చిన్న ఇల్లు కట్టాలన్నా, మరేదైనా భారీ నిర్మాణం చేపట్టాలన్నా ప్లానింగ్ తప్పనిసరి. నక్ష ఎంత పక్కాగా గీసినా.. నిర్మాణం ముందుకుసాగే కొద్దీ.. లోపాలు పలకరిస్తుంటాయి. ఇలా మారిస్తే బాగుండు అన్న ఆలోచనలూ స్ఫురిస్తుంటాయి. గోడౌన్లు, ఫ్యాక్టరీల్లో ఉండే నిర్మాణాల విషయంలో చిన్న తేడా అనిపించినా.. కాలంతోపాటు ఆర్థికంగా కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. అందుకే ప్లానింగ్‌లోనే అన్నిటికీ పరిష్కారం చూపుతున్నదామె. నిర్మాణం, ఇంటీరియర్ అన్నీ వర్చువల్‌గా కస్టమర్లకు చూపించి, ఓకే అన్న తర్వాతే కన్స్ట్రక్షన్ పనులకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో కేవలం కార్పొరేట్ కల్చర్‌కే పరిమితమైన వీఆర్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చింది ‘ఆహాన్ మెటల్ సొల్యూషన్’ వ్యవస్థాపకురాలు ఇనుగుర్తి శృతి. మెటల్ నిర్మాణాలకు డిజిటల్ రూపమిస్తూ.. వర్చువల్‌గా విజయం సాధిస్తున్న శృతి స్టార్టప్ స్టోరీ ఇది.
ఉమ్మడి నల్లగ్గొండ జిల్లాకు చెందిన ఇనుగుర్తి శృతి ఎంబీఏ చదివింది. ఆమెది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి హైదరాబాద్‌లోనే వెల్డింగ్ పనులు చేసేవారు. షెడ్డులూ, గోడౌన్లు, బడా మెటల్ నిర్మాణాలను చేపట్టేవారు. 30 ఏండ్లుగా అదేపనిలో ఆరితేరారు. కానీ, కాలానుగుణంగా మారిన టెక్నాలజీపై ఆయనకు అంతగా పట్టు చిక్కలేదు. దీంతో కొన్ని సందర్భాల్లో వచ్చే ఇబ్బందులు, నిర్మాణ డిజైన్‌లో మార్పులతో పనిభారం పెరుగుతున్నదన్న తండ్రి మాటలు శృతిని ఆలోచింపజేశాయి. ఆ ఆలోచనలే ఆమె స్టార్టప్ ప్రయాణానికి నాంది పలికేలా చేశాయి.
వ్యాపార అవకాశాలపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే ఆమెకు బుర్రకు తట్టిన ఆలోచనే ఆహాన్ మెటల్ సొలుష్యన్స్. తన తండ్రి నిర్మించే షెడ్డులు, గోడౌన్లు, ఇతర నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో ముందే చూపిస్తే బాగుంటుంది కదా అని ఆమెకు అనిపించింది. నిర్మాణం మొదలుపెట్టక ముందే త్రీడీ డిజైన్లు చిత్రీకరించి, వాటిని వర్చువల్ టెక్నాలజీ సాయంతో వినియోగదారులు వీక్షించేలా చేయడమే తన వ్యాపార సూత్రంగా ఎంచుకుంది. ఈ ఆలోచన తన తండ్రికి చెప్పినప్పుడు ‘బాగానే ఉంది! కానీ, మన వ్యాపారానికి ఉపయోగపడుతుందా?’ అని సందేహాన్ని వెలిబుచ్చారు ఆయన. శృతి మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఐడియాపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసింది. ఆ ధైర్యమే ఆమెను ఈ రోజు ‘ఆహాన్’ సంస్థకు యజమానురాలిగా నిలిపింది. 2020లో ఈ సంస్థను నెలకొల్పిందామె. ఫ్యాబ్రికేషన్ పనులను ముందుగానే ఆర్కిటెక్చరల్ డిజైన్ల సాయంతో త్రీడీ రూపంలోకి మారుస్తారు. వాటికి వీఆర్ టెక్నాలజీని జోడిస్తారు. దీంతో పని మొదలుపెట్టకుండానే.. కస్టమర్లు సూచించే మార్పులు చేర్పులు చేయవచ్చు. ఒకసారి డిజైన్ వినియోగదారులు లాక్ చేసిన తర్వాత ఫిజికల్‌గా సైట్లో పనులు ప్రారంభిస్తారు.
వెల్డింగ్ పనులు చేసే వారికి కార్పొరేట్ సంస్థల నుంచి ఆర్డర్లు తక్కువే. అలాంటిది ఓ బడా నిర్మాణ సంస్థ దగ్గర వ్యాపార అవకాశం కోసం వెళ్లిన సందర్భంలో తనకు రావాల్సిన ఆర్డర్‌ను కోల్పోయింది శృతి. ఆ సమయంలో వీ హబ్ తలుపుతట్టిందామె. ఆంత్రప్రెన్యూర్ అవగాహన తరగతులకు హాజరైంది.
ఆ తర్వాత ఆమె వ్యాపార స్వరూపమే మారిపోయింది. కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలంటే.. ఆ రేంజ్లో వాణిజ్య స్వరూపం ఉండాలని నిశ్చయానికి వచ్చింది. మార్కెటింగ్ నుంచి మొదలుకుని ఫైనాన్స్ వరకు అవసరమైన అన్ని అంశాలపై అవగాహన పెంచుకున్నది. శిక్షణ సమయంలో మెంటార్ అందించిన ప్రోత్సాహంతో తన స్టార్టప్ జర్నీ వేగం పెంచింది. ఓవైపు తండ్రికి వచ్చే ఆర్డర్లను చేస్తూనే… సొంతంగా తాను కూడా ఆర్కిటెక్చరల్ ఆర్డర్లు అందుకున్నది. అలా స్టార్టప్ ప్రారంభించిన ఏడాదిన్నరలోనే 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే గోడౌన్లు, షెడ్లు నిర్మించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ కేంద్రంగా ఆహాన్ మెటల్ సొల్యూషన్స్ సేవలు అందిస్తున్నది. 10 మంది ఇన్‌బౌండ్ ఆర్చిటెక్చర్లు, వర్చువల్ వీడియో క్రూతోపాటు మరో 50 మంది స్కిల్డ్ లేబర్‌తో ప్రాజెక్టులు చేస్తున్నది. సరికొత్త రంగంలో తనదైన ప్రతిభతో అవకాశాలు అందుకుంటూ ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్న శృతికి మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం!
నిర్మాణ రంగంలో వర్చువల్ టెక్నాలజీ వినియోగం ఇటీవల కాలంలో పెరిగినా, అందరికీ అందుబాటులో లేదు. ప్రస్తుతం ఈ తరహా సేవలు అందించే సంస్థలు కూడా తక్కువే ఉన్నాయి. ఫ్యాక్టరీలు, గోడౌన్లు, మల్టీ పర్పస్ భవనాలను వర్చువల్ వీడియో రూపంలోకి మార్చి, డిజైన్ నచ్చిన తర్వాతనే నిర్మాణ పనులు చేపడితే కాలం, డబ్బు వృథా తగ్గుతుంది. నిర్మాణ సమయంలో ఎలాంటి తప్పులకూ ఆస్కారం ఉండదు. వినియోగదారులకు కూడా తమ నిర్మాణంపై క్లారిటీ ఉంటుంది.
– కడార్ల కిరణ్