Lasya Nanditha | కర్ణాటక సంగీతం అంటే ప్రాణం. కచేరీ చేయాలని కోరిక. కానీ, నాన్న సాయన్న ఆదేశంతో ప్రజా జీవితంలోకి వచ్చింది. జయాపజయాలకు అతీతంగా ప్రజల మధ్యన నిలిచింది, జన హృదయాలు గెలిచింది. తండ్రి హఠాన్మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజానీకానికి ‘నేనున్నా..’ అని ధైర్యం చెప్పింది. సాయన్న కూతురిగా, కేసీఆర్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నది జ్ఞాని లాస్యనందిత. తండ్రిచాటు కూతురి నుంచి తండ్రిని తలపించే తనయ అనిపించుకునే దాకా.. లాస్య నందిత ప్రజా జీవిత ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నేను పుట్టే సమయానికే నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నాయకత్వ శైలిని చిన్నప్పటి నుంచే గమనించేదాన్ని. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడూ కలగలేదు. కర్ణాటక సంగీత గాయని కావాలని మాత్రం ఉండేది. ఓ గురువు దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాను. అలా అని చదువుల్ని నిర్లక్ష్యం చేయలేదు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాను. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. నాన్న ఆదేశంతో 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు (పికెట్) నుంచి పోటీ చేశాను. కానీ, అతికొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ అపజయం కొంత బాధ కలిగించింది. ప్రజా జీవితంలో ఇవన్నీ సాధారణమేననీ, మహామహా నేతలకే ఓటమి తప్పలేదని నాన్న ఓదార్చారు. తదుపరి ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందాను. నిత్యం జనం మధ్యనే ఉన్నాను. ప్రజల సమస్యలు పరిష్కరించాను. కానీ, 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. అదే సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతింది. దీంతో, అనుక్షణం నీడలా వెన్నంటి ఉన్నాను. కంటోన్మెంట్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాను. నాన్న మరణం నన్ను తీవ్రంగా కుంగదీసింది. వ్యక్తిగత జీవితంలో, రాజకీయాల్లో ఆయనే నా తొలి గురువు. ఇన్నేళ్లూ ఆ మహావృక్షం నీడలో ఉన్నాను. ఇప్పుడు, ఆయన స్ఫూర్తితో స్వతంత్రంగా అడుగులు వేస్తున్నాను.

1984 నుంచీ నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితం ఆయనది. నిత్యం జనంతో మమేకం అయ్యేవారు. జయాపజయాలకు అతీతంగా పనిచేశారు. ఎప్పుడూ బయటే ఉండేవారు. నాన్నతో ఓ పది నిమిషాలు మాట్లాడినా అపురూపంగా అనిపించేది. అలాంటిది, చివరి దశలో ప్రతిక్షణం నాన్న సమక్షంలో గడపడం చాలా సంతృప్తినిచ్చింది. మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేనే చిన్నదాన్ని. దీంతో నా మీద పిసరంత ప్రేమ ఎక్కువగానే చూపేవారు. మా అక్క పిల్లల్ని ఎంతగానో ప్రేమించేవారు. ఖాళీ దొరికినప్పుడల్లా వాళ్లతో కాలక్షేపం చేసేవారు. నాన్న బంధాల మనిషి. స్నేహితుల్నీ, కార్యకర్తల్నీ ప్రాణంకంటే మిన్నగా భావించేవారు. నాన్నకు ఓపిక ఎక్కువ. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం. ప్రతి ఒక్కర్నీ పేరుపెట్టి పిలిచేవారు. నాయకుడు కన్నతండ్రిలా వ్యవహరించాలని తరచూ చెప్పేవారు. ఎన్నికల్లో గెలిచే వరకే రాజకీయాలు. ఆ తరువాత ప్రజ లందరూ ఒకటే, అభివృద్ధే అజెండా కావాలని అనేవారు. ఆ మాటలు అక్షర సత్యాలు.

నాయకుడు ఆకాశంలోంచి ఊడిపడడు. ప్రజల్లోంచి వస్తాడు. ప్రజల తలరాతను మారుస్తాడు. కేసీఆర్ అచ్చంగా అలాంటి నాయకుడే. గమ్యాన్ని ముద్దాడే వరకు ఆయన విశ్రమించలేదు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని అవరోధాలు సృష్టించినా మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారు. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. కాళేశ్వరం వంటి మహాద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి. సబ్బండ వర్గాలకు ఆయన అండగా ఉంటున్న తీరు ఇతర రాష్ర్టాల నేతలను, ప్రజలను ఆకర్షిస్తున్నదంటే.. ఇంతకన్నా ఏం చెప్పగలం? సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయినా, ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేయడం విడ్డూరంగా అనిపిస్తున్నది. తెలంగాణ ప్రగతి మహోజ్వలంగా సాగుతున్న దశలో నేను రాజకీయాల్లో ఉండటం.. బీఆర్ఎస్ సైన్యంలో భాగం కావడం సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. నాన్నపై ఉన్న గౌరవంతో కేసీఆర్ నాకు ఈ అవకాశం కల్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో ‘సాయన్న కుటుంబం మా కుటుంబమే’ అని ప్రకటించిన ఆయన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కంటోన్మెంట్‌పై గులాబీ జెండా ఎగరేసి, కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాను.
ప్రజా జీవితంలో నాన్నను అపారంగా ప్రభావితం చేసిన నేతలు ఇద్దరే.. ఎన్టీఆర్, కేసీఆర్. అప్పట్లో తరచూ ఎన్టీఆర్ క్రమశిక్షణ, నిబద్ధత గురించి ప్రస్తావించేవారు. అనంతరం, కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరును అబ్బురంగా చెప్పేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం అశోక్‌నగర్‌లో ఉండేవాళ్లం. ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్ పరిసరాలు ఉద్యమకారులతో కిటకిట
లాడేవి. జై తెలంగాణ నినాదాలు హోరెత్తేవి. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేవారికి ఉచితంగా భోజనం, మంచి నీళ్లు అందించేదాన్ని.
…? చింతపల్లి వెంకట నర్సింహారెడ్డి
– కె. సాయిబాబా