అందాల కిరీటం దక్కాలంటే.. తళుకుబెళుకులు మాత్రమే సరిపోవు. అందమైన మనసు ఉండాలి. స్పందించే హృదయం అవసరం. సమాజాన్ని తన కుటుంబం అనుకోవాలి. ఈ అర్హతలన్నీ ఉన్నాయి కాబట్టే, ఇంటర్వెన్షనల్పల్మనాలజిస్ట్ డాక్టర్ఎంవీ శ్రీకీర్తి మిసెస్ తెలంగాణ, మిసెస్ హైదరాబాద్ హోదా దక్కించుకున్నారు.
ఇప్పటికీ చాలామంది మహిళలు పెండ్లి కాగానే, ఇంటికే పరిమితం అవుతున్నారు. అక్కలూ.. చెల్లెళ్లూ! మీ ఆలోచన మార్చుకోండి. ఏదో ఒక వ్యాపకాన్ని ఎంచుకోండి. వాయిదా వద్దు. తక్షణం రంగంలోకి దిగండి. ఎదుటివారికి రోల్ మోడల్‌గా నిలవండి.
శ్రీకీర్తి తండ్రి రమేశ్‌బాబు సిప్లా ఫార్మాలో ఉద్యోగి. తల్లి రమాదేవి బీఎస్ఎన్ఎల్లో ఇంజినీర్. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. డాక్టరు కావాలన్నది శ్రీకీర్తి కల. సంప్రదాయ నృత్యమూ నేర్చుకునేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఓ రోడ్డు ప్రమాదం ఆమె కలను చిదిమేసే ప్రయత్నం చేసింది. కాలికి తీవ్ర గాయమైంది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో, నాట్య సాధన ఆగిపోయింది. ఇంట్లోనే ఉంటూ మెడికల్ ఎంట్రెన్స్‌కు ప్రిపేర్ అయింది. ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకుంది.
మహిళలు చాలా తక్కువగా ఎంచుకునే పల్మనాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. చదువు తర్వాత, జగిత్యాలలో ఇండిపెండెంట్ చెస్ట్ హాస్పిటల్ ప్రారంభించి ఎంతోమందికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించింది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్‌గా సేవలందిస్తున్నది డాక్టర్ శ్రీకీర్తి.
అందమైన మనసు ‘మనం ఎప్పుడూ, ఎక్కడా ఆగిపోకూడదు. జీవితంలో ఒకటి కోల్పోతే.. మరొకటి సాధించేందుకు ప్రయత్నించాలి. పట్టుదలతో పోరాడాలి. యాక్సిడెంట్ వల్ల డ్యాన్స్‌కు దూరమైన నేను.. ఇతర కళల మీద ఆసక్తి పెంచుకున్నాను. అనుకోకుండా అందాల పోటీలకూ దగ్గరయ్యాను. సౌందర్య కిరీటంతో మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. మన అభిప్రాయాలకు గౌరవం పెరుగుతుంది. అందుకే, వోగ్స్టార్ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్నాను. పదిహేను వందల మందితో పోటీ పడ్డాను. నా నృత్య ప్రతిభను, వైద్యురాలిగా మహిళలకు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని.. నన్ను మిసెస్ తెలంగాణ, మిసెస్ హైదరాబాద్‌గా ప్రకటించారు’ అంటూ తన సౌందర్యయాత్రను వివరిస్తారు డాక్టర్ శ్రీకీర్తి. ఈ విజయం వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం, భర్త శశిధర్, టీఎక్స్ యాజమాన్యం మద్దతు చాలా ఉందని చెబుతారు. ఒంటరి మహిళల కోసం సకల సదుపాయాలతో ఒక శరణాలయం, అనాథ బాలలకు అత్యున్నత ప్రమాణాలతో ఓ బడి.. ఈ రెండూ డాక్టర్ శ్రీకీర్తి రేపటి ఆలోచనలు.
…? సుంకరి ప్రవీణ్‌కుమార్