గుండె బలమే కాదు కండబలమూ మహిళల సొంతమని నిరూపిస్తున్నదామె.సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు,సెలెబ్రిటీల చుట్టూ ఎప్పుడూ మగ బౌన్సర్లే ఉండటాన్ని ప్రశ్నించి, గెలిచిందామె! దేశంలోనే తొట్టతొలి మహిళా బౌన్సర్‌గా రికార్డు సాధించడమే కాదు, తానే బౌన్సర్లను తీర్చిదిద్దే సంస్థనూ స్థాపించింది. బాలీవుడ్ స్టార్లు సహా గాయకులు, రాజకీయ ప్రముఖులకు సేవలందిస్తున్నది. నల్లని చొక్కా, కండలు తిరిగిన దేహంతో ఢిల్లీలోని నైట్ క్లబ్‌కి కాపలాగా నిలబడే మెహరున్నీసా షౌకత్ అలీని చూస్తే ధైర్యానికి ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఆడపిల్లలు చదువుకోవడమే తప్పు అనే కుటుంబం నుంచి వచ్చిన ఆమె… ఎదగాలన్న తపన ఉంటే ఎవరూ అడ్డుకోలేరంటూ తన సాహసగాథను ఇలా చెబుతున్నది.
Mehrunnisa Shaukat Ali | ముప్పై ఏడేండ్ల మెహరున్నీసాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్పూర్. నలుగురు ఆడపిల్లలు ఉన్న దిగువ మధ్య తరగతి కుటుంబంలో రెండో కూతురు తను. ఆడపిల్లలు చదవడమంటే పాపమే అని భావించే తండ్రి రాత్రిపూట కరెంటు తీసేసేవాడు. అయినా చదువుకుంటే పుస్తకాలు తగలబెట్టే ప్రయత్నాలూ చేసేవాడు. అతణ్ని ఎదిరించే ధైర్యం ఆ తల్లికి లేదు. కానీ బిడ్డలు చదువుకుంటే బాగుంటుందన్న ఆశ మాత్రం ఉండేది. ఆ కొద్ది ప్రోత్సాహమే మెహరున్నీసాకి దన్ను అయింది. చదువుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. టీనేజీలోనే పెళ్లి చేసుకున్న అక్క కష్టాలు చూసి ఆమె వణికిపోయేది. తన జీవితం అలా కాకూడదనీ అనుకునేది. కానీ పన్నెండో ఏటనే ఆమెకూ పెండ్లి సంబంధం చూశారు. తీరా పెండ్లికి ముందు ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. కొన్నాళ్లపాటు మంచానికే పరిమితమైంది. కోలుకున్నాక తాను ఎలాగైనా జీవితంలో మంచి స్థానంలో ఉండాలని గట్టిగా సంకల్పించుకుంది చిన్నారి మెహరున్నీసా. ఎవరేమన్నా, ఎలాంటి కష్టం ఎదురైనా తన బతుకు తాను బాగా బతకాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆ సంకల్పమే నేటికీ ఆమెలో కనిపిస్తుంది. ఆ బలం తనలాంటి ఎందరిలోనో ధైర్యం నింపుతున్నది కూడా.
చిన్ననాటి నుంచి కాస్త దృఢంగా ఉండే మెహరున్నీసాకు సైనికుల్ని చూస్తే ఆరాధనా భావం. రక్షణ విధుల్లో కనిపించే పోలీసులన్నా ఆమెకు ఇష్టం. దాంతో తానూ ఆ రంగాల్లో పనిచేయాలని అనుకునేది. అందుకే స్కూల్లో ఎన్సీసీ క్యాడెట్‌గా చేరింది. కరాటే నేర్చుకుంది. శారీరక దృఢత్వం మీద దృష్టి పెట్టింది. తనను తాను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకునేది. అయితే తన కోరికను దగ్గరి వారికి చెప్పినప్పుడు ఆడపిల్లలను ఆ ఉద్యోగాల్లో తీసుకోరు అని చెప్పారట. దీంతో ఆర్మీలో చేరేందుకు నోటిఫికేషన్ తేదీలు వచ్చినప్పుడు ఆమె దరఖాస్తు చేయలేకపోయింది. ఆ విషయానికి తాను ఎంతో దిగులుపడింది. కానీ ఏం చేయాలన్నదీ పాలుపోలేదు.
ఓసారి ఏదో పనిమీద కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లినప్పుడు కొంతమంది కండల వీరులు ఓ ఈవెంట్‌కి కాపలా కాస్తుండటం చూసింది. ఎవరా అని ఆరా తీస్తే వాళ్లను బౌన్సర్లు అంటారని తెలిసింది. తాను కూడా అలా నిలబడి జనాన్ని అదుపు చేస్తూ, అవసరమైన వారికి రక్షణగా ఉండాలని కోరుకుంది. అందుకే ఈసారి తెలిసిన వాళ్లూ దగ్గరి వాళ్లను కాకుండా నేరుగా దానికి సంబంధించిన సంస్థనే అడిగింది. తాను వాళ్లతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు చెప్పింది. దీంతో ఆమెను సెక్యూరిటీ గార్డ్‌గా తీసుకున్నారు.
కుటుంబంలో, సమాజంలో వివక్షను ఎదుర్కొన్న ఆమెకు ఈ ఉద్యోగంలోనూ అదే కనిపించింది. అసలు అక్కడ ఆడవాళ్లను బౌన్సర్లుగానే పిలవరు. మగవాళ్లకు మాంసాహారం పెట్టేవారు. ఆడవాళ్లకి శాకాహారమే. రక్షణ పరంగా ప్రధానమైన ప్రాంతాల్లోనూ స్త్రీలను ఉంచేవారు కాదు. వీటన్నిటి విషయంలోనూ ఆమె పోరాడింది. ఉద్యోగ పరంగానూ కొన్ని నిబంధనలను కాలదన్ని మరీ తనను తాను నిరూపించుకుంది. సెలెబ్రిటీల దగ్గరి వలయంలో ఉండి, జనాన్ని నిలువరించడంలో తానూ ఏమాత్రం తీసిపోనని రుజువు చేసుకుంది. యాజమాన్యంతో, తోటి వారితో పోరాడి మరీ తన హోదాను బౌన్సర్‌గా మార్చుకుంది మెహరున్నీసా.
అలా ఆమె దేశంలోనే తొట్టతొలి మహిళా బౌన్సర్‌గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. పకడ్బందీ రక్షణ కల్పించడంలోనూ, బార్లు, పబ్లలాంటి చోట్ల జరిగే గొడవల్ని సద్దుమణిగేలా చేయడంలోనూ, డ్రగ్స్‌లాంటి నిషేధిత పదార్థాలను గుర్తించి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తూనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంలోనూ ఆమె బాగా పేరుపొందింది. ఈ రంగంలో బెదిరింపులు ఎక్కువే. ప్రాణాలే పోతాయంటూ మాట్లాడేవారూ ఉంటారు. వాటికి తాను ఎప్పుడూ వెరవనని చెబుతుందామె. ఈ రంగంలోకి తాను రావడమే కాదు, మరింత మంది ఆడవాళ్లు రావాలని కోరుకుంది. అందుకే ఈ రంగానికి సంబంధించిన ఓ సంస్థనూ స్థాపించింది.
బౌన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాక మరో ఇద్దరు మిత్రులతో కలిసి సొంతంగా ‘మర్దానీ బౌన్సర్ అండ్ డాల్ఫిన్ సెక్యూరిటీ సర్వీసెస్’ పేరిట ఒక సంస్థను స్థాపించింది మెహరున్నీసా. దాని ద్వారా ఆమె 2500 మంది దాకా మహిళలు, పురుషులకు బౌన్సర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా శిక్షణను అందించి వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా నియమితులయ్యేలా చేసింది. అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, రాణీ ముఖర్జీ, దీపికా పదుకొణె, రణ్‌బీర్ కపూర్‌లాంటి బాలీవుడ్ స్టార్లకు ఆమె సేవలందించింది. నిజానికి ఆమె చెల్లికి కూడా పన్నెండేండ్లకే పెండ్లి చేశారు. ముగ్గురు పిల్లలు పుట్టాక, చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరింది. తండ్రి వ్యాపారమూ దెబ్బ తినడంతో ఇప్పుడు కుటుంబం మొత్తాన్నీ మెహరున్నీసానే చూసుకుంటున్నది.
తన చివరి చెల్లెలినీ బౌన్సర్‌ను చేసింది. ఆనాడు ఆడపిల్ల అడుగు బయట పెట్టడానికి వీలు లేదన్న తండ్రే ఇప్పుడు ఆమె గురించి గొప్పగా చెబుతున్నాడు. ‘ఢిల్లీలోని నైట్‌క్లబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న సంగతి చాలా రోజులు ఇంట్లో వాళ్లు సహా ఎవరికీ చెప్పలేదు. అలా చెప్తే వద్దంటారనే భయం. నిజానికి నేను ఆర్మీలో చేరకపోవడానికీ ఎదుటి వాళ్ల ఆలోచనలే కారణం. నేను మరోసారి వాళ్ల భావజాలం వల్ల ఇబ్బంది పడదలుచుకోలేదు.
కొంత సమయం గడిచాక వాళ్లకి విషయం చెప్పాను. చుట్టుపక్కల వాళ్ల నుంచి కూడా సూటిపోటి మాటలు పడ్డాను. కానీ నేను మాత్రం వెనకడుగు వేయలేదు. అందుకే నేను ఇవాళ నన్ను నేను చూసుకుంటూ, నా కుటుంబాన్నీ కాపాడుకోగలుగుతున్నా. మనకు బలం ఉండటమే కాదు, అది ఉన్నట్టు ఎదుటి వారికి కనిపించాలి. అందుకే ఇలా కండలు కనబడేలా శరీర నిర్మాణాన్ని మలచుకున్నా. ఏ రంగమైనా ఇష్టం ఉంటే చాలు మనం గెలవగలం అని నేను నమ్ముతాను. అదే నలుగురికీ చెబుతాను’ అంటుంది మెహరున్నీసా. కండ బలం, గుండె బలాల మేలు కలయిక మెహరున్నీసా అని అంటే ఎవరైనా కాదనగలరా చెప్పండి!