అమ్మ అవ్వాలన్న కల ప్రతి ఆడపిల్లకీ ఉంటుంది. దాన్ని చేరే క్రమంలో ఆమెకు తోడుగా ఉండేందుకు దవాఖానలు పనిచేస్తాయి. కానీ, పాతికేండ్ల నిండు చూలాలు బిడ్డను కనే క్రమంలో కన్నుమూస్తే.. ఆ అమ్మాయి ఇక లేదన్న వార్త.. వినే వారికే కాదు, చెప్పే డాక్టర్లకూ గుండె తడినే మిగుల్చుతుంది. అలాంటి ఆవేదనే తనను భారత్‌లో మిడ్వైఫరీ వ్యవస్థ తీసుకొచ్చే దిశగా అడుగులు వేయించిందని చెబుతారు ఫెర్నాండెజ్ ఆసుపత్రుల చైర్పర్సన్, ఎండీ ఎవిట ఫెర్నాండెజ్. మెరుగైన మంత్రసానుల వ్యవస్థ ఎంతో మంది అమ్మల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని నమ్మే ఆమె తమ విద్యాసంస్థ ద్వారా గడచిన ఆరేండ్లలో పది రాష్ర్టాలకు చెందిన 77 మంది మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్లకు శిక్షణనిచ్చారు. తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన ఆసుపత్రిని మహిళల కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఎందరో అమ్మలకు ప్రసవాన్ని మధురానుభూతిగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఎవిటా… జిందగీతో విలువైన సంగతులెన్నో పంచుకున్నారు.
మాది 75 ఏండ్ల హాస్పిటల్. నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మానాన్నా ఈ ఆసుపత్రిని నడిపేవారు. అమ్మ లెస్లీ గైనకాలజిస్టు. నాన్న లౌర్దెస్ ఫెర్నాండెజ్ ఫ్యామిలీ ఫిజీషియన్. వైద్య వృత్తి ద్వారా వాళ్లు చేస్తున్న సేవ, అందులో వాళ్లు చూపిస్తున్న అంకిత భావం, దానివల్ల రోగులకు కలుగుతున్న మేలు… అన్నీ నన్ను వైద్య విద్య వైపు నడిపించాయి. ‘ఇది చాలా కష్టమైన పని’ అని అమ్మ నన్ను తొలుత ప్రోత్సహించలేదు. ఎనిమిదేండ్ల వయసులో ఏర్పడిన లక్ష్యం, పెద్దవుతున్నా బలహీనపడకపోవడంతో ఇక కాదనలేకపోయారు. ‘ఏ పని చేస్తున్నా సేవా భావన ఉండాలనీ, ఆ తర్వాతే ఏదైనా’ అని అమ్మానాన్నా చెప్పేవారు. అలా చేస్తే దేవుడు మన వెంటే ఉంటాడనీ అనేవారు. నిజానికి వాళ్లు మనుషుల్లోనే దేవుడిని చూడటమూ నేర్పించారు. అదెలాగో నాన్నకు సంబంధించిన ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫెర్నాండెజ్ హాస్పిటల్ స్థాపించే నాటికి అమ్మ మాత్రమే డాక్టర్. నాన్న వ్యాపారం చేసేవారు. ఆసుపత్రి స్థాపన తర్వాత నిర్వహణ అంతా ఆయనే చూసుకునేవారు. ఈ క్రమంలో, ప్రజలకు వైద్యం చేయడం అన్నది ఆయనకు మంచి విషయంలా తోచింది. దాంతో నలభై ఏండ్ల వయసులో మెడిసిన్‌లో జనరల్ డిప్లొమా చేశారాయన. అప్పుడు పుస్తకాలు పట్టుకుని నాన్న చదువుకుంటుంటే నాకు చిత్రంగా అనిపించేది. కానీ అతికొద్ది కాలంలోనే మంచి ఫ్యామిలీ డాక్టర్‌గా పేరు గడించారు. ఎంతలా అంటే ఒకసారి ఆయనకు కడుపులో అల్సర్ వచ్చి 23 బాటిళ్ల రక్తం కావాల్సి వచ్చింది.
నాన్న దగ్గర చికిత్స తీసుకున్న చాలామంది పేషెంట్లకు చెందిన కుటుంబాలు ఆయనకు రక్తాన్ని ఇచ్చాయి. ఆ సంఘటన నాన్నలో ఎంతో మార్పు తెచ్చింది. ఆ తర్వాత ఆయన ఏనాడూ పేషెంట్ల దగ్గర నుంచి ఒక్క రూపాయీ తీసుకోలేదు. నాన్న కూర్చునే కుర్చీ వెనుక వృద్ధాశ్రమానికి దానం ఇచ్చేందుకు ఒక డబ్బా ఉండేది. ఏం ఇవ్వదల్చుకున్నారో అందులో వేయమనేవారు. దాని తాళం కూడా ఆ వృద్ధాశ్రమం నిర్వాహకుల దగ్గరే ఉండేది. అమ్మ సంపాదనతోనే ఇల్లు గడిచేలా వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ స్ఫూర్తి నాకు నరనరాల్లో ఇంకిపోయింది. నేను కూడా ఏనాడూ డబ్బు వెంట పడలేదు. ఆసుపత్రి డబ్బులు మళ్లీ తిరిగి ఆసుపత్రి అభివృద్ధికే వెళతాయి. అది విస్తరిస్తే మరింత మందికి మంచి సేవలు అందించగలుగుతాం కదా!
అమ్మానాన్నా హయాంలో మాది మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. అంటే ఈఎన్టీ, జనరల్ విభాగం… ఇలా రకరకాలు ఉండేవి. అయితే మా సోదరుడు చిన్న వయసులో చనిపోవడంతో అమ్మానాన్నా నాకు ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. అన్నట్టు నేను బెంగళూరులో ఎంబీబీఎస్ చేసి, లండన్ రాయల్ కాలేజీలో అబ్స్టాట్రీషియన్ కోర్సు చేశాను. అక్కడ ప్రసవాల కోసమే అచ్చంగా పెద్ద ఆసుపత్రి ఉండేది. అది నాకు చాలా నచ్చింది. దీంతో నేను బాధ్యత తీసుకున్నాక మా ఆసుపత్రిని అచ్చంగా ఆడవాళ్ల కోసమే, అందులోనూ ప్రసవాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. మల్టీ స్పెషాలిటీల కాలంలో ఇదేంటి? అంటూ అమ్మానాన్నా తొలుత అడ్డు చెప్పారు. కానీ నా పట్టుదల చూసి ఒప్పుకొన్నారు. మొత్తం అయిదుగురం డాక్టర్లం అచ్చంగా గర్భిణుల కోసమే పనిచేసేలా తొలుత దీన్ని ఏర్పాటు చేశాం. అందులోనూ అందరం కలిసి కూర్చుని చర్చించుకొని ఒక చికిత్సా విధానాన్ని రూపొందించుకున్నాం. అంటే నేను చేసినా, మరో డాక్టర్ చేసినా ఇక్కడ ఒకే రకమైన చికిత్స, మందులు లభించేలా అన్నమాట! అందుకోసం లండన్ రాయల్ కాలేజీ గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా పరిశీలించి వాటిని అనుసరించేవాళ్లం.
ఎప్పటికప్పుడు ఫలితాల గురించి మాట్లాడుకుంటూ మార్పులూ చేర్పులూ చేసుకునే వాళ్లం. అలా మేం ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాం. ‘లేబర్ అండ్ బర్త్ ప్రొటోకాల్స్’ పేరిట మేం తీసుకొచ్చిన ఈ పుస్తకం డాక్టర్ల సర్కిల్లో మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని ఆసుపత్రులు కూడా దీన్ని అనుసరిస్తున్నాయి. సౌకర్యవంతమైన, భద్రమైన ప్రసవం అంటే ఫెర్నాండెజ్‌కు వెళ్లాలి… అన్నంతగా పేరు వచ్చింది. అలా ఆదరణ పెరగడంతో మేం మా ఆసుపత్రిని విస్తరించాం. 1985లో నేను ఫెర్నాండెజ్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకునే నాటికి దాని సామర్థ్యం 40 పడకలు. ప్రస్తుతం మొత్తం 320 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లో మూడుచోట్ల హాస్పిటల్స్ నడుపుతున్నాం. ఒక నర్సింగ్ కళాశాల కూడా ఉంది. అయితే మా దగ్గర మిడ్ వైఫరీ కోర్సు ప్రారంభించడం అన్నది మరో రకమైన మలుపు.
మొదటి నుంచీ సిజేరియన్లకు మేం విరుద్ధం. సహజ ప్రక్రియలో ప్రసవం అయ్యేందుకు యోగా, చక్కటి వ్యాయామం, మంచి ఆహారంలాంటి వాటి సాయం అందిస్తుంటాం. ప్రసవాలు చేయడంలో మంచి పేరు సంపాదించడంతో ఇతర ఆసుపత్రుల నుంచి కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్న గర్భిణుల్ని పంపేవారు. కొన్నిసార్లు మేం కూడా వాళ్లను కాపాడలేకపోయేవాళ్లం. అంత చిన్నవయసు యువతులు చనిపోవడం అన్నది మనసును కలచివేసేది. మనదేశంలో మాతృ మరణాల రేటు చాలా ఎక్కువ. ఇది తక్కువగా ఉన్న దేశాలు ఏవి అని ఆరా తీస్తే స్వీడన్, డెన్మార్క్, నార్వే, యూకేలాంటివి కనిపించాయి. దీని కారణాలను తెలుసుకుంటే అక్కడో ప్రత్యేక వ్యవస్థ ఉంది. అదే మిడ్ వైఫరీ. మన భాషలో చెప్పాలంటే మంత్రసాని వ్యవస్థ అన్నమాట. అమ్మాయి గర్భిణి అని తెలియగానే మిడ్వైఫ్ వెళ్లి వాళ్ల బాగోగులు తెలుసుకుంటుంది.
ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన మంచీ చెడూ చెబుతూ తరచూ వాళ్లని గమనిస్తూ ఉంటుంది. రెండు మూడు నెలలకు డాక్టర్ దగ్గర చెకప్ ఉంటుంది. క్రిటికల్ సమయంలో డాక్టర్లు సేవలందిస్తారు. దీంతో అమ్మకు అనుక్షణం రక్షణ ఏర్పడుతుందన్నమాట. అందుకే అక్కడ మాతృమరణాల రేటు ఒక అంకెలో ఉంటే మన దగ్గర మూడంకెల్లో ఉండేది. దాని గురించి బాగా తెలుసుకున్నాక 2011లో దేశంలోనే తొట్ట తొలిసారిగా మా ఆసుపత్రిలో మిడ్వైఫరీని ప్రారంభించాం. నర్సింగ్ చదువుకున్న నైపుణ్యం కలిగిన వ్యక్తులు మిడ్‌వైఫ్‌లుగా ఇక్కడ శిక్షణ పొందుతారు. వాళ్లే చక్కగా పురుడు కూడా పోయగలరు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాక మా దగ్గర కూడా సిజేరియన్ల రేటు మరింత తగ్గింది. సమస్యలను ముందు నుంచీ తెలుసుకుంటూ ఎందరో అమ్మలను కాపాడగలిగాం.
భారత్‌లో మాతాశిశు మరణాలను అరికట్టేందుకు సూచనలు ఇమ్మంటూ 2016 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూనిసెఫ్ సంస్థ పిలిచింది. కేంద్ర ప్రభుత్వాన్నీ ఆహ్వానించింది. మా దగ్గర మిడ్వైఫరీ వ్యవస్థ ఉందంటూ నివేదికలు సమర్పించాం. అది వాళ్లను ఆకట్టుకుంది. ప్రభుత్వ నర్సులకూ శిక్షణనిస్తారా అని కేంద్రం అడిగింది. మరుసటేడాది తెలంగాణ ప్రభుత్వమూ మాతో కలిసి పనిచేయమంటూ పిలిచింది. దీంతో మా నర్సింగ్ కాలేజీలోనే మిడ్‌వైఫరీకి సంబంధించి ప్రత్యేక కోర్సు తయారు చేసి బోధించడం ప్రారంభించాం.
ఇప్పటి దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్ తదితర రాష్ర్టాలకు సంబంధించి 77 మంది మిడ్వైఫరీ ఎడ్యుకేటర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. అంటే ఆయా రాష్ర్టాలకు వీళ్లు తిరిగి వెళ్లి వివిధ ఆసుపత్రులకు సంబంధించిన మిడ్వైఫ్లకు శిక్షణనిస్తారన్నమాట. వీళ్లందరూ కలిసి మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రసవ ప్రక్రియకు సాయపడతారు. ప్రతి మహిళా పునర్జన్మగా భావించే ఈ అపురూప ఘట్టం ఆనందంగా, ఆరోగ్యంగా పూర్తి చేసేందుకు సాయపడాలన్న మా ఆశ ఈ విధంగానూ నెరవేరుతున్నందుకు మరింత సంతోషంగా ఉంది! ప్రతి జిల్లా, పట్టణంలోనూ ఫెర్నాండెజ్ ఆసుపత్రి ఏర్పాటు చేసి సేవలందించాలన్న మా లక్ష్యం కూడా మునుముందు నెరవేరాలని కోరుకుంటున్నా.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– గడసంతల శ్రీనివాస్