‘రాధమ్మ కూతురు’లో శ్రుతిగా ఏడిపించినా, ‘ప్రేమ ఎంత మధురం’లో మానసిగా విలనిజం పండించినా ఆమెకే చెల్లింది. బుల్లితెరపై యంగ్ విలన్‌గా రాణిస్తున్న నటి మహేశ్వరి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఆమె నిజ జీవితంలో మాత్రం ‘నేను చాలా రిజర్వ్డ్ అండ్ ట్రెడిషనల్’ అంటున్నది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్లో చిత్రగా అలరిస్తున్న మహేశ్వరి ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు..
నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. స్కూల్, కాలేజీ డేస్‌లో కల్చరల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. మాది గుంటూరు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అప్పుడే మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో చదవుతుండగా.. ప్రెష్ టాలెంట్ కోసం వెతుకుతున్నారని తెలిసి ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడికి చాలామంది వచ్చారు. లక్కీగా ఆ సీరియల్లో నాకు ఆఫర్ వచ్చింది. అలా నా మొదటి సీరియల్ ‘నా కోడలు బంగారం’లో నటించా. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నేను నటించిన సీరియల్స్ అన్నీ దాదాపు మూడేండ్లకు పైగా ప్రసారమయ్యాయి. టాప్ రేటింగ్స్ సాధించాయి. యాక్టింగ్ చేస్తూనే.. చదువు కంటిన్యూ చేశా. ‘రాధమ్మ కూతురు’ సీరియల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత ‘ప్రేమ ఎంత మధురం’లో చేసిన మానసి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్లో చిత్ర పాత్రలో నటిస్తున్నా.
సీరియల్స్‌లో చేస్తానంటే మొదట్లో నాన్న ఒప్పుకోలేదు. ఆయనకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చి షూట్లో పాల్గొన్నా. టీవీలో సీరియల్ టెలికాస్ట్ అయ్యేవరకూ చెప్పలేదు. నాన్నను కన్విన్స్ చేయడానికి అమ్మ ప్రయత్నించింది. అయినా, ఆయన ససేమిరా అన్నారు. ‘నేను అన్నం తినన’ని భీష్మించేసరికి ఒప్పుకొన్నారు. ఇప్పుడు నాన్న చాలా హ్యాపీ. నేను ఫస్ట్ టైమ్ షూట్లో పాల్గొన్న రోజు హై ఫీవర్ వచ్చింది. చాలా భయపడ్డాను. ఆ సీరియల్లో హీరోయిన్ సుహాసిని గారు. దానికి నిర్మాత కూడా ఆవిడే! నేను భయపడటం చూసి.. ధైర్యం చెప్పారు. ఒక లిప్‌స్టిక్ బహుమతిగా ఇచ్చారు. ఇప్పటికీ అది నా మేకప్ కిట్లోనే ఉంది.
తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో మద్దతు ఉండదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. నిజంగానే కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు కూడా! కానీ జీ తెలుగు నాకు మంచి అవకాశాలు ఇస్తూనే ఉంది. ఆ సపోర్ట్‌తోనే నటించగలుగుతున్నా. నా ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంటున్నది. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్లో నేను చేసిన మానసి పాత్రలో అప్పటికే ఇద్దరు యాక్టర్స్ మారారు. మూడో వ్యక్తిగా నన్ను తీసుకున్నారు. మొదట్లో కొంచెం భయపడ్డాను. ఆ పాత్రకి సరిపోయేలా బాడీలాంగ్వేజ్, మేకోవర్కి వారం రోజులు పట్టింది. డైరెక్టర్ వెంకట్ గారు నన్ను బాగా గైడ్ చేశారు. సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒప్పుకోవట్లేదు. నాకు సీరియల్స్ చేయడమే ఇష్టం. ఒక ఉద్యోగంలా కంఫర్ట్‌గా ఉండేలా వర్క్ ప్లాన్ చేసుకుంటా. సోషల్ మీడియాలో కూడా నా లిమిట్స్‌లోనే ఉంటాను. ఫ్యాన్ పేజెస్ నుంచి చాలా మెసేజెస్ వస్తుంటాయి. వీలైనప్పుడు వాళ్లతో మాట్లాడుతుంటా.
నా డ్రెస్సింగ్, హెల్త్ అంతా అమ్మనే చూసుకుంటుంది. పబ్ కల్చర్, ఎక్స్పోజింగ్ అస్సలు నచ్చవు. ట్రెడిషనల్‌గా ఉండటానికి ఇష్టపడతా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘డ్రెస్ సెన్స్ లేదు, మేకప్ వేసుకోవడం రాదు’ అని కోప్పడేవాళ్లు. రమ్యకృష్ణ గారి మూవీస్ చూడమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. అలా ఆమె నటించిన సినిమాలు చూసి.. ఎలాంటి సీన్స్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది నేర్చుకున్నా. నేను చేస్తున్న నెగెటివ్ క్యారెక్టర్స్‌కి ఇన్స్పిరేషన్ రమ్యకృష్ణ గారే. నన్ను తిట్టినవాళ్లే నాకు అవార్డు వచ్చినప్పుడు మెచ్చుకున్నారు. ఆర్టిస్ట్ అవడం అదృష్టంగా భావిస్తా. ఎప్పుడూ అందంగా తయారవడం మానసిక ైస్థెర్యాన్ని ఇస్తుంది. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు.. కుటుంబమే నా ప్రపంచం. కష్టపడి మంచి ఇల్లు కట్టుకున్నా. నాకు పెంపుడు జంతువులంటే ఇష్టం. 30కి పైగా కుక్కలను దత్తత తీసుకున్నా. రోజూ వాటికి ఆహారం పెట్టడం, వాటి బాగోగులు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది.
– హరిణి