సైన్స్ ఊహ కాదు.. నిజం. కానీ, బట్టీ పడితే ఆ వాస్తవాలపై పట్టుచిక్కదు. సరదాప్రయోగాలతో సాధన చేస్తే.. సైన్స్ కరతలామలకం అవుతుందంటారు డాక్టర్ రత్నా కొల్లూరి. కష్టమైన సైన్స్‌ని ఇష్టంగామార్చాలన్నది ఆమె కోరిక కాదు.ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ కేవీ రావు అభిలాష. ఆయన ఆశయం కోసం స్థాపించిన కేవీ రావు సైంటిఫిక్ సొసైటీ పాతికేండ్ల పండుగ చేసుకుంటున్నది. బడి పిల్లలకు ప్రయోగశాలగా సేవలు అందిస్తున్న ఈ ప్రత్యక్ష ప్రయోగశాల సైంటిఫిక్ జర్నీని జిందగీతో పంచుకున్నారు. ఆ విశేషాలు డా. రత్న మాటల్లోనే..
చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ చేయాలనే కోరిక ఉండేది. కానీ, అందరిలా చదువు అయిపోగానే నేను కూడా ఉద్యోగంలో చేరిపోయాను. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ కేవీ రావు గారు మాకు బంధువు. ఆయన జీఎస్ఐలో జియోకెమికల్ ల్యాబరేటరీ ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. మానవాభ్యుదయానికి బాటలువేసేది వైజ్ఞానిక ఆవిష్కరణలేనని ఆయన నమ్మేవారు. దేశాభివృద్ధికి కావాల్సిన శాస్త్రవేత్తలు తయారు కాకపోతే మన దేశానికే కాదు ఏ దేశానికీ భవిష్యత్తు లేదని చెప్పేవారు. మన దేశంలో యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అంతగా లేదని, వాళ్లను సపోర్ట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. అయితే, తాను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం వల్ల.. ఆ పని పరిమితంగానే చేశానని బాధపడేవారు. ఆ మాటలు ఎప్పుడూ నా చెవుల్లో మార్మోగేవి!
నేను ఐఐటీ ఢిల్లీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను. కెమికల్ టెక్నాలజీలో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత అక్కడే పీహెచ్డీ కూడా చేశాను. మా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. మా ఇద్దరిలో ఒకరం సోషల్ సర్వీస్‌లో భాగం అవ్వాలనుకున్నాం. మావారి సపోర్ట్‌తో నేను సోషల్ సర్వీస్‌కు సిద్ధమయ్యాను. కేవీ రావు గారి సంకల్పం మేరకు యువ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నాను. సరే ఏదో ఒకటి కానివ్వండని రావు గారు పచ్చజెండా ఊపారు. 2000 సంవత్సరంలో ఆయన 80వ పుట్టిన రోజు వేడుక జరిగింది. చాలామంది జూనియర్స్ వచ్చి ఆయన్ను సన్మానించారు. ఆ శాస్త్రవేత్తల సపోర్ట్‌తో ఏదో ఒకటి చేయాలనుకున్నాం. అలా 2001లో కేవీ రావు సైంటిఫిక్ సొసైటీ (కేవీఆర్ఎస్ఎస్)ని స్థాపించాం.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో రసాయన శాస్త్ర పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేవీఆర్ఎస్ఎస్ తరఫున రీసెర్చ్ అవార్డ్‌ని ఏర్పాటు చేశాం. వైజ్ఞానిక సంస్థలు శాస్త్రవేత్తలకు అవార్డులు ఇస్తున్నాయి. కాబట్టి చదువుకుంటున్న వాళ్లను ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. మొదటి సంవత్సరం కెమిస్ట్రీ రీసెర్చ్ స్కాలర్స్‌కి పోటీలు పెట్టి అవార్డులు ఇచ్చాం. ఆ మరుసటి సంవత్సరమే కేవీ రావు గారు మరణించారు. అప్పటి నుంచి ఆయన స్మారకంగా ఆ పురస్కారాన్ని అందిస్తున్నాం. తర్వాతి కాలంలో జీవశాస్త్ర పరిశోధక విద్యార్థులకు, ఫిజిక్స్, మ్యాథ్స్ విద్యార్థులకు కూడా అవార్డులు ప్రవేశపెట్టాం. ఏటా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలను ఎంపిక చేస్తుంటాం. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఈ అవార్డుల ఎంపికకు జడ్జీలుగా వచ్చే శాస్త్రవేత్తలు ‘రీసెర్చ్ స్కాలర్స్‌ని ప్రోత్సహిస్తున్నారు.. సరే! పాఠశాలల పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగిస్తే ఇంకా బాగుంటుంది’ కదా అన్నారు. వాళ్ల సూచనతో జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి ‘స్మార్ట్ ఇన్నోవేషన్ అవార్డ్స్’ ఇవ్వడం ప్రారంభించాం. ఈ సంస్థ ఆధ్వర్యంలో క్విజ్, సైన్స్ ఫెయిర్, స్మార్ట్ ఇన్నోవేషన్ (సైన్స్ మీట్ ఆర్ట్) పేరుతో సైన్స్‌ని ఆర్ట్ ఫామ్‌లో వివరించే పిల్లలకు పోటీలు పెడుతున్నాం. తెలుగునాట మొదలైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దక్షిణ భారత దేశమంతటికీ విస్తరించాం.
పాఠశాల స్థాయి విద్యార్థులకు సైన్స్‌ని మరింత చేరువ చేసేందుకు పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్లో కేవీ రావు గారి ఇల్లుని సైన్స్ ల్యాబ్‌గా మార్చేశాం. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పాఠ్యాంశాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకునే వీలుంది. వైజ్ఞానిక సిద్ధాంతాలను ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటే పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే సైన్స్ నేర్చుకోవడాన్ని పిల్లలు కష్టంగా భావించరు. సరదాగా చదువుకోవడం వల్ల వాళ్లకు ఇంకా నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మన బడుల్లో పాఠాలు చెప్పే టీచర్లున్నారు. కానీ, వాటిని అనుభవపూర్వకంగా చెప్పే ప్రయోగశాలలు లేవు. సైన్స్‌ని కథ చెప్పినట్టు టీచర్లు చెప్పడం, పిల్లలు బట్టీ పట్టడం అందరికీ తెలిసిందే. ఈ బట్టీ చదువుల విద్యార్థుల్లో నుంచి భవిష్యత్ శాస్త్రవేత్తల్ని ఊహించలేం.
సైన్స్ సిద్ధాంతాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఆ ప్రయోగాలు చేసి తీరాల్సిందే. అప్పుడే పిల్లలకు ఆ సబ్జెక్టులో మంచి మార్కులు వస్తాయి, సైన్స్పట్ల ఆసక్తీ పెరుగుతుంది. అలా వారిలో ఉత్సుకతను పెంచడానికి ఓ బడిలాంటి సైన్స్ ల్యాబ్‌ని ఏర్పాటు చేశాం. చాలా పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ సరైన సదుపాయాలు ఉండవు. ఆ విద్యార్థులు వచ్చి తమ పాఠ్యాంశాల్లో ఉన్న జీవశాస్త్ర విశేషాలు, భౌతిక రసాయన శాస్త్ర సిద్దాంతాలను ప్రయోగపూర్వకంగా తెలుసుకునే వసతులు కల్పించాం. మేమేం ప్రయోగాలను చేసి చూపించం. పిల్లలతోనే ప్రత్యక్షంగా చేయిస్తాం. అప్పుడే వాళ్లకు అవి గుర్తుండిపోతాయి.
మా సైన్స్ ల్యాబ్‌కి చుట్టుపక్కల చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల పిల్లలు, ప్రభుత్వ పాఠశాలల పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ప్రతి రోజూ ఒక క్లాస్ జరుగుతుంది. రోజుకు నలభై మంది వరకు వస్తారు. వాళ్ల పాఠ్యపుస్తకాల్లో ఏ ప్రయోగాలు ఉంటే అవి చేయిస్తాం. ల్యాబ్ పరికరాలు, ప్రయోగాలకు కావాల్సిన రసాయనాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కొంత దూరంలో ఉన్న పాఠశాలల పిల్లల కోసం మేమే బస్ వేసుకుని వెళ్తాం. బస్సులో ప్రయోగాలకు కావాల్సిన కిట్లు ఉంటాయి. సరదాగా ఆడుకున్నట్టు వీటితో పిల్లలు ప్రయోగాలు చేసి సిద్ధాంతాలను నేర్చుకుంటారు. ఆసక్తి కలిగించిన తర్వాత ఇక అప్పుడప్పుడు మా సైన్స్ ల్యాబ్‌కి రమ్మని చెబుతాం.
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు బస్సుల్లో పిల్లల్ని తీసుకువస్తాయి. ఏ తరగతి వాళ్లకు ఆ పాఠ్య పుస్తకం ఆధారంగా ప్రయోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అలాగే మా సిబ్బంది కూడా పిల్లలకు సైన్స్ పాఠాలు చెబుతారు. వారంలో నాలుగు రోజులు బోధన ఉంటుంది. వేసవి సెలవుల్లో పిల్లల కోసం సైన్స్ క్యాంప్ నిర్వహిస్తాం. సూక్ష్మమైన కణాన్ని మైక్రోస్కోపులో, అనంతమైన ఖగోళాన్ని టెలిస్కోపులో చూపిస్తాం. సైన్స్‌ని కథలా వినకుండా కళ్లారా చూసే అవకాశం కల్పిస్తున్నాం. సైంటిఫిక్ భావనల్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుని వైజ్ఞానిక భావన పెంపొందిస్తున్నాం.
– నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరిగౌడ్