మారుమూల పల్లెలకు దూరంగా ఉండేవి రవాణా సౌకర్యాలొక్కటే కాదు. అక్షరాస్యత, ఆరోగ్య సేవలు కూడా. ఛత్తీస్‌గఢ్‌లాంటి వెనుక బడిన రాష్ర్టాల్లోని మారుమూల పల్లెల్లో, అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చదువు అన్నది ఎన్నో ఏండ్లుగా అందరాని చందమామే. అక్కడి పిల్లలను విద్యావంతుల్ని చేయాలన్న ఆశయంతో కాలినడకన 570 గ్రామాలు ప్రయాణించారు డాక్టర్ బుధరీ తాతీ. గత 40 ఏండ్లుగా ఆమె చేసిన నిరంతర కృషికి గానూ అక్కడి పల్లెలు మార్పుతో పరిమళిస్తే, ఆమెను పద్మశ్రీ పలకరించింది. ఈ సామాజిక కార్యకర్త స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం..
భారతదేశపు అసలైన బలం పల్లెల్లోనే ఉంటుంది. కానీ రకరకాల కారణాలతో అవి వెనుకబాటు తనంలోనే ఉంటాయి. అలాంటి చోట్ల జీవించే వారికి సేవ చేయడమే తన అసలైన జీవిత లక్ష్యం అని భావించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుధరీ తాతీ. ఎందుకంటే ఆమె కూడా అలాంటి ఓ కుగ్రామంలోనే పుట్టారు. అక్కడి అవసరాలు తెలుసు కనుకనే ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు ఉచిత హాస్టల్‌ను స్థాపించడంతో పాటు వందల మంది మహిళలకు స్వావలంబన కల్పించేలా ప్రత్యేక సంస్థనూ ప్రారంభించారు. ఏ స్వచ్ఛంద సంస్థలూ వెళ్లలేని అపాయకరమైన ప్రాంతాలకూ కాలినడకన వెళ్లి, వాళ్ల మనసుల్ని గెలుచుకుని అక్కడి వారి బాగుకు పాటు పడ్డారు. ఈ సేవను ఆమె అతి పిన్న వయసులోనే ప్రారంభించారు.
బుధరీ తాతీ 1966 సంవత్సరం సెప్టెంబరు 15న బస్తర్ ప్రాంతం దంతెవాడ జిల్లా హిరానార్ గ్రామంలో జన్మించారు. తన పసితనం ఎలాంటి విద్య, వైద్య సదుపాయాలు లేని ఆ ఊళ్లోనే గడిచింది. ఆరేండ్ల వయసులో చదువు కోసం గిరిజన ఆశ్రమంలో చేరి అక్కడే పదోతరగతి పూర్తి చేశారు. ఆ సమయంలోనే తన ఊరిలాంటి అనేక ఊళ్లలోని పిల్లల చదువు కోసం పనిచేయాలని సంకల్పించుకున్నారు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ‘ఆల్ ఇండియా వనవాసి కల్యాణ్ ఆశ్రమం’లో చేరారు. ఇది గిరిజన సంక్షేమం కోసం పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. అలా టీనేజీలోనే ఆమె ప్రయాణం సేవ వైపు కదిలింది. అయితే తమ ప్రాంతం వాళ్లకు ఏ సేవ అవసరం అన్నది కూడా ఆమె అర్థం చేసుకున్నారు. తన చుట్టు పక్కల పిల్లలు ఏనాడూ బడి ముఖం చూడకపోవడం, సమాజంలో మహిళలకు కనీస గౌరవం, స్వేచ్ఛ లేకపోవడాన్ని గమనించారు. అందుకే విద్య ద్వారానే గిరిజన మహిళలు స్వయం సమృద్ధి సాధించగలరని, సమాజంలో మార్పు తీసుకురాగలరని ఆమె బలంగా నమ్మారు. అందుకోసం పెళ్లి చేసుకోకుండా, తన జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.
రాజకీయ నాయకులు అధికారం కోసం పాదయాత్రలు చేయడం సహజమే. కానీ బుధరీ తాతీ మాత్రం తన ఆశయం కోసం పాదయాత్రను ప్రారంభించారు. బస్తర్ ప్రాంతంలోని అనేక ఊళ్లలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి ప్రభుత్వ అధికారులు కూడా వెనుకాడేవారు. ఇక, పాఠశాలల సంగతి సరేసరి. రోడ్లూ ఉండవు. అందుకే ఆమె ఆ ఊళ్లని చేరడానికి అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. రాళ్లూ ముళ్లను దాటుతూ కాలినడకన ఒక్కొక్క ఊరికీ వెళ్లి వారికి ఆడపిల్లల చదువు ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో కొందరు ఆమె మీద దాడికీ యత్నాలు చేశారు. కానీ భయపడకుండా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా తాను భయపడి ఉంటే ఈనాటికీ ఎంతో మంది మహిళలు చీకటిలో ఉండిపోయేవారని ఆమె గుర్తు చేసుకుంటారు. ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 570కి పైగా గ్రామాలకు ఆమె ప్రయాణించారు. అయితే ఇలా ఆమె నడిచి వెళ్తూ పాఠశాలలకు పిల్లల్ని పంపేలా ప్రోత్సహిస్తున్నప్పుడు అసలు బళ్ల దగ్గర పిల్లలు ఉండేందుకు వసతి గృహాలు లేవన్న విషయం వెలుగు చూసింది.
దాంతో ఆమె అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన బాలికల కోసం 1990వ సంవత్సరంలో బర్సూర్‌లో ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే వాళ్లలో మొదటి తరానికి చదువును దగ్గర చేయడం దీని లక్ష్యం. అప్పుడు అందులో 11 మంది ఆడపిల్లలు మాత్రమే చేరారు. ప్రస్తుతం ఇవి కాక మరో రెండు ప్రాంతాల్లోనూ హాస్టళ్లు ఏర్పాటు చేసి చదువుకు సాయమందిస్తున్నారు. ఇప్పటి దాకా 565 మంది ఆడపిల్లలు వీటిల్లో ఉచితంగా వసతి పొంది చదువుకున్నారు. ఆ విధంగా ఆమె అడవుల్లోకి నడిచి, పిల్లల్ని బడివైపు నడిపించారు.
గిరిజన మహిళల్ని స్వయం సమృద్ధి వైపు నడిపే ఉద్దేశంతో ఆమె ‘మా శంఖిణి మహిళా ఉత్థాన్ సంస్థ’ను ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మంది స్త్రీలకు విద్య, స్వావలంబన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కుట్టు పనులు, హస్త కళల్లో శిక్షణ ఇచ్చి కనీసం 500 మంది కన్నా ఎక్కువ మహిళలు తమ స్వంత కాళ్ల మీద నిలబడేలా స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థిక దన్నునీ అందించారు. అంతేకాదు, బస్తర్ ప్రాంతంలో నిరాదరణకు గురవుతున్న వయోధికులకు నీడ కల్పించేలా వృద్ధాశ్రమాన్నీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలను పల్లెలకు చేరవేయడం, అర్హులకు అందజేయడంలోనూ ఆమెది కీలకపాత్ర. తన సంస్థ ద్వారా ప్రతి ఊళ్లో స్వచ్ఛంద కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసి రకరకాల పనుల్ని పూర్తి చేస్తూ వచ్చారు. అక్కడి స్త్రీలు, ఆడపిల్లలు ఆమెను బడే దీదీ (పెద్దక్క) అనీ, బువా (అత్త) అనీ నోరారా పిలుస్తుంటారు.
పల్లె ప్రజల ఆరోగ్య రక్షణకూ ఆమె పాటు పడ్డారు. సికిల్ సెల్ డిసీజ్, రక్త హీనత, కామెర్లు, దీర్ఘకాలిక తలనొప్పులు, కిడ్నీ వ్యాధులు, పోషకాహార లేమి… తదితర సమస్యల మీద అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ వచ్చారు. స్వతహాగా ఆమె కూడా మూలికా ఔషధాల గురించి అవగాహన కలిగి ఉన్నా, అందుబాటులో ఉన్న వీటి గురించి చెబుతూనే డాక్టర్లకు చూపించుకొని సరైన మందులు వాడాల్సిన సందర్భాల గురించీ ప్రజల్ని జాగృత పరిచారు. ఇలా గత నలభయ్యేండ్లుగా తన శక్తినంతా ఆదివాసీల జీవితాలను మెరుగు పరిచేందుకే ధార పోసిన ఆమెది అచ్చంగా నిస్వార్థ సేవ. అందుకే అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటుగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఈ ఏడాది ఆమె చెంత చేరింది. తాను పుట్టిన నేలకు శక్తి వంచన లేని సేవ చేస్తున్న ఈమె ముందు తరాలకు అసలైన మార్గదర్శి!