‘మనం గొప్పగా చదువుకొని ఎదిగితే చాలు’ అని అనుకునే ఈ సమాజంలో ఆ యువకుడు అందరిలా ఆలోచించలేదు. చదువుల తల్లికి దూరమైన అడవి బిడ్డలకు ఓనమాలు నేర్పుతున్నాడు. దారిలేని గూడెంలోకి వెళ్లి అక్షరజ్యోతిని వెలిగించాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారులను పై చదువులకోసమని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తున్నాడు. ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ ప్రారంభించి వనిలో అక్షర కుసుమాలను పూయిస్తున్న ఈస్రం సంతోష్ ‘బతుకమ్మ’తో పంచుకున్న ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
ఈ మధ్య ‘మా మన్యం వీరుడు అల్లూరి నాకు ఆదర్శం’ అంటూ మా విద్యార్థిని తులసి.. డ్రామా జూనియర్ కార్యక్రమంలో వేసిన నాటిక చాలామందిని ఆలోచింపజేసింది. ఇంత చిన్నవయసులోనే గొప్ప ఆలోచనతో ‘మాకు స్కూల్ కావాలి’ అని అక్కడికొచ్చిన మంత్రిని అడిగింది. ఆమె తులసి కోరికను నేరవేర్చింది. చదువుకుంటే ప్రశ్నించొచ్చనే ఆలోచనను మా పాఠశాలే రేకెత్తించింది.
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న నార్లాపూర్ గ్రామం మాది. అందమైన ప్రకృతికి మా ఊరు నెలవు. అయితే నా చిన్నతనంలో వరదల కారణంగా మా ఇల్లు నీట మునిగింది. దాంతో కుటుంబమంతా కొన్నాళ్లపాటు ఊరి దగ్గరున్న అడవిలో చిన్నపాటి గుడిసెలో జీవనం సాగించాం. ఆ సమయంలోనే మాతో పాటు వరదల్లో ఇళ్లు కోల్పొయిన వారందరికి చదువు చెప్పేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ మా గూడానికొచ్చింది. వాళ్ల సహకారంతోనే ప్రాథమిక విద్యను అభ్యసించాను. ఆ తరువాత పై చదువులకు ప్రభుత్వ పాఠశాలలో చేరాను. నాకు చదువంటే ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలొచ్చినా చదువును విడిచిపెట్టలేదు.
ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరాను. సోషియాలజీ, ఎంసీజే కోర్సులు పూర్తి చేసి అందులోనే కొన్నిరోజులు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు కూడా బోధించాను. చదువుకుంటున్న రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో బోధించే పాఠాలకు, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. నా జీవన విధానానికి సంబంధం లేని ఆ పాఠాలు ఎందుకని ప్రశ్నించుకునేవాడిని. మేడారం జాతర పాఠం తప్ప మా గురించి మరెక్కడా రాలేదు.

ఆ రోజుల్లోనే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందరికీ తెలియజెప్పాలని అనుకున్నాను. అందుకోసం ఎంతో ఇష్టంతో ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. కెమెరా పట్టుకొని ప్రకృతి ఒడిలో ప్రయాణం మొదలు పెట్టిన నేను అడవిబిడ్డల జీ‘వన’ సౌందర్యాన్ని విభిన్న కోణాల్లో క్లిక్ మనిపించాను. వాగులు, వంకలను కెమెరాలో బంధించాను. వాటన్నిటితో 2019లో రవీంద్రభారతిలో నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్లో నా ఫొటోలతో ఎగ్జిబిషన్ నిర్వహించాను. అప్పటివరకు నా ఊరికి మాత్రమే తెలిసిన నేను.. ఆ ప్రదర్శనతో నాకంటూ సొంత ఇమేజ్‌ని సంపాదించుకున్నాను. ఆ ఫొటోలు చూసినవారంతా ఎంతో మెచ్చుకున్నారు. నేను ఫొటోగ్రఫీ చేస్తున్న సమయంలోనే ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలనుంచి వలసొచ్చిన గుత్తి కోయలు తారసడ్డారు. వాళ్లను చూస్తే చిన్నప్పుడు మా కుటుంబం ఆడవిలో పడిన కష్టాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. వాళ్ల పిల్లలు చదువుకు దూరం కావడం ఎంతో బాధ కలిగించింది.

బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలంతా చెట్టూపుట్టా అని తిరుగుతూ చిన్నచిన్న పనులు చేయడం చూసిన నాకు వాళ్లకు చదువు చెప్పించాలన్న ఆలోచన మొదలైంది. నాకొచ్చిన ఆలోచన నా స్నేహితుడు శశేందర్ రెడ్డితో పంచుకున్నాను. అతనితో కలిసి 2020లో సుమారు 30 కుటుంబాలు నివసించే నీలంతోగు ప్రాంతంలో ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో పాఠశాల ప్రారంభించాను. అక్కడున్న ఓ మేకల దొడ్డిని శుభ్రం చేసి మా పాఠశాలకు శ్రీకారం చుట్టాం.
ప్రారంభంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపమని చెప్పారు. వాళ్ల వెంటపడి ఒప్పించి పిల్లలను స్కూల్‌కు పంపేలా చేశాం. ఆ తర్వాత ఆ చుట్టు పక్కల ఉన్న గూడాల్లో ఏడు పాఠశాలలను ఏర్పాటు చేశాం. మా పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు బోధించి తరువాత మూడో తరగతి నుంచి సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తున్నాం. ప్రస్తుతం 200కు పైగా చిన్నారులు మా వద్ద చదువుకుంటున్నారు.
పిల్లలు పాఠశాలకు ఇష్టంతో రావాలనే కాన్సెప్ట్‌తో ప్రత్యేక కరిక్యులమ్ తయారు చేసుకున్నాం. తెలుగు, ఇంగ్లిష్ పదాలు చెప్పడంతో పాటు వారికి పాటలు, ఆర్ట్, గార్డెనింగ్, క్రీడలు మొదలైనవి నేర్పడానికి ప్రాధాన్యమిచ్చాం. ఇందులో బోధించేందుకు స్థానికంగా ఉన్న యువత ఆసక్తి చూపడంతో వారికి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశాం. ఒక్కో స్కూల్‌కు ఒక్క టీచర్ చొప్పున నియమించి విద్యార్థుల బాధ్యతలన్నీ అప్పగించాం. వారితో పాటు మూడు పాఠశాలలకు కలిపి ఒక కో ఆర్డినేటర్, మెంటార్‌ను నియమించాం. ఇలా మొత్తం 16 మందితో మా సెంటర్లు ముందుకు సాగుతున్నాయి.
విద్యార్థులకు వినూత్న బోధనలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం. ఆశ్రమ పాఠశాలలో చేరిన విద్యార్థులు ఎవరైనా మధ్యలో బడి మానేస్తే తిరిగి చేర్పించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. టీచర్లకు జీతాలు, ఇతర ఖర్చులు అన్ని కలిపి నెలకు రూ.80 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. సన్నిహితులు, స్నేహితుల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నాం. మేము చేసే పనిలో వారి తోడ్పాటు ఎంతో కీలకం. ఆదివాసి బిడ్డలను రేపటి తరంలో గొప్పస్థాయిలో నిలుపేందుకు మా ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
– రాజు పిల్లనగోయిన