గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా కష్టమైన సబ్జెక్ట్.. ఇంగ్లిష్. గ్రామర్ సూత్రాలపై పట్టుకుదరక ఒత్తిడికి గురవుతుంటారు పాపం. అలాంటి పిల్లలకు సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ బోధిస్తున్నారు భూక్యా గౌతమి. తను ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. కొత్తగూడెం దగ్గరి సెవెన్ ఇైంక్లెన్ ఏరియాలోని ఓ పేద గిరిజన కుటుంబంలో పుట్టారు. తండ్రికి చదివించాలని ఉన్నా.. సమాజ కట్టుబాట్ల మేరకు పదహారేండ్లకే పెండ్లి చేశారు. మెడిసిన్ సీటు సంపాదించినా కొన్ని కారణాల వల్ల ఎంబీబీఎస్ కొనసాగించలేక పోయారు. అయినా చదువు మీద మక్కువకొద్దీ, భర్త ప్రోత్సాహంతో దూరవిద్యలో పీజీ చదివారు.
తర్వాత బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే అయినా.. హై స్కూల్లో శంకర్రావు మాస్టారు పాఠం చెప్పే విధానం ఇంగ్లిష్ మీద ఇష్టం పెంచింది. అందుకే తన విద్యార్థుల్నీ ఆంగ్లంలో మెరికల్లా తీర్చిదిద్దాలనుకున్నారు. నాటికల ద్వారా పాఠాలు బోధించడం గౌతమి ప్రత్యేకత. కరోనా లాక్డౌన్లో వీడియో క్లాసులు అనివార్యంగా మారాయి. ఆమె పనిచేసే పాఠశాలలో పిల్లలకు సమయానికి ఫోన్లు అందుబాటులో ఉండేవి కావు. ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేసేది కాదు. దీంతో క్లాసులు రికార్డు చేసి వాట్సాప్‌లో పంపేవారు. కానీ ఇదే సమస్య మిగతా పల్లెల్లోని పిల్లలకూ ఉంటుంది కదా.. అన్న ఉద్దేశంతో 2020లో ‘ట్యూబ్ ఇంగ్లిష్’ పేరిట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల మంది ఛానెల్‌కు సబ్స్ర్కైబర్లుగా మారారు.
ప్రస్తుతం ఆ సంఖ్య అయిదున్నర లక్షలకు పైనే. ఆ ఉత్సాహంతో ట్యూబ్ ఇంగ్లిష్ యాప్‌నూ ప్రారంభించారు. ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పెద్దలకు సైతం ఆన్లైన్లో బోధిస్తున్నారు. ‘పదో తరగతి నుంచే చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు చెప్పేదాన్ని. ఇప్పుడు విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాళ్లూ నా తరగతులు వింటున్నారు. నేను ప్రత్యేక శ్రద్ధతో ఇంగ్లిష్ నేర్పిన ఓ విద్యార్థి స్పెయిన్‌లో పెద్ద ఉద్యోగంలో చేరాడు. నా విద్యార్థుల్లో ఎన్ఆర్ఐలూ ఎంతోమంది ఉన్నారు. ఈ ఉద్యోగం, గుర్తింపు నా శ్రమకు ఫలితాలని భావిస్తాను. అదృష్టం అనే తలుపు తెరుచు కోవాలంటే శ్రమ అనే తాళం చెవి తప్పక ఉండాలని నా విద్యార్థులకు చెబుతుం టాను’ అంటారు గౌతమి.