అవకాశాలు ఆమెను అందలం ఎక్కిస్తుంటే… కొన్ని మూఢాచారాలు ఆడపిల్లను వెనక్కి లాగుతున్నాయి. తమ బిడ్డలను ఉన్నతంగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎందరో! అలాంటి సమాజంలోనే పదిహేనేండ్లు రాకుండానే కూతురికి పెండ్లి చేసి వదిలించుకునే వాళ్లూ ఉన్నారు! ఈ రెండో రకం తల్లిదండ్రుల ఇంట పుట్టింది రోషిణి! పదిహేనేండ్ల వయసుకే 45 ఏండ్లు నిండిన వ్యక్తితో ఏడడుగులూ నడిచింది. కానీ, ఏడాదిలో ఎవరిదారి వారిదైంది. కన్నవాళ్లు, కట్టుకున్నవాడు ఇద్దరూ మోసం చేసినా.. ఆమె కుంగిపోలేదు. తన దుస్థితి మరే ఆడపిల్లకూ రావొద్దనే సంకల్పంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 25 ఏండ్ల రోషిణి పర్వీన్ ప్రయాణం ఇది..
Roshni Parveen | ఓ పదేండ్ల కిందట.. బీహార్‌లోని మారుమూల పల్లెటూరులో 15 ఏండ్ల రోషిణి బడి నుంచి ఇంటికి వచ్చింది. రేపట్నుంచి ఆమెను బడికి వెళ్లొద్దన్నారు తల్లిదండ్రులు. అప్పటికి రోషిణి తొమ్మిదో తరగతి చదువుతున్నది. ‘ఎందుకు వెళ్లొద్దు?’ అని ప్రశ్నించింది. రేపు నీ పెండ్లి అన్నారు ఇంట్లోవాళ్లు. ఓ 45 ఏండ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు. సంసారం అంటే ఏంటో తెలియని బాలికను అత్తారింట్లో వదిలేశారు కన్నవాళ్లు. కొన్నాళ్లకు నెల తప్పింది రోషిణి. పుట్టింటికి వచ్చింది. కాన్పు అయింది. అత్తారింటి నుంచి కబురు రాలేదు. ఏడాది దాటింది. వీళ్లు సంప్రదించినా వాళ్ల స్పందన కరువైంది. పదహారేండ్లకే పొత్తిళ్లలో కొడుకు. ఆ బుజ్జోడి భవిష్యత్తు సంగతేంటి? తన పరిస్థితేంటి? ముడుచుకు కూర్చుంటే బతుకు మారదనుకుంది రోషిణి. సొంతకాళ్ల మీద నిలబడాలని నిశ్చయించుకుంది.
అభం శుభం ఎరుగని వయసులో పెండ్లి చేయొద్దని ఎంత బతిమాలినా ఇంట్లో వాళ్లు వినలేదు. చదువుకుంటానని ఏడ్చినా అర్థం చేసుకోలేదు. ఏడాది వ్యవధిలో రోషిణి జీవితం తలకిందులైంది. ఇక్కడే ఆమె పోరాడాలని నిర్ణయించుకుంది. షాపింగ్ మాల్లో పనికి కుదిరింది. కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూ.. రోజులు వెళ్లదీసింది. తన బిడ్డకు మంచి భవిష్యత్తు అందించాలన్న ఆశతో పనిచేస్తూనే చదువుకోవడం ప్రారంభించింది. మరోవైపు తనలాంటి దుస్థితి మరే ఆడపిల్లకూ రావొద్దని బాల్య వివాహాలను అడ్డుకోవడమే లక్ష్యంగా చేసుకుంది.
2018లో రోషిణి ‘చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరింది. అక్కడున్న మహిళలు కూడా తనలాంటి బాధితులే అని తెలుసుకుంది. ‘మొదట్లో నేనొక్కదాన్నే బాల్య వివాహానికి బలయ్యాను అనుకునేదాన్ని. నా జీవితం మాత్రమే ఇలా ఎందుకైందని ఏడ్చేదాన్ని. కానీ, తర్వాత సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు తెలిసింది నాలాంటి బాల్యవివాహ బాధితులు చాలామందే
ఉన్నారని. వారి కోసం పోరాడాలని అనుకున్నా. మాలా మరే ఆడపిల్లా బాల్య వివాహానికి బలికావొద్దని, ఆడపిల్లల హక్కుల కోసం ఉద్యమించాలనుకున్నా’ అని చెబుతుంది రోషిణి. ఈ క్రమంలో చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. తర్వాత ఆ సంస్థ ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘యూనిసెఫ్’లతో కలిసి చేస్తున్న అవగాహన సదస్సుల్లో క్రియాశీలకంగా పనిచేసింది. ఆ సమయంలోనే ఖగారియా అనే ప్రాంతంలో రోషిణి 12 బాల్య వివాహాలను ఆపగలిగింది.
బాలల హక్కులు, చట్టాలపై మంచి పట్టు సాధించింది రోషిణి. తనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే వాక్పటిమనూ సొంతం చేసుకుంది. ఆమె చేస్తున్న పనికి మద్దతిచ్చేవాళ్లూ పెరిగారు. దాంతో పాఠశాలలు, గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు వివరించడం మొదలుపెట్టింది. సిమల్వారీ, బగల్వారీ, కోచాధామన్ తదితర గ్రామాల్లో వలంటీర్లతో 15 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా పరిసర గ్రామాల్లో ఎక్కడ బాల్య వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నా.. తనకు సమాచారం అందేలా రోషిణి ఒక వ్యవస్థను రూపొందించుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులతో అక్కడికి చేరుకుంటుంది రోషిణి. పెద్దవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆ పెళ్లిని ఆపిస్తుంది. ‘బాల్య వివాహానికి పూనుకున్న తల్లిదండ్రులకు ముందుగా ఇది సరికాదని నచ్చజెబుతాను. నా జీవితాన్నే ఉదాహరణగా చెబుతాను. చాలామంది రియలైజ్ అవుతారు. కొందరు మొండిగా వాదిస్తుంటారు. అప్పుడు డిస్ట్రిక్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారుల సాయం తీసుకుంటాను. వారిచ్చే కౌన్సెలింగ్‌తో చాలామంది తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాన్ని విరమించుకున్నారు’ అని చెబుతున్నది రోషిణి.
రోషిణి చేస్తున్న పనులను బిహార్ ప్రభుత్వం ఎన్నోసార్లు గుర్తించి సత్కరించింది. అంతేకాదు, ఆమె చేస్తున్న నిరంతర కృషికి ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు లభించింది. 2022లో జెనీవాలో జరిగిన యునైటెడ్ నేషన్స్ సదస్సులో రోషిణీని ప్రత్యేకంగా గౌరవించారు. ‘ఈ ప్రయాణంలో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నేను నా భర్తను వదిలేశానని, నా వ్యక్తిత్వం మంచిది కాదని బంధువులతో పాటు ఎంతోమంది, ఎన్నో రకాలుగా అవహేళన చేశారు. ఆ మాటలు ఈటెల్లా మనసుకు గాయం చేసేవి. కానీ, నేను వెనక్కి తగ్గకూడదని అనుకున్నాను. నా వల్ల ఒక్క బాల్య వివాహం ఆగినా.. ఓ ఆడబిడ్డకు నరకం తప్పించినదాన్ని అవుతానని అనిపించేది. అందుకే ఎవరేం అన్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నా. బాల్య వివాహాలు లేని భారతదేశమే నా లక్ష్యం’ అంటున్న రోషిణి.. ఇప్పటి వరకు 60 బాల్య వివాహాలు ఆపగలిగింది. ‘జనతా ఎక్స్‌ప్రెస్ వెల్ఫేర్’ ఫౌండేషన్ స్థాపించి ఎందరికో అండగా నిలుస్తున్నది.