Parvati Nayar | తేలికగా దొరికేది అంటే ఎవరికైనా చులకనే. అందుకు ఉదాహరణ నీరు. నీటి వృథా ఓవైపు, జల కాలుష్యం మరోవైపు.. ఆ అమూల్యమైన వనరును తరిగిపోయేలా చేస్తున్నాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని అనుకున్నారు చెన్నైకి చెందిన పార్వతి నాయర్. ఆమె ఓ కళాకారిణి. దేశంలోనే అత్యుత్తమ విజువల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు.
పార్వతి ప్రాణంపోసిన కళాఖండాలు సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నో దేశాల్లో, అనేక మ్యూజియంలలో కనిపిస్తాయి. సామాజిక అంశాల మీద ఎక్కువగా కళాకృతులు రూపొందించే పార్వతి దృష్టి చెన్నైలోని అడయార్ నది మీద పడింది. ఒకప్పుడు అది అరుదైన జీవ వైవిధ్యానికి చిరునామా. సాగులో, తాగులో చెన్నై పరిసర ప్రాంతాలకు అండగా నిలిచిన జీవనది.
ఆ అడయార్ ఇప్పుడు మురికికూపంగా మారడం చూసి పార్వతి చలించిపోయారు. అందులో ఎక్కువగా కనిపించే ప్లాస్టిక్ బాటిల్స్, బల్బులు లాంటి వ్యర్థాలతో ఓ కళాకృతిని రూపొందించారు. తన వంతుగా ప్రజలకు ఓ హెచ్చరిక చేశారు. ‘నీరు లేకపోతే నాగరికత లేదు. నీరు లేకపోతే మీరూ లేరు’ అని సూటిగా చెబుతారామె.