ఒక్క చాన్స్, ఒకే ఒక్క చాన్స్.. అంటూ అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది. ‘నేను పాట రాస్తే వేటూరి గుర్తుకు రావాలి, మాటలు అల్లితే త్రివిక్రమ్ తిరిగి చూడాలి, డాన్స్ చేస్తే ప్రభుదేవా పరుగెత్తుకు రావాలి’.. అని మనసులో మురిసిపోయేవారు ఊరికి పదిమంది. నిజమే, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కానీ వెండి తెర బంగారు తలుపులు తెరుచుకోడానికి ఆ స్కిల్స్ సరిపోవు. శిక్షణ, నెట్వర్కింగ్ ఉండాలి. ‘మీస్కూల్’ ద్వారా సినీప్రెన్యూర్ ప్రతిభ పులిజాల చేస్తున్న ప్రయత్నమూ అలాంటిదే.
సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలంటే ఆసక్తి ఒక్కటే సరిపోదు. నైపుణ్యాలు కూడా ఉండాలి. బండరాయిని తీరుగా చెక్కినప్పుడే శిల్పమైనట్టు.. ఆ ఆసక్తికి కాసింత పరిజ్ఞానాన్ని జోడించుకోవాల్సిందే. అప్పుడే, కొత్తకొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కానీ, సోషల్ మీడియా జమానాలో ఒక్కోసారి క్వాలిటీ లోపిస్తున్నది. ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలపై అవగాహన లేకపోవడమే దీనికంతా కారణమని గ్రహించారు ప్రతిభ పులిజాల. ఆ అంతర్మథనమే ఆమెతో ఫిల్మ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఆ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వ సహకారం తోడైంది. అలా ఓ వినూత్న స్టార్టప్ ప్రాణంపోసుకుంది. మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ఈస్కూల్ (MEE School) ఇప్పుడు వెండి తెరకు మోస్ట్ టాలెంటెడ్ మైండ్స్‌ను అందిస్తున్నది. ఆ ప్రయాణంలోని మజిలీల గురించి ఆమె మాటల్లోనే.. “సెంట్రల్ మూవీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పనిచేసిన అనుభవం, ఫిలిం ఇండస్ట్రీతో నాకున్న అనుబంధం వల్ల కావచ్చు. ఈ రంగంలోనూ వృత్తి నైపుణ్యాలు అవసరమే అనిపించింది. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ వేదికలకు ప్రాతినిధ్యం వహిస్తూనే, టాలీవుడ్‌పై నాకున్న అభిరుచికి అనుగుణంగా ‘సినీప్రెన్యూర్షిప్’ గురించి ఆలోచించాను. నిజమే. ఇది మనకు పూర్తిగా కొత్త మాట. సినిమా అనేది ఓ పెద్ద పరిశ్రమ. వివిధ విభాగాల సమాహారం. అందులోని ప్రతి క్రాఫ్ట్లోంచి కూడా ఓ వ్యాపార అవకాశాన్ని సృష్టించుకోవచ్చు. ఔత్సాహికుల వృత్తి నైపుణ్యాలను కనుక మెరుగుపరిస్తే.. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారనే భావనే మీస్కూల్ దిశగా అడుగులు వేయించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. టీ హబ్ వేదికగా ఎన్నో అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అలానే, నేను కూడా టీ హబ్‌తో కలిసి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ స్కూల్ ఆరంభించాను. ఓ కొత్త ద్వారాన్ని తెరువగలిగాను.
చాలామందిలో సినీ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు ఉంటాయి. ఫొటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, డబ్బింగ్, మేనేజ్మెంట్, మీడియా పీఆర్, ఎడిటింగ్ వంటి అంశాల్లో అవగాహన ఉంటుంది. అయితే ఏ ఒకరిద్దరో పరిశ్రమలో అడుగుపెడతారు. మిగిలిన వారంతా ఆసక్తిని చంపుకొని, అభిరుచిని దూరం చేసుకుని ఇంకేదో రంగంలో స్థిరపడతారు. కారణం, ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. వృత్తి నైపుణ్యాలతోపాటు, మెంటర్షిప్ కూడా అవసరం. అది బయట దొరకదు. మీస్కూల్ ఆ దిశగా సహకరిస్తుంది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలలో వివిధ కోర్సులు అందిస్తుంది. మిగతా ఫిలిం స్కూల్స్‌కు భిన్నంగా.. ఆన్లైన్, ఆఫ్‌లైన్, ప్రాక్టికల్స్ విధానంలో మేం బోధిస్తాం. సమకాలీన టెక్నాలజీని కూడా పరిచయం చేస్తాం. ఇక్కడ శిక్షణ పొందితే సినీ పరిశ్రమలో ప్రవేశానికి పాస్ దొరికినట్టే.
డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో ఎంటర్టైన్మెంట్ రంగం అవకాశాలకు వేదికగా మారింది. స్టార్టప్స్‌కు డిమాండ్ పెరుగుతున్నది. ఏడాదిన్నర కాలం నుంచీ బ్యాచ్‌ల వారీగా శిక్షణనిస్తూ.. ఇప్పటి వరకు 40 మందిని నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు, ఇండస్ట్రీకి కనెక్ట్ చేయగలిగాం. ఇందులో చాలామంది ఇప్పటికే వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఫిలిం చాంబర్, ప్రొడక్షన్ హౌస్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పనిచేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. మేం అందించే పాతిక కోర్సులు పాతిక ఉపాధి మార్గాలు. ఇప్పటికే పరిశ్రమలో ఉన్నవారు కూడా కొత్త సాంకేతికత, కొత్త మార్పులను అందిపుచ్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం. నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలం. అనుకున్నది సాధించగలం.
…? కడార్ల కిరణ్