అమ్మ నేర్పిన పాటలను పదిలంగా దాచుకుందామె. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా పాటతోనే సాగింది. కూలీ పనుల్లో కూని రాగాలు తీస్తూ పాటతో దోస్తానా పెంచుకుంది. పెద్దగా చదుకుంది లేదు. జానపదాలే ఆమె విజ్ఞాన సర్వస్వం. ఆ పల్లె పాటతోనే తన బతుకు బాట పరుచుకుంది మాడపొళ్ల పెద్ద ఉషనమ్మ. సింగర్ ఉషక్కగా మనందరికీ పరిచయమైన ఈ మట్టి పరిమళ స్వరానికి మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వరుస జానపదాలతో దుమ్మురేపుతున్న ఉషక్క.. జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
కేసీఆర్ సారంటే చాలా అభిమానం. ఆయన గురించి ‘ఓ సారూ కేసీఆర్’ పాట పాడినప్పుడు ఏడ్చిన. ఇటీవల తెలంగాణ భవన్‌కు పిలిచి కేటీఆర్ సార్ సన్మానం చేశారు. చాలా సంతోషం కలిగింది. ఆయనకోసం మరిన్ని పాటలు పాడుతాను. ఇప్పటికే కొన్ని రాసుకున్నాను కూడా. ఒకప్పుడు పనికోసం వెతుక్కునే దాన్ని. ఇప్పుడు పాటలే ప్రపంచంగా బతుకుతున్నాను.
మాది నారాయణపేట జిల్లాలోని పెద్ద జెట్రం గ్రామం. నాన్న హైదరాబాద్‌కొచ్చి హమాలీ పనిచేసేది. అమ్మ ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుండేది. అమ్మకు పాటలంటే ఎంతో ఇష్టం. పీర్ల పాటలు, బతుకమ్మ పాటలు, పెండ్లి పాటలు పాడుతుండేది. ‘మాలాగా నువ్వు కావొద్దు బిడ్డ! మంచిగ చదువుకో’ అని నన్ను బడికి పంపించేది. అక్కడ సార్లు పిల్లలను కొట్టడం చూసి భయంతో రెండో తరగతిలోనే చదువు ఆపేసిన. బడికి దూరమైన నాకు అమ్మపాట మరింత దగ్గరైంది. ఆమె దగ్గర నేర్చుకున్న పాటలన్నీ పాడుతుంటిని. వ్యవసాయ పనుల్లో నా చిన్ని చేతులకు అలసటను దూరం చేసింది పాటలే. అలా పని, పాటతో స్నేహం చేస్తున్న నాకు పన్నెండేండ్లకే పెండ్లి చేశారు. నా పెండ్లయిన ఏడాదికే నాన్నకు యాక్సిడెంట్ అవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తర్వాత రెండేండ్లకు అమ్మ కడుపునొప్పి భరించలేక ప్రాణం తీసుకున్నది. ఇల్లరికం వచ్చిన నా భర్త తాగుతూ ఇబ్బందులకు గురిచేయడంతో ఆయనకు దూరమయ్యాను. ఈ వరుస కష్టాల నడుమ నా కొడుకు మరణం మరింత కలచివేసింది. ఆ సమయంలోనూ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా నా చెల్లెను పెంచడం కోసం పనిబాట పట్టాను.

అప్పటికి పాలమూరు జిల్లా అంటే కరువుకు కేరాఫ్‌గా ఉండేది. చేసుకునేందుకు పనులు లేక వలస వెళ్లాల్సిన పరిస్థితి. నా చెల్లెను మా బంధువుల దగ్గరుంచి పొట్ట చేతపట్టుకొని బొంబాయికి వలస పోయిన. అక్కడ రెండేండ్లపాటు దొరికిన పనల్లా చేసి తిరిగి హైదరాబాద్‌కొచ్చిన. ఇక్కడా అదే పరిస్థితి! అడ్డా కూలీగా మారి కష్టపడ్డాను. పెద్దగా పనులు దొరక్కపోవడంతో మళ్లీ వలస జీవితం ప్రారంభించాను. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, డ్యామ్‌ల మరమ్మతు పనులకు కూలీకి వెళ్లేదాన్ని. ఇన్ని కష్టాల్లోనూ పాటను వదల్లేదు. పనిచేసుకుంటూనే నాలో నేనే పాటలు పాడుకునేదాన్ని.
నా స్వరం నచ్చి మహిళా సంఘాల్లో పాటలు పాడేందుకు రమ్మని పిలిచినా.. నా బాధ్యతలు గుర్తొచ్చి వెళ్లలేదు. ఆ తర్వాత నాలాంటి కళాకారులెందరో యూట్యూబ్‌లో పాటలు పాడటం చూసి వాళ్లలాగా నేను కూడా పాడాలని నిర్ణయించుకున్నాను. పాట పాడే అవకాశం కోసం ఎందరినో వేడుకున్నాను. వాళ్లందరిలో నారాయణఖేడ్‌కు చెందిన వెంకటేశన్న నా గొంతు బాగుందని ‘నీ ఇంటి సందునా మా ఇంటి సందున’ పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలా ఐదేండ్ల కిందట నేను పాడిన పాట వరంగల్ స్టూడియోలో రికార్డ్ అయింది. ఆ తర్వాత వరుసగా మూడు పాటలు పాడాను. అవన్నీ మంచి ఆదరణ పొందాయి.

మూడు పాటలు పాడిన తర్వాత మరో అవకాశం కోసం రెండేండ్లపాటు ఎదురుచూశాను. తిరిగి వలస కూలీగా మారినా పనిచేసే ప్రదేశాల్లో కొత్త కొత్త పాటలు పాడేదాన్ని. వాటిని సెల్ఫోన్లో రికార్డు చేసి తెలిసిన వాళ్లకు పంపించేదాన్ని. నా పాటల పిచ్చి చూసి మిగతా కూలీలంతా నవ్వుకునేవారు. మేస్త్రీలు ‘గొప్ప గాయకురాలని’ మజాక్ చేసేవారు. మూడేండ్ల క్రితం రాజమండ్రిలో పనిచేస్తుండగా పాట పాడాలని హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. నాతో పనిచేస్తున్న కార్మికుడి దగ్గర ఐదొందల రూపాయలు అప్పు తీసుకొని హైదరాబాద్ బస్సెక్కిన.
అప్పుడు పాడిన పాటే ‘సీమ దసరా చిన్నోడు’. ఆ పాట మస్తు హిట్టు కావడంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా పాడుతూనే ఉన్నాను. ఒక్కోరోజు రెండు మూడు పాటలు కూడా రికార్డింగ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పటివరకు 300కు పైగా పాటలు పాడిన నేను.. అమ్మ నేర్పిన ‘మా యమ్మోళ్ల ఇంటిలోన’ పాటను పాడుదామనుకున్నా కానీ, వేరే వాళ్లు పాడారు. అయినా కూడా ఆ పాట జానాల్లోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది.

ఒకప్పుడు ‘ఈమేం పాటలు పాడుతది’ అన్నోళ్లే ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు. ప్రారంభంలో స్టూడియో సెటప్ చూసి భయంతో ఒక్క పాటకు పది టేకుల వరకు తీసుకున్నాను. కానీ ఇప్పుడు సింగిల్ టేక్‌లోనే పాడేస్తున్నా. ఈ మధ్యకాలంలో జానపదాలకు క్రేజ్ పెరిగింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆ పాటలను ఆదరిస్తున్నారు. నేను పాడే పాటలో కులాలు, మతాలను విమర్శించకుండా, కొత్త లిరిక్స్‌తో మంచి పాటలు పాడుతున్నాను. అదే ఆచరిస్తాను కూడా. నాకంటూ సంగీత గురువు ఎవరైనా ఉన్నారూ అంటే.. అది మా అమ్మే. ఆమె నేర్పిన పాటలను వెలుగులోకి తీసుకురావాలన్నదే నా ఆలోచన.
– రాజు పిల్లనగోయిన