మానించిర్రు. అది నా బతుకంతా యాదికుంటది. ఎట్లాంటి అంశాలను వీడియోలు తీయాలనేది మొదట్లో సతీష్ సారే చెప్పినా.. ఆ తరువాత నేనే కొన్ని సొంతంగా షూట్ చేసి వాటిని బులిటెన్లుగా మార్చినా. నేను నేర్చుకున్న రోజుల్లో స్టోరెజీ కోసం క్యాసెట్లు వాడెటోళ్లం. ఇప్పుడొచ్చిన చిప్ సిస్టమ్ కూడా నాకు తెలుసు. ఇప్పటివరకు నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా. నా కాళ్లు చేతులు ఆడినన్ని రోజులు మరో నలుగురికి వీడియోలు తీసుడు నేర్పిస్తా.
– రాజు పిల్లనగోయిన